అక్రమ మద్యంపై నిరంతర నిఘా: మంత్రి గౌడ్

107
తెలంగాణ రాష్ట్ర గజిటెడ్ అధికారుల సంఘం డైరీని ఆవిష్కరిస్తున్న గవర్నర్ నరసింహన్

హైదరాబాద్, మార్చి 7 (న్యూస్‌టైమ్): కల్తీ, అక్రమ, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యంపై దండయాత్ర చేయాలని తెలంగాణ అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు. తన అధ్యక్షతన పర్యాటక భవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్, అదనపు కమిషనర్ అజయ్ రావుతో పాటు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అదేశాల మేరకు రాష్ట్రంలో గుడుంబాను ఇప్పటికే నిషేధించటం జరిగిందన్నారు.

ఇంకా ఎక్కడైన మిగిలి ఉంటే దాన్ని పూర్తిగా నిర్మూలించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను అదేశించారు. రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, కల్తీ మద్యం ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా సరఫరా కాకుండా నిరోధించాలని అధికారులకు దిశనిర్ధేశనం చేసారు. గతంలో ఆబ్కారీ శాఖకు 6 స్వంత భవనాలు మాత్రమే ఉండేవి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 98 స్వంత భవనాలను మంజూరు చేయడం జరిగిందని, వాటిని జూన్‌లోగా నిర్మించేందుకు, మిగిలిన భవనాలను కూడా పూర్తి చేసేలా ప్రణాళికలను రూపోందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సమీక్షలో నిర్ణయించారు.

మద్యం డిపోలకు సొంత భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆబ్కారీ శాఖ ఆధికారులను కోరారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు హరితహారంలో భాగంగా తాటి, ఈత వనాలు పెద్ద ఏత్తున పెంచాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు దఫాలుగా 2 కోట్ల 74 లక్షల తాటి, ఈత చెట్లను ఇప్పటికే నాటామని అధికారులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు వివరించారు. నాటిన ఈత, తాటి వనాలకు నీటి సరఫరా, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వసతులు కల్పించి వాటిని సంరక్షించాలని ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అబ్కారీ శాఖాధికారులను అదేశించారు. ముఖ్యమంత్రి అదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయితీలో మంజూరు చేసిన నర్సరీలలో 10 నుండి 20 శాతం మేరకు ఈత, ఖజ్జూర మెుక్కలు పెంచి రాబోయే వర్షా కాలంలో నాటాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే 3549 గ్రామ పంచాయితీలలో 1 కోటి 18 లక్షల ఈత మెుక్కలు పెంచటానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రణాళికలు రూపోందించామని అబ్కారీ శాఖ అధికారులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు వివరించారు. ఈత, ఖజ్జూర మెుక్కలు పెంచటానికి గ్రామ సర్పంచ్‌లు, పంచాయితీ అధికారులు, సోసైటీలు, గీత వృత్తిదారులు మరింత ముందుకు రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. రాబోయే ఐదు సంవత్సరాలలో 100 శాతం స్వచ్చమైన కల్లు రాష్ట్రంలో లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అబ్కారీ శాఖ అధికారులకు అదేశాలు జారీ చేసారు.

ముఖ్యమంత్రి అదేశాల మేరకు కల్లు వృత్తిదారులను ప్రోత్సహించటానికి బీసీ సంక్షేమ శాఖ ద్వారా వృత్తి నైపుణ్యత పెంపోందించటానికి, వారిని అర్థికంగా బలపరచటానికి ప్రణాళికలను రూపోందించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను అదేశించారు. అబ్కారీ శాఖ అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అకాంక్షించారు. మంత్రి గురువారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర గజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులతో కలిసి మంత్రి గవర్నర్‌ను కలిశారు.