పాక్‌లో 120 మంది ఉగ్రవాదుల నిర్బంధం

49

లాహోర్, మార్చి 7 (న్యూస్‌టైమ్): పుల్వామా దాడి నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుంచి ఎదురవుతున్న విమర్శలను తట్టుకునేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు దిగింది. ఇందులో భాగంగా ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా (జేయూడీ) ఉగ్రవాద సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయాన్ని, దాని అనుబంధ సేవా సంస్థ ఫలాహే ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్‌ఐఎఫ్) కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నామని పాక్ ప్రభుత్వం గురువారం తెలిపింది. ఉగ్రవాద సంస్థల అణచివేతలో భాగంగా 120 మందికి పైగా ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొంది. జాతీయ కార్యాచరణలో భాగంగా లాహోర్‌లోని నిషేధిత జేయూడీ, ఎఫ్‌ఐఎఫ్ కార్యాలయాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని పాక్ ప్రభుత్వం తెలిపింది.

పంజాబ్ రాష్ట్రంలోని నిషేధిత సంస్థలకు చెందిన మసీదులు, మదర్సాలు, ఇతర సంస్థలను కూడా నియంత్రణలోకి తీసుకున్నామని పేర్కొంది. నిషేధిత సంస్థలకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యల్ని ఉద్ధృతం చేశామని తెలిపింది. జేయూడీ భవనాన్ని స్వాధీనం చేసుకుంటున్నప్పుడు హఫీజ్ సయీద్, ఆయన మద్దతుదారులు అభ్యంతరం చెప్పలేదని పంజాబ్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.

జాతీయ కార్యాచరణలోని లక్ష్యాలను సాధించే వరకు నిషేధిత సంస్థలకు వ్యతిరేకంగా తమ చర్యలు కొనసాగుతాయని పాక్ పేర్కొంది. అయితే, పాక్ చేపట్టిన ఈ చర్యను భారత్ కేవలం కంటితుడుపు ప్రయత్నంగా అభివర్ణించింది. ఉగ్రవాదాన్ని నియంత్రించాలన్న ఆలోచన ఉంటే ఇటువంటి ప్రయత్నం ఎప్పుడో చేసుండాల్సిందని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ సైనికాధికారి వ్యాఖ్యానించారు.