శ్రీ‌వారి సేవ‌కులకు సొంత ప్రాంతాల్లోనూ ధార్మిక కార్య‌క్ర‌మాలు

133

తిరుమల, మార్చి 1 (న్యూస్‌టైమ్): వివిధ ప్రాంతాల నుండి వ‌స్తున్న శ్రీ‌వారి సేవ‌కులు సొంత ప్రాంతాల్లోనూ ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ కోరారు. నూత‌న శ్రీ‌వారి సేవ భ‌వ‌నంలో శ్రీ‌వారి సేవ‌కుల‌తో ఈవో మాట్లాడారు. రూ.96 కోట్ల‌తో నూత‌న శ్రీ‌వారి సేవ భ‌వ‌న స‌ముదాయాల‌ను నిర్మించామ‌ని, ఇక్క‌డ మంచాలు, ప‌రుపులు, స‌త్సంగం హాలు, రిక్రియేష‌న్ హాలు, అన్న‌ప్ర‌సాదాలు త‌దిత‌ర అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించామ‌ని చెప్పారు.

వివిధ విభాగాల్లో భ‌క్తుల‌కు అందుతున్న సౌక‌ర్యాల‌పై శ్రీ‌వారి సేవ‌కుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. సేవావిధులు ముగించుకుని ఖాళీగా ఉన్న స‌మ‌యంలో సేవ‌కులు ధార్మిక జ్ఞానాన్ని పెంచుకునేందుకు వీలుగా ధార్మిక వెబ్ సైట్లను, ఆధ్యాత్మిక పుస్త‌కాల‌ను అందుబాటులో ఉంచుతామ‌న్నారు. శ్రీ‌వారి సేవ‌కులంద‌రూ టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ వెబ్‌సైట్‌లో స‌భ్యులుగా న‌మోదు చేసుకోవాల‌ని కోరారు. ఈ త‌నిఖీల్లో టీటీడీ తిరుమ‌ల జేఈవో కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు, సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) వేంక‌టేశ్వ‌ర్లు, ఇఇ సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.