వెంకన్న భక్తులకు మరింత మెరుగైన సమాచారం

155

తిరుపతి, మార్చి 1 (న్యూస్‌టైమ్): టీటీడీ కాల్‌ సెంటర్‌లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు మరింత వేగవంతంగా మెరుగైన సమాచారం అందించాలని టీటీడీ తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం కాల్‌ సెంటర్‌ సిబ్బందిని ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో కాల్‌ సెంటర్‌‌ల పనితీరుపై సంబంధిత అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల నుండి వస్తున్న కాల్స్‌కు వేగవంతంగా సమాచారం అందించాలన్నారు.

టీటీడీ కాల్‌ సెంటర్‌లలో టీటీడీలోని అన్ని విభాగాల డైనమిక్‌ డాటాను ఎప్పటికప్పుడు క్రోడికరించుకోవాలన్నారు. తద్వారా భక్తులు పలు విభాగాల సమాచారం అడిగినప్పుడు సులభంగా సమాచారం అందించవచ్చన్నారు. అదేవిధంగా తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. భక్తుల నుండి సలహాలు, సూచనలు, ఫిర్యాదులు లేదా సలహాలు వచ్చినప్పుడు సంబంధిత విభాగపు అధికారి వెంటనే స్పందించేలా ఇంటిగ్రేటెడ్‌ కంప్లయింట్‌ రెస్పాంసివ్‌ సిస్టమ్‌ను మెరుగ్గా ఉపయోగించుకోవాలన్నారు. అదేవిధంగా ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత విభాగాధిపతికి అలర్ట్‌ వచ్చేటట్లు అప్లికేషన్‌లో మార్పులు చేయాలన్నారు.

‘సప్తగిరి’ మాస పత్రిక చందాదారుల చిరునామా, ఫోన్‌ నెంబర్లు, ఈ-మెయిల్‌ ఐడీలు తదితర వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ పూర్తి చేయాలన్నారు. తద్వారా సకాలంలో ‘సప్తగిరి’ మాస పత్రికను పాఠకులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఐటీ విభాగాధిపతి శేషారెడ్డి, కాల్‌ సెంటర్‌ ఏఈవో ఆనందరాజు, ఇడిపి ఒఎస్‌డి వెంకటేశ్వర్లు నాయుడు, కాల్‌ సెంటర్‌ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.