అహ‌మాదాబాద్ మెట్రో రైలు రెండో దశ

93

అహ‌మాదాబాద్, ఫిబ్రవరి 26 (న్యూస్‌టైమ్): రవాణా రంగం పురోగమనంలో అభివృద్ధి చెందిన దేశాలతో పాటు శరవేగంగా దూసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్న భారత్ తాజాగా మెట్రో రైలు ప్రాజెక్టులపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా దేశీయంగా పలు నగరాలలో మెట్రో రైలు ప్రాజెక్టులు చేపడుతోంది.

ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, బెంగళూరు, చెన్నై, అహ‌మాదాబాద్, హైదరాబాద్ తదితర నగరాలలో ఇప్పటికే ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టులను మరింతగా విస్తరించాలనీ కేంద్రం నిర్ణయించంది. అందులో భాగంగా అహ‌మాదాబాద్ మెట్రో రైల్ ప్రోజెక్టు రెండో ద‌శకు ఆమోదం తెలిపింది. ఈ ప్రోజెక్టులో రెండు కారిడార్ల పనులు చేపట్టనున్నారు. మోతేరా మైదానం నుండి మ‌హాత్మా మందిర్ వ‌ర‌కు ఒక కారిడార్‌ను, జిఎన్ఎల్‌యు నుండి జిఐఎఫ్‌టి సిటీ వ‌ర‌కు రెండో కారిడార్‌ను చేపట్టనున్నారు. అహమ‌దాబాద్ మెట్రో రైల్ ప్రోజెక్టు రెండో ద‌శను అమ‌లులోకి తీసుకురావ‌డం సహా దీనిలో మొత్తం 28.254 కిలోమీటర్ల పొడ‌వైన రెండు కారిడార్లు భాగంగా ఉంటాయి.

ఒక‌టో కారిడార్ 22.838 కిలోమీటర్ల మేర మోతెరా స్టేడియ‌మ్ నుండి మ‌హాత్మా మందిరం వ‌ర‌కు ఉంటుంది. రెండో కారిడార్ 5.416 కిలోమీటర్ల పొడ‌వుతో జిఎన్ఎల్‌యు నుండి జిఐఎఫ్‌టి సిటీ వ‌ర‌కు ఉంటుంది. ఈ కారిడార్ల నిర్మాణానికి మొత్తం 5384.17 కోట్ల రూపాయ‌ల వ్య‌యం అవుతుంది. ఈ ప్రోజెక్టుకు సంస్థాగ‌త స‌ర్దుబాటు, న్యాయ సంబంధ స్వ‌రూపానికి సంబంధించిన వెసులుబాటును కూడా కేంద్రం కల్పించింది. ప్రోజెక్టు మంజూరుకు ష‌ర‌తులు, అడ్డంకులను తొలగించింది. ఈ ప్రోజెక్టు అమ‌ల‌యితే అహ‌మ‌దాబాద్‌కు, గాంధీన‌గ‌ర్‌కు ఎంతో అవ‌స‌ర‌మైన‌టువంటి అద‌న‌పు ప్ర‌జా ర‌వాణా సంబంధిత మౌలిక స‌దుపాయాలు స‌మ‌కూరుతాయి.