‘స్వదేశీ దర్శన్’కు కేంద్రం పచ్చజెండా

170

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (న్యూస్‌టైమ్): స్వదేశీ దర్శన్ పథకానికి పచ్చజెండా ఊపిన కేంద్రం తాజాగా థీమ్ ఆధారిత టూరిస్ట్ సర్క్యూట్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. మరోవైపు, 14వ ఆర్థిక కమిషన్ కాలపరిమితిలోను, ఆ తర్వాత కూడా ‘స్వదేశీ దర్శన్’ పథకాన్ని కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి లభించిన ఆదరణ నేపథ్యంలో మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి కావలసిన ప్రస్తుతం అమలులో ఉన్న 60 ప్రాజెక్టులకు రూ. 2055.96 కోట్లు కేటాయించడంతో పాటు ఆరు ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో రూ.324.09 కోట్లు కేటాయించడం, 2020 సెప్టెంబర్ నాటికి పూర్తయ్యేలా గడువు విధిస్తూ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది.

దేశంలో థీమ్ ఆధారిత టూరిస్టు సర్య్కూట్ల సమగ్ర అభివృద్ధి కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రధాన స్కీమ్ ఇది. దేశంలో ఆర్థికాభివృద్ధికి, ఉపాధికల్పనకు ఒక చోదకశక్తిగా పర్యాటకాన్ని నిలపడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

పర్యాటకులు అధికంగా సందర్శించే సర్క్యూట్లను ప్రణాళికాబద్ధంగా, ప్రాధాన్యతా ప్రాతిపదికన అభివృద్ధి చేయడం, గుర్తించిన ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సాంస్కృతిక, చారిత్రక విలువలను ప్రోత్సహించడం, గుర్తించిన సర్య్యూట్ల, గమ్యస్థానాల్లో అంతర్జాతీయ నాణ్యత గల మౌలిక వసతులు స్థిర ప్రాతిపదికన అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకుల ఆకర్షణ పెంచడం, పేదలకు ప్రోత్సాహకరంగా ఉండే కమ్యూనిటీ ఆధారిత అభివృద్ధి విధానాలు అనుసరించడం, ఆదాయం వృద్ధిపరంగాను, జీవన ప్రమాణాల మెరుగుదల పరంగాను, స్థానిక సమగ్రాభివృద్ధి పరంగాను టూరిజం ప్రాధాన్యతను గుర్తించేలా స్థానిక వర్గాలను చైతన్యవంతం చేయడం, స్థానిక కమ్యూనిటీలను చురుకైన భాగస్వాములను చేస్తూ ఉపాధి కల్పన, ఉపాధికల్పన, ఆర్థికాభివృద్ధి అవకాశాల దృష్ట్యా పర్యాటక విభాగం సామర్థ్యాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడం, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, జాతీయ సంస్కృతి, స్వభావం బలంగా చేసుకుని దేశంలోని ప్రతీ ఒక్క ప్రాంతంలోను థీమ్ ఆధారిత సర్య్యూట్లను అభివృద్ధి చేస్తూ వాటి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవడం, దేశంలో సుస్థిరమైన రీతిలో అందరినీ సమ్మిళితం చేస్తూ భారతదేశాన్ని అంతర్జాతీయ ప్రమాణాలు గల పర్యాటక గమ్యంగా తీర్చి దిద్దేందుకు స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద పర్యాటక మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. ప్రైవేటు రంగం అంతగా ఆసక్తి చూపించని పర్యాటక ప్రదేశాల్లో చివరి గమ్యం వరకు కనెక్టివిటీ కల్పించడం, టూరిజం రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, మార్గాల వెంబడి సదుపాయాల కల్పన, ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టడం, పర్యాటక ప్రాంతాల్లో చక్కని వెలుతురు కల్పించడం, ఆకర్షణీయంగా తీర్చి దిద్దడం, పార్కింగ్ వసతుల అభివృద్ధిపై ఈ పథకం కింద దృష్టి పెట్టింది. 2014-15 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ‘‘టూరిజం రంగాన్ని ఒక పరిశ్రమగా తీర్చిదిద్ది, చక్కని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తీసుకురాగల విధంగా అభివృద్ధి చేయగల మహోజ్వలమైన సాంస్కృతి, చారిత్రక, మత, ప్రాకృతిక వారసత్వ సంపద భారతదేశానికి ఉంది. ఈ కారణంగా దేశంలో ఐదు ప్రత్యేక థీమ్‌లతో కూడిన టూరిస్టు సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని నేను ప్రతిపాదిస్తూ ఇందుకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నాను’’ అని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత 2015 జనవరిలో పర్యాటక మంత్రిత్వ శాఖ హిమాలయన్ సర్క్యూట్, ఈశాన్య సర్క్యూట్, కృష్ణా సర్క్యూట్, బుద్ధిస్ట్ సర్క్యూట్, కోస్తా సర్క్యూట్లతో కూడిన ‘స్వదేశీ దర్శన్’ స్కీమ్‌ను కేంద్రం ప్రారంభించింది. తదుపరి 2015, 2016, 2017 సంవత్సరాల్లో మరో 10 థీమ్ ఆధారిత సర్క్యూట్లను కూడా ప్రకటించింది. ఎడారి సర్క్యూట్, గిరిజన సర్క్యూట్, ఎకో సర్క్యూట్, వన్యప్రాణి సర్క్యూట్, గ్రామీణ సర్క్యూట్, ఆధ్యాత్మిక సర్క్యూట్, రామాయణ సర్క్యూట్, చారిత్రక వైభవ సర్క్యూట్, తీర్థంకర సర్క్యూట్, సూఫీ సర్క్యూట్ వాటిలో ఉన్నాయి. ఇవి కూడా కలిపితే దేశంలో మొత్తం సర్క్యూట్ల సంఖ్య15కి చేరింది. ఇక, ఈ స్కీమ్‌పై జాతీయ ఉత్పాదక మండలి (ఎన్‌పీసీ) థర్డ్ పార్టీ మదింపు నిర్వహించి ఆ నివేదికను 2017 జూన్ 15వ తేదీన ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మదింపు ఆధారంగా మధ్యంతర దిద్దుబాట్లు కూడా చేశారు.

పర్యాటక కేంద్రాలకు దారి తీసే బాటలపై దారి వెంబడి ప్రయాణికుల వసతుల అభివృద్ధిని స్వదేశీ దర్శన్ స్కీమ్ అనుబంధ స్కీమ్‌గా ప్రకటించారు. దీనికి అనుగుణంగా వ్యయ ఆర్థిక కమిటీ 2017 అక్టోబర్ 13వ తేదీన జరిగిన సమావేశంలో 2017-18 నుంచి 2019-20 సంవత్సరాల కాలానికి ఈ స్కీమ్‌కు రూ.5048 కోట్ల పెట్టుబడికి సిఫారసులు చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులకు రూ.3848 కోట్లు, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు రూ.1200 కోట్లు బడ్జెట్ కేటాయింపులను కూడా ప్రతిపాదించింది. 2017-2020 మధ్య కాలంలో మొత్తం పెట్టుబడిరూ.2500 కోట్లు దాటని విధంగా మాత్రమే కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని సిఫారసు చేసింది.

ఈ స్కీమ్ ప్రారంభించిన నాటి నుంచి పర్యాటక మంత్రిత్వ శాఖ 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.6121.69 కోట్ల విలువ గల 77 ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వగా ఇప్పటికే రూ.3096.14 కోట్లు ఖర్చు చేశారు. ఈ 77 ప్రాజెక్టుల్లోను 66 ప్రాజెక్టుల పనులను 2014-15 నుంచి 2017-18 సంవత్సరాల మధ్య కాలంలో అనుమతించి ప్రారంభించారు. 2018-19లో ఆమోదించిన 11 ప్రాజెక్టులు టెండర్ల దశలో ఉన్నాయి. వాటికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. 17 ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నాయి. 2018 ఆగస్టు నుంచి 2019 జనవరి మధ్య కాలంలో 13 ప్రాజెక్టులను ప్రారంభించారు.