పీఎం ‘కిసాన్ నిధి’ ప్రారంభం

75
  • 1.01 కోట్ల మంది రైతులకు రూ.2వేలు

  • అన్నదాతల కోసం ఏటా రూ.75వేల కోట్లు ఖర్చు

గోరఖ్‌పూర్‌, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (న్యూస్‌టైమ్): సమీపిస్తున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు గేలం వేసే ప్రక్రియకు కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తెరలేపింది. నరేంద్రమోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కేవలం రానున్న ఎన్నికల్లో విజమే లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాలలో మరొకటైన ‘కిసాన్ నిధి’ని ఆదివారం లాంఛనంగా ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్)’ పథకాన్ని ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ కేంద్రంగా ఆదివారం మోదీ అట్టహాసంగా ప్రారంభించారు.

రూ.75వేల కోట్లతో చేపట్టిన ఈ పథకం కింద రైతన్నలకు ఏడాదికి మూడు విడుతలుగా రూ.6వేల సాయం చేయనున్నారు. దేశవ్యాప్తంగా రెండు హెక్టార్లలోపు సాగుభూమి ఉన్న సుమారు 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరనుంది. తొలి విడత సాయం కింద ఉత్తరప్రదేశ్, కర్ణాటకతో సహా 14 రాష్ట్రాలకు చెందిన 1.01 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు నగదు బదిలీ చేశారు. మిగతా రాష్ట్రాల నుంచి అన్నదాతల జాబితా అందిన వెంటనే వారి ఖాతాల్లోనూ సొమ్ములు జమ కానున్నాయి. ఈ కార్యక్రమంలో మోదీతోపాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ జై జవాన్, జై కిసాన్ నినాదాలతో మైదానాన్ని హోరెత్తించారు. కాంగ్రెస్‌పై వాగ్బాణాలు సంధించారు. 10 ఏడేళ్లకోసారి, కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే కాంగ్రెస్‌కు రైతులు గుర్తుకువస్తారని ఎద్దేవా చేశారు. ‘‘కాంగ్రెస్, మహాకూటమి (ఎస్పీ-బీఎస్పీ) అంతా ఒక తాను ముక్కలే. రైతుల ప్రయోజనం కన్నా వీరికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. వీరివి కేవలం మాటలే కానీ చేతలు సున్నా’’ అని మండిపడ్డారు. కిసాన్ నిధి పథకం పేపర్ల మీద ప్రకటించి చేతులు దులుపుకొనే పథకం కాదని ప్రధాని అన్నారు.

‘‘కిసాన్ నిధి పథకంపై ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు కేవలం పత్రాల (పేపర్ల)కే పరిమితమయ్యేవి. అవి కనీసం కార్యరూపం కూడా దాల్చకపోయేవి. రైతుల శ్రేయస్సుకు అవసరమైన పథకాల్ని యూపీఏ సర్కారు ఎన్నడూ రూపొందించలేదు. కానీ, ఎన్డీయే మాత్రం అన్నదాతల సమస్యలపై నిబద్ధతతో పనిచేస్తోంది. అందుకే ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. రైతుల మద్దతు మోదీకే ఉందని వారిలో ఆందోళన మొదలైంది’’ అని విమర్శలు గుప్పించారు. మరోవైపు, పీఎం కిసాన్ నిధి పథకంపై విపక్షాలు విమర్శల వర్షం కురిపించాయి. యూపీ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఈ పథకాన్ని మోసపూరితమైనదిగా అభివర్ణించారు. ఈ పథకం పేరుతో కేంద్రం రైతుల్ని తీవ్రంగా అవమానిస్తోందని మండిపడ్డారు.

‘‘ఈ పథకం కింద రైతుకు రోజుకు సుమారు రూ.17, నెలకు రూ.500 అందజేస్తున్నారు. శ్రమను నమ్ముకునే రైతులు తమ ఉత్పత్తులకు న్యాయమైన ధరను కోరుకుంటారు. అయితే, వారికి అతి తక్కువ ఆర్థికసాయం చేయాలన్న బీజేపీ మనస్తత్వం చాలా క్రూరమైనది, దురహంకారపూరితమైనది. ఈ పథకం వల్ల అన్నదాతలకు ఒనగూరే ప్రయోజనం అత్యల్పం. రైతుల గురించి ఆలోచించడంలోనూ, వారి బాధలను పరిష్కరించడంలోనూ విఫలమైన బీజేపీ ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ పథకాన్ని తెరపైకి తెచ్చింది’’ అని మాయావతి ధ్వజమెత్తారు.

కాగా, కాంగ్రెస్ కూడా మోదీ కొత్త పథకాన్ని తూర్పారబట్టింది. రైతులకు నగదు బదిలీని ఓట్ల కోసం ఎరవేసే లంచంగా కాంగ్రెస్ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అభివర్ణించారు. ఎన్నికల సంఘం ఈ పథకాన్ని అడ్డుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ‘‘నేడు నోటుకు ఓటు దినం. బీజేపీ ప్రభుత్వం నేరుగా రూ.2వేలు రైతుల ఖాతాలో వేసి వారి కుటుంబ ఓట్లను నిస్సిగ్గుగా కొనుగోలు చేస్తోంది. ఈ దారుణాన్ని ఎన్నికల కమిషన్ అడ్డుకోకపోవడం ఇంకా సిగ్గుచేటు’’ అని వరుస ట్వీట్లలో చిదంబరం విమర్శలు గుప్పించారు.

మరోవైపు, విపక్షాల విమర్శలను అధికార బీజేపీ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. గత ఐదేళ్ల పాలనలో ఎన్డీయే ప్రభుత్వం రైతులకు చేసిందేమీలేదని కాంగ్రెస్ మండిపడింది. ఎన్నికల్లో లబ్ధి కోసమే కిసాన్ నిధి పథకాన్ని ప్రారంభించిందని, ఈ జిమ్మిక్కులకు ఓట్లు రాలవని కాంగ్రెస్ పేర్కొంది. ‘‘వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న నరేంద్ర మోదీకి ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం చెల్లక ఈ పథకం తీసుకువచ్చారు. కానీ, ఆయన పతనాన్ని ఈ పథకం ఆపదు’’ అని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. అసోంలో కల్తీ మద్యం వల్ల 124 మంది అభాగ్యులు మరణించడం, అరుణాచల్‌ప్రదేశ్ అల్లర్లపై ప్రధాని ఎందుకు స్పందించడం లేదని నిలదీసింది.