నిర్మల్‌లో మాయమవుతున్న చెరువులు

104

నిర్మల్, ఫిబ్రవరి 23 (న్యూస్‌టైమ్‌): ప్పుడెప్పుడో పురాణకాలంలో హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమండలాన్ని చాపచుట్టినట్టు చుట్టుకుని చంకన పెట్టుకుని పోయడన్న కధను విన్నాం. ఇప్పుడు ప్రతి వాడు ఒక హిరణ్యాక్షుని రూపంలో ప్రత్యక్షమై భూ దందాలకు పాల్పడుతున్నారు. అయితే వారికి వీరికి తేడా ఒకటే. అది కథ , ఇది కళ్ళ ముందు జరుగుతున్న విషాద గాథ. నిర్మల్‌ పట్టణాన్ని ఆనుకుని కాకతీయుల కాలంలో 11 గొలుసుకట్టు చెరువులుండేవి. వాటి కింద వందలాది ఎకరాలు సాగయ్యేది.

పట్టణవాసులకూ వాటి నుంచే మంచి నీరు అందేది. ఆ పట్టణం విస్తరించడంతో ప్రస్తుతం నాలుగైదుకు మించి చెరువులు కనపడని దుస్థితి. భూబకాసుల కన్నుపడటంతో నిర్మల్‌ పట్టణంలోని గాజులపేట, ధర్మసాగర్‌, మంజూలపూర్‌, కంచరోని, సూరన్నపేట వంటి గొలుసుకట్టు చెరువులన్నీ మాయమైపోయాయి. చెరువుల శిథిలాలపై అక్రమంగా ప్లాట్లు వెలిశాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో రాత్రికి రాత్రే ఈ భూముల్లో రియల్‌ వెంచర్లు వెలుస్తున్నాయి. తెల్లారేసరికి భారీ భవంతులు దర్శనమిస్తున్నాయి.

చెరువు శిఖం భూములనే కాదు రైత్వారీ పట్టాలను చూపి ఏకంగా చెరువు భూముల్లోనే భారీ భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి చెరువు భూములను తమ వశం చేసుకుంటున్నారు. చట్టాల్లోని లొసుగులను ఆధారంగా చేసుకుని బోగస్‌ పత్రాలు సృష్టించి కబ్జాదారులు తమ పనిని కానిచ్చేస్తున్నారు. ఈ కబ్జాల వ్యవహారాల్లో కొంతమంది రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు కబ్జాల పర్వంపై పట్టించుకోకపోవడంతో భూ బకాసురుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.

తెలంగాణలో చెరువుల పునరుద్ధరణకు, సాగునీటి రంగంలో సమూల మార్పులకు సర్కారు శ్రీకారం చుడుతుంటే కబ్జాదారులు జిల్లాలో చెరువులను చెరబడుతున్నారు. జిల్లాలో ఆక్రమించబడిన చెరువుల పునరుద్దరణకు సర్కార్‌ సమాయత్తమవుతోంది. అంతేకాదు జిల్లాలోని చెరువుల అభివృద్ధి, మరమ్మతు పనులను చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఈ హడావుడి కొద్ది రోజులకే పరిమితమవుతుందా? కబ్జాలను, అక్రమ కట్టడాలను తొలగించి చెరువులను స్వాధీనం చేసుకుంటుందా? లేదా?? అనేది కొంత కాలం వేచి చూడాల్సిందే.