ఆకర్షణీయ నగరాల్లో అదనపు ప్రాజెక్టుల నిర్వహణ

222

అమరావతి, ఫిబ్రవరి 23 (న్యూస్‌టైమ్): దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఆకర్షణీయ నగరాలలో (స్మార్ట్ సిటీల్లో) అదనపు ప్రాజెక్టుల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అమరావతి నగరాలను కేంద్రం ఆకర్షణీయ నగరాలుగా ఇప్పటికే ఎంపిక చేసుకోగా మొదటి విడత ఎంపికైన ఒక్కో నగరానికి 2015-16 నుంచి 2019-20 మధ్య రూ.వెయ్యి కోట్లు చొప్పున కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది.

ఇందులో కేంద్రం రూ.500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.500 కోట్లు సమకూర్చుతోంది. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలో ఇప్పటికే పలు ప్రాజెక్టుల కింద వివిధ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం 2019-20తో పూర్తి కానుండటంతో వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కొత్త ప్రతిపాదనలపై అదనపు సాయం అందించేందుకు ఫ్రెంచ్‌ ప్రభుత్వానికి చెందిన ‘ఏజెన్సీ ఫ్రాన్కైస్‌ డెవలప్‌మెంట్‌’(ఏఎఫ్‌డీ) సాయం తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖలో రూ.350 కోట్లతో అదనపు ప్రాజెక్టుల నిర్వహణకు మూడు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది.

ఆ ప్రతిపాదనలు 1) రెండు బీఆర్‌టీఎస్‌ కారిడార్లలో ఎలక్ట్రిక్‌ బస్సుల ఏర్పాటు, 2) చారిత్రక ముడసర్లోవ ఉద్యానవనం ఆధునికీకరణ, 3) నగరపాలక సంస్థ పాఠశాలల డిజిటలైజేషన్‌… కాగా వీటి కోసం కేటాయించే నిధుల్లో 50 శాతాన్ని తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.