కళలకు కేంద్రంగా ఆంధ్ర విశ్వకళాపరిషత్‌: వీసీ జీఎన్ఆర్

149

విశాఖపట్నం, ఫిబ్రవరి 22 (న్యూస్‌టైమ్): కళలకు కేంద్రంగా ఆంధ్రవిశ్వకళాపరిషత్‌ నిలుస్తుందని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం ఉదయం ఏయూ సంగీత విభాగంలో నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు ‘గ్లోబల్‌ పర్‌స్పెక్టివ్స్‌ ఆఫ్‌ వీణ’ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంగీత విభాగం త్రి దశాబ్ధి ఉత్సవాలను నిర్వహించడం మంచి పరిణామమన్నారు. వీణపై నిర్వహించే సదస్సు వర్సిటీకి తలమానికంగా నిలుస్తుందన్నారు.

విశ్వవిద్యాలయం సంగీతం, నృత్యం, నటన, చిత్రకళలకు స్తానం కల్పిస్తోందన్నారు. బలమైన పునాదులు వర్సిటీ సంగీత విభాగం కలిగి ఉందన్నారు. ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.రామ మోహన రావు మాట్లాడుతూ సంగీత వాద్య పరికరాలలో ప్రముఖంగా నిలచే వీణపై సదస్సు నిర్వహణ ముదావహమన్నారు. సంగీత జ్ఞానాన్ని అందించేదిగా వీణ నిలుస్తుందన్నారు. సప్త స్వరాలను అనంత విధానాలలో వీణపై శ్రావ్యంగా పలికించడం సాధ్యపడుతోందన్నారు.

వీణ, హార్మోనియం పరిజ్ఞానాన్ని ప్రతీ సంగీతకారుడు కలిగి ఉండాలన్నారు. విభాగాధిపతి ఆచార్య కె.సరస్వతి విద్యార్థి మాట్లాడుతూ వీణావాద్యంలో జాతీయ సదస్సు నిర్వహించిన ఘనత ఏయూ సంగీత విభాగం సొంతమన్నారు. గడచిన రెండు సంవత్సరాల కాలంలో ఐదు జాతీయ సదస్సులను ఏయూ సంగీత విభాగం నిర్వహించిందన్నారు. త్రి దశాబ్ధి ఉత్సవాలను నేడు ఈ సందస్సుతో ఘనంగా ఆరంభించడం జరుగుతోందన్నారు. స్వర్గీయ రామవరపు విజయలక్ష్మి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను తయారు చేసి సమాజానికి అందిచారన్నారు.

అమెను స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ట్రస్ట్‌ సభ్యులను అభినందించారు. రామవరపు విజయలక్ష్మి మ్యూజిక్‌ మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అద్యక్షురాలు రామవరపు మాధురి దేవి మాట్లాడుతూ తన తల్లి ఆశయాలను భవిష్యత్‌ తరాలకు చేరువ చేసే విధంగా సదస్సు నిర్వహణ చేస్తున్నామన్నారు.

భారతీయ సంస్కృతి, కళలను నేటి తరానికి అందించే చిరు ప్రయత్నంగా ఈ సదస్సు నిలుస్తుందన్నారు. మద్రాస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ వ్యవస్థాపక ఉపకులపతి ఆచార్య ఇ.గాయిత్రి కీలకోపన్యాసం చేశారు. అనంతరం ఆచార్య గాయిత్రికి విజయ విపంచి బిరుదును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. సదస్సులో పెద్దసంఖ్యలో ప్రతినిధులు, సంగీతాభిమానులు తదితరులు పాల్గొన్నారు.