బంగారు తెలంగాణ లక్ష్యంతో బడ్జెట్

147

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (న్యూస్‌టైమ్): ప్రజలకిచ్చిన వాగ్ధానాలన్నీ నెరవేర్చే విధంగా బడ్జెట్ రూపకల్పన ఉండాలని, పేదల సంక్షేమం కోసం, వ్యవసాయాభివృద్ధి కోసం అత్యదిక నిధులు కేటాయించేలా కూర్పు ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పారు.

బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి గురువారం ప్రగతి భవన్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె. జోషి, ఆర్థిక సలహాదారు జి.ఆర్. రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.

గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడానికి, ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాల కొనసాగింపుకు అవసరమైన నిధులు కేటాయించేలా బడ్జెట్ రూపొందించాలని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, పథకాలు, వాటికయ్యే ఖర్చు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.