రాహుల్‌లో రాజకీయ పరిపక్వత!

385
  • పేలుతున్న మాటల తూటాలు?

తల్లిచాటు బిడ్డగా ఇన్నాళ్లూ లోకం దృష్టిలో కనిపించిన రాహుల్ గాంధీలో ఇటీవల అంతులేని రాజకీయ పరిపక్వత కనిపిస్తోంది. అధికార పార్టీ లక్ష్యంగా ఆయన పేల్చుతున్న మాటల తూటాలు సామాన్యులనూ ఆలోచింపజేస్తున్నాయి. ఇందిర రాజకీయ వారసుడిగా తెరంగేట్రం చేసిన రాజీవ్ గాంధీ వారసురాలిగా కుమార్తె ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వస్తుందనుకున్న తరుణంలో సోనియాగాంధీ ఆ బాధ్యతలను తన బుజస్కంధాలపై వేసుకున్నప్పుడు రాహుల్ కేవలం ఒక ఎంపీగా, ఎఐసీసీ ఉపాధ్యక్షునిగా మాత్రమే ప్రపంచానికి తెలుసు. అప్పట్లో రాహుల్‌ని రాజకీయ పరిపక్వత లేని వ్యక్తిగా సొంత పార్టీలోని కొందరి సహా అందరూ గుర్తించారు. కానీ, సోనియా వారసుడిగా ఆయన రాజకీయాలలో చక్రం తిప్పుతున్న తీరు మాత్రం ప్రస్తుతం దేశీయ రాజకీయాలలో కీలకాంశంగా మారింది.

తాజాగా రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైన రఫేల్‌ ఒప్పందం విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనిల్‌ అంబానీ రూ. 30వేల కోట్లు దోచుకునేందుకు చౌకీదారే స్వయంగా తలుపు తెరిచారంటూ దుయ్యబట్టారు. రఫేల్‌ ఒప్పందంపై ‘ద హిందూ’ ప్రచురించిన తాజా కథనమే ఇందుకు కారణం. భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య రఫేల్‌ ఒప్పందం జరగడానికి కొద్ది రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం అవినీతి నిరోధక నిబంధనలను తొలగించిందంటూ ‘ద హిందూ’ కథనం పేర్కొంది. దీనిపై స్పందించిన రాహుల్‌ ట్విటర్‌ వేదికగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. హిందూ కథనాన్ని ట్వీట్‌ చేస్తూ ‘‘నమో (నరేంద్రమోదీ) అవినీతి వ్యతిరేక నిబంధన ఇది. వైమానిక దళం నుంచి అనిల్‌ అంబానీ రూ. 30వేల కోట్లు దోచుకునేందుకు చౌకీదారే (మోదీని ఉద్దేశిస్తూ) స్వయంగా తలుపు తెరిచారు’’ అని ఆరోపించి మోదీ వ్యతిరేక వర్గాలలో ఉత్సాహాన్ని నింపారు.

ఈ కథనంపై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ‘‘రఫేల్‌ ఒప్పందం అంశంలో ప్రభుత్వం ఊహించిన దానికంటే త్వరగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట 126 విమానాలను 36కు తగ్గించి డసో కంపెనీకి సాయం చేశారు. అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం సమాంతరంగా చర్చలు జరిపింది. ఇప్పుడు అవినీతి నిరోధక నిబంధనలు ఎత్తివేసింది. ఇలా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి’’ అని ట్విటర్‌ వేదికగా అన్నారు. ఆయుధాల కొనుగోలు ఒప్పందం విషయంలో కీలక నిబంధలను భారత్‌ మార్చినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండానే డసోకు అంత పెద్ద మొత్తంలో సొమ్ము ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ఎలాంటి కఠిన నిబంధనలు లేకుండానే ప్రభుత్వం ముందుకు వెళ్లిందని ఆరోపించారు. కాగా, రఫేల్‌ వివాదం మరో మలుపు తిరిగింది.

ప్రముఖ పత్రిక ‘ది హిందూ’ దీనిపై మరో కీలక కథనాన్ని వెలవరించడంతో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఒప్పందానికి సంబంధించి ఎస్క్రో ఖాతాను నిర్వహించాలన్న ఆర్థిక నిపుణుల సలహాను పెడచెవిన పెడుతూ ప్రభుత్వం ముందుకు పోయిందని పేర్కొంది. చివరికి దీనికి బ్యాంక్‌ గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం ఉదాసీన వైఖరిలో ఉందని పేర్కొంది. దాదాపు 7.87 బిలియన్‌ యూరోలు విలువైన రఫేల్‌ డీల్‌లో అవినీతికి వ్యతిరేకంగా జరిమానాలు విధించడం, ఎస్క్రో ఖాతా నుంచి చెల్లింపులు చేయడం వంటి నిబంధనలను ఒప్పందంపై సంతకాలకు కొన్ని రోజుల ముందు తొలగించారని పేర్కొంది.

గతంలో కూడా ప్రధాని కార్యాలయం సమాంతరంగా చర్చలు జరపడంపై రక్షణ మంత్రిత్వశాఖ అభ్యంతరం తెలిపిన అంశాన్నిఈ పత్రిక వెల్లడించింది. ఒప్పందాన్ని ప్రభావితం చేయాడానికి మితిమీరిన ప్రయత్నాలు సంస్థలు లేదా వ్యక్తుల మధ్యవర్తిత్వ రుసుం(కమిషన్‌) డసో, ఎంబీడీఏ ఖాతాలతో నేరుగా లావాదేవీలు జరపడం వంటి వాటిపై జరిమానాలు విధించడం వంటి నిబంధనలను తొలగించినట్లు ‘ద హిందూ’ కథనం పేర్కొంది. ఈ ఒప్పందంలో డసో విమానాలను సరఫరా చేయగా, ఎంబీడీఏ ఫ్రాన్స్‌ ఆయుధాలను సరఫరా చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ 24 ఆగస్టు2016లో రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందానికి ఓకే చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో రక్షణ మంత్రి పారికర్‌ నేతృత్వంలోని ‘డిఫెన్స్‌ ఎక్విజషన్‌ కౌన్సిల్‌’ ఎనిమిది మార్పులను ఆమోదించిందని పేర్కొంది. ఆ విధంగా మోదీపై నిప్పులు చెరిగే యజ్ఞానికి రాహుల్ ఆజ్యం పోశారనే చెప్పాలి.

భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండనున్నాయో గానీ, బీజేపీ పాలనలో దేశం భ్రష్టుపట్టిపోయిందన్న వాదన ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడంలో రాహుల్ గాంధీ విజయం సాధించారనేది వాస్తవం. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌ పోరుగా భావించిన మొన్నీమధ్య జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ ఓటమిపాలవడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో రాహుల్ రాజకీయ పరిపక్వత అంశం తెరమీదకు వచ్చినట్లయింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ దేశంలో ఆర్ధిక పరిస్థితులు దిగజారిపోయాయన్న నిపుణుల అంచనాలను కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. దీనికి తోడన్నట్లు బీజేపీ పునాదులూ కదులుతున్నాయి. అయితే, భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.