ఫిబ్రవరి 8 నుంచి 11 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు

203

తిరుపతి, ఫిబ్రవరి 6 (న్యూస్‌టైమ్): టీటీడీ శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాలోని 11 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరగనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిబ్రవరి 8వ తేదీన కుక్కునూరు మండలం బనగాల గూడెం గ్రామంలో గల శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయ పరిసరాల్లో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం జరగనుంది. ఫిబ్రవరి 9న బుట్టయ్యగూడెం మండలం గుర్రప్ప గూడెం గ్రామంలో గల శ్రీకోదండరామలయంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.

ఫిబ్రవరి 10న జంగారెడ్డిగూడెం మండలం పెద్దకప్పగూడెం గ్రామంలో గల శ్రీ కోదండరామాలయంలో సాయంత్రం 6.00 గంటలకు సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరగనుంది. ఫిబ్రవరి 11న టి.నరసాపురం మండలం రుద్రరాజుకోట గూడెం గ్రామంలో గల శ్రీకోదండరామాలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 12న కామవరపుకోట మండలం శ్రీ కోదండరామ నగర్‌ గ్రామంలో శ్రీకోదండరామాలయంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది. అదే విధంగా, తూర్పు గోదావరి జిల్లాలో కూడా తొలుత విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం స్వామివారి కల్యాణాలు జరగనున్నాయి.

ఫిబ్రవరి 15న రాజవోమంగి మండలం రేవటిపాళ్యం గ్రామంలోని శ్రీ గంగాలమ్మతల్లి ఆలయ పరిసరాల్లో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరగనుంది. ఫిబ్రవరి 16న అడ్డతీగల మండలం వేటమమ్మిడి గ్రామంలోని శ్రీ రేణుక యలమ్మతల్లి ఆలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 17న దేవిపట్నం మండలం రాయవరం గ్రామంలోని శ్రీ రామాలయంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం జరగనుంది.

ఫిబ్రవరి 18న కూన‌వ‌రం మండలం టెక్కలబోరు గ్రామంలోని శ్రీ అయప్పస్వామివారి ఆలమంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 19న యాటపాక మండలం లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయస్వామివారి ఆలయంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి 20న కొడవలూరు మండలం కమ్మపాళ్యం గ్రామంలోని శ్రీ మహాలక్షి అమ్మవారి ఆలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు తితిదే రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.