అసంఘ‌టిత రంగ శ్రామికుల కోసం ‘పీఎం శ్ర‌మ‌ యోగి మాన్‌‌ధ‌న్’

302

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (న్యూస్‌టైమ్): నెల‌కు 15 వేల రూపాయ‌ల వ‌ర‌కు ఆదాయం క‌లిగి ఉన్న అసంఘ‌టిత రంగ శ్రామికుల కోసం ‘ప్ర‌ధానమంత్రి శ్ర‌మ‌-యోగి మాన్‌‌ధ‌న్’ పేరిట ఒక బృహ‌త్త‌ర పెన్ష‌న్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టాల‌ని ప్ర‌తిపాదించిన ప్ర‌భుత్వం. దీనితో ఈ రంగంలో 10 కోట్ల మంది శ్రామికులు, ప‌నివారు ల‌బ్దిపొంద‌నున్నారు. ఈ బృహ‌త్త‌ర పెన్ష‌న్ ప‌థ‌కాన్ని ప్రారంభించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది. కేంద్ర ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్య‌వ‌హారాలు, రైల్వేలు, బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ పార్ల‌మెంటులో 2019-20 సంవ‌త్స‌ర తాత్కాలిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెడుతూ, భార‌త‌దేశ జీడీపీలో స‌గం అసంఘ‌టిత రంగంలో చెమ‌టోడ్చి ప‌ని చేస్తున్న‌టువంటి 42 కోట్ల మంది వ‌ర్క‌ర్ల నుండే ల‌భిస్తోంద‌న్నారు. వీరిలో వీధి వీధికి తిరిగి వ‌స్తువులు, స‌ర‌కులు అమ్మేవారు, రిక్షా కార్మికులు, నిర్మాణ రంగ శ్రామికులు, వ్య‌ర్థాల‌ను ఏరుకొనే వారు, వ్య‌వ‌సాయ కూలీలు, బీడీ కార్మికులు, చేనేత‌కారులు, తోలు వ‌స్తువులు త‌యారు చేసేవారితో పాటు, ఇదే విధమైన అనేక వృత్తుల వారు ఉన్నారు.

ప్ర‌భుత్వం వీరికి వృద్ధాప్యంలో ఒక స‌మ‌గ్ర‌మైన‌టువంటి సామాజిక భ‌ద్ర‌త క‌వ‌చాన్ని స‌మ‌కూర్చ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. కాబ‌ట్టి, ‘ఆయుష్మాన్ భార‌త్’లో భాగంగా అందిస్తున్న ఆరోగ్య ర‌క్ష‌ణ, ‘ప్ర‌ధానమంత్రి జీవ‌న జ్యోతి బీమా యోజ‌న’, ఇంకా ‘ప్ర‌ధానమంత్రి సుర‌క్ష బీమా యోజ‌న’ల‌లో భాగంగా స‌మ‌కూర్చుతున్న జీవిత, వైక‌ల్య ర‌క్ష‌ణల‌కు తోడుగా తమ ప్ర‌భుత్వం ‘ప్ర‌ధానమంత్రి శ్ర‌మ‌-యోగి మాన్‌ధ‌న్’ పేరుతో ఒక బృహ‌త్త‌ర‌మైన పెన్ష‌న్ ప‌థ‌కాన్ని ప్రారంభించాల‌ని ప్ర‌తిపాదిస్తోంద‌ని మంత్రి వెల్లడించారు. ఈ పెన్ష‌న్ ప‌థ‌కం 60 ఏళ్ళ వ‌య‌స్సు వ‌చ్చిన‌ప్ప‌టి నుండి 3 వేల రూపాయ‌ల నెల‌వారీ పింఛ‌ను అందించేందుకు ఉద్దేశించింద‌ని మంత్రి గోయ‌ల్ అన్నారు. అయితే, దీని కోసం వారు ప‌ని చేసే కాలంలో చిన్న‌పాటి మొత్తాన్ని నెల‌వారీ ప్రాతిప‌దిక‌న త‌మ వంతు వాటాగా స‌మ‌కూర్చ‌వ‌ల‌సి ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.

29 ఏళ్ళ ప్రాయంలో పెన్ష‌న్ యోజ‌నలో చేరే అసంఘ‌టిత రంగ శ్రామికుడు త‌న‌కు 60 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు ప్ర‌తి ఒక్క నెల‌కు కేవ‌లం 100 రూపాయ‌లు స‌మ‌కూర్చ‌వ‌ల‌సి ఉంటుంద‌ని వివ‌రించారు. 18 ఏళ్ళ వ‌య‌స్సులో పెన్ష‌న్ ప‌థ‌కంలో చేరే శ్రామికుడు ప్ర‌తి ఒక్క నెల‌కు 55 రూపాయ‌లు క‌డితే స‌రిపోతుంద‌న్నారు. ప్ర‌భుత్వం ఆ శ్రామికుని పెన్ష‌న్ ఖాతాలో ప్ర‌తి నెలా స‌మాన‌మైన‌టువంటి వాటాను జ‌మ చేస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. రానున్న అయిదు సంవ‌త్స‌రాల కాలంలో ‘ప్ర‌ధానమంత్రి శ్ర‌మ‌-యోగి మాన్‌ధ‌న్’ తాలూకు ల‌బ్దిని అసంఘ‌టిత రంగంలో క‌నీసం 10 కోట్ల మంది శ్రామికులు పొంద‌గ‌లుగుతార‌న్న అంచ‌నా ఉంది. తత్ఫ‌లితంగా ఇది ప్ర‌పంచంలో అతి భారీ పెన్ష‌న్ ప‌థ‌కాలలో ఒక‌టిగా మారే అవ‌కాశం ఉంది. ఈ ప‌థ‌కం కోసం 500 కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని కేంద్రం కేటాయించాలని నిర్ణయించింది. అవ‌స‌ర‌మైతే అద‌న‌పు నిధుల‌ను కూడా అందిస్తారు. ఈ ప‌థ‌కాన్ని ప్ర‌స్తుత సంవ‌త్స‌రం నుండే అమ‌లులోకి తీసుకురానున్నారు.