తొలి టీ20లో టీమిండియా ఘోరపరాజయం

326

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 6 (న్యూస్‌టైమ్): న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. రోహిత్ నాయకత్వంలోని టీమిండియా ఆటగాళ్లు అన్ని కోణాల్లో ఓటమిపాలయ్యారు. వన్డేలో అత్యుత్తమ ఆటతీర కనబర్చిన టీమిండియా క్రికెటర్లు టీ20లో మాత్రం న్యూజిలాండ్‌ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకే చేతులెత్తేసింది. 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన అసలు ఏ టైమ్‌లోనూ గెలిచేలా కనిపించలేదు. 18 పరుగుల దగ్గరే రోహిత్ శర్మ (1) వికెట్ కోల్పోయిన భారత్ ఇక ఏ దశలోనూ కోలుకోలేదు. ధావన్ (29), శంకర్ (27), పంత్ (5), కార్తీక్ (5), హార్దిక్ పాండ్యా (4) దారుణంగా విఫలమయ్యారు. ఎమ్మెస్ ధోనీ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 3, ఫెర్గూసన్, సోధి, సాంట్నర్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. టీ20ల్లో ప‌రుగుల ప‌రంగా టీమిండియాకు ఇదే అత్యంత చెత్త ఓట‌మి కావ‌డం విశేషం. అంత‌కుముందు, భారత బౌలర్లను చితగ్గొట్టిన కివీస్ బ్యాట్స్‌మెన్‌లు బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఓపెనర్ సీఫర్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

కేవలం 43 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఫోర్లతో 84 పరుగులు చేశాడు. అతనికి మన్రో, విలియమ్సన్ కూడా తోడవడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోర్ నమోదుచేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 14 సిక్స్‌లు, 14 ఫోర్లు నమోదు కావడం విశేషం. కివీస్ హిట్టింగ్ ధాటికి భారత బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భారత జట్టులో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీసినా తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 51 పరుగులు ఇవ్వడం విశేషం. స్ట్రెక్ బౌలర్ భువనేశ్వర్ కూడా 4 ఓవర్లలో 47 పరుగులు, ఖలీల్ అహ్మద్ 48 పరుగులు ఇచ్చారు. మన్రో 34, విలియమ్సన్ 34, చివర్లో కుగెలీన్ కేవలం 7 బంతుల్లోనే 20 పరుగులు చేశాడు. మొత్తానికి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో న్యూజిలాండ్ ఆధిక్యంలో నిలిచి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది.

అన్ని విభాగాల్లో 100 శాతం కష్టపడింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టుకు ఓపెనర్లు టిమ్‌ సీఫెర్ట్‌, కొలిన్‌ మన్రో కోరుకున్న ఆరంభాన్ని అందించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో పటిష్ఠ భారత్‌ ముందు 220 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది కివీస్‌. ఆ జట్టు సారథి కేన్‌ విలియమ్సన్‌ (34; 22 బంతుల్లో 3×4) కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు. వెంటవెంటనే మూడు వికెట్లు చేజార్చుకున్నా చివర్లో రాస్ టేలర్‌ (23; 14 బంతుల్లో 2×4), కుగులీన్‌ (20; 7 బంతుల్లో 3×4, 1×6) మెరుపులు మెరిపించారు. హార్దిక్‌ పాండ్య 2, భువి, ఖలీల్‌, కృనాల్‌, చాహల్‌ తలో వికెట్‌ తీశారు. ఛేదనకు దిగిన భారత ఆటగాళ్లు అత్యంత ఉదారంగా ప్రవర్తించారు. ఆరుగురు బ్యాట్స్‌మెన్‌‌లు 5 పరుగుల్లోపే పెవిలియన్‌ చేరారు.

ఎంఎస్‌ ధోనీ (39; 31 బంతుల్లో 5×4, 1×6) టాప్‌ స్కోరర్‌. విజయ్‌ శంకర్ (27; 18 బంతుల్లో 2×4, 2×6)‌, శిఖర్‌ ధావన్‌ (29; 18 బంతుల్లో 2×4, 3×6) కాస్త కష్టపడ్డారు. కృనాల్‌ పాండ్య (20; 18 బంతుల్లో 1×4, 1×6) కాసేపు ధోనీకి సహకారం అందించాడు. న్యూజిలాండ్‌ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు వేశారు. పరుగులు చేయాలన్న ఆత్రుతలో పంత్‌, శంకర్‌, దినేశ్‌ కార్తీక్‌, పాండ్య అనవసర షాట్లు ఆడారు. వికెట్లు పడుతుండటంతో చేయాల్సిన రన్‌రేట్‌ 22కు చేరింది. కివీస్‌ బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో రోహిత్‌ సేన 80 పరుగుల తేడాతో టీ20ల్లో పరుగుల పరంగా అత్యంత ఘోర ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో పాండ్య సోదరులు ఇద్దరూ ఆడటం గమనార్హం.

మరోవైపు, న్యూజిలాండ్‌తో తొలి వన్డే కఠినంగా సాగిందని టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ అన్నాడు. మూడు విభాగాల్లోనూ తమ జట్టు విఫలమైందని అంగీకరించాడు. కివీస్‌లో మైదానాలు చిన్నవే అయినా 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడం సులభం కాదని తెలుసన్నాడు. తొలి పోరులో ఆతిథ్య జట్టు 220 పరుగుల లక్ష్యం నిర్దేశించగా భారత్‌ 139 పరుగులకే ఆలౌటైంది. బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా విఫలమయ్యారు. ధోనీ (39) టాప్‌ స్కోరర్‌. విజయ్‌ శంకర్‌ ఫర్వాలేదనిపించాడు.

‘‘మేం వెంటవెంటనే వికెట్లు పారేసుకున్నాం. మ్యాచ్‌ను చేజార్చుకున్నాం. గతంలో భారీ లక్ష్యాల్ని ఛేదించాం. అందుకే ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌తో దిగాం. లక్ష్య ఛేదనలో మాత్రం చిన్న చిన్న భాగస్వామ్యాల్నీ నెలకొల్పలేకపోయాం. ఆక్లాండ్‌ వెళ్లి పిచ్‌, పరిస్థితులను గమనించి ముందుకెళ్తాం. మా ముందు ఎంత లక్ష్యమున్నా ఛేదిస్తామని నమ్మకముంది. కానీ ఈరోజు అలా జరగలేదు’’ అని రోహిత్‌ శర్మ అన్నాడు. ఇదిలావుండగా, అన్నదమ్ములిద్దరూ ఒకే రంగంలో రాణిస్తుండటం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ఇందుకు క్రికెట్‌ కూడా మినహాయింపు కాదు.

భారత జట్టులో అయితే అన్నదమ్ములు ఒకేసారి మ్యాచ్‌లు ఆడిన చాలా ఉన్నాయి. నాటితరంలో మొహిందర్‌ అమర్‌నాథ్‌-సురీందర్‌ అమర్‌నాథ్‌, నిన్నటి తరంలో ఇర్ఫాన్‌ పఠాన్‌-యూసుఫ్‌ పఠాన్‌, దాదాపు పదేళ్ల తర్వాత నేటి తరంలో హార్దిక్‌ పాండ్య-కృనాల్‌ పాండ్య ఈ కోవకు చెందిన వారే. మొహిందర్‌‌-సురీందర్‌ కలిసి మొత్తం మూడు వన్డేలు ఆడారు. ఇర్ఫాన్‌-యూసుఫ్‌ కలిసి 8 వన్డేలు, 8 టీ20లు ఆడారు. దశాబ్ద కాలం తర్వాత టీమిండియా తరఫున ఇద్దరు అన్నదమ్ములు ఆడారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో హార్దిక్‌-కృనాల్‌ ఇద్దరూ తొలిసారిగా కలిసి ఆడారు. ఈ అన్నదమ్ములిద్దరూ ఆల్‌రౌండర్లే. తమ్ముడు హార్దిక్‌ టీమిండియాలో అదరగొడుతుంటే అన్న కృనాల్‌ ఐపీఎల్‌లో రాణిస్తున్నాడు. కృనాల్‌ ఇప్పటి వరకు 7 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.