పద్మశ్రీ గ్రహీతైనా నిగర్విగా జీవనం!

658
  • బుర్రకథా పితామహుడు… షేక్‌ నాజర్‌

గుంటూరు, ఫిబ్రవరి 6 (న్యూస్‌టైమ్‌): బుర్రకథా పితామహుడుగా పేరొందిన షేక్‌ నాజర్‌ బుర్రకథా కళాకారుడు, నటుడు, ప్రజా రచయిత, గాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద దూదేకుల ముస్లిం కుటుంబంలో 1920, ఫిబ్రవరి 5వ తేదీన జన్మించిన నాజరు పూర్తి పేరు షేక్‌ నాజరు వలి. ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథా పితామహుడు నాజర్‌, గొప్పనటుడు, ప్రజారచయిత, మహాగాయకుడు.

ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు. తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్‌ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది. కమ్యూనిస్టు పార్టీలోచేరి ప్రజానాట్యమండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను కార్యక్రమాలను బుర్రకథల ద్వార ప్రచారం చేశాడు.వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్‌ కరువు మొదలగు ఇతివృతాలలో నమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు. అసామి అనే నాటకం రాసి ప్రదర్శనలిచ్చాడు.

బుర్రకధ పితామహుడు పద్మశ్రీ నాజర్‌ జీవిత చరిత్రను అంగడాల వెంకట రమణమూర్తి అనే ఆయన పింజారీ అనే పుస్తకంగా ప్రచురించాడు. పుట్టిల్లు, అగ్గిరాముడు, చిత్రాలలో బుర్రకథలు చెప్పాడు. నిలువుదోపిడి, పెత్తందార్లు చిత్రాలకు పనిచేసాడు. కొంతకాలం విరసం సభ్యుడు. ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు. అంగాంగ విన్యాసాల ద్వారా ఆటపాట ద్వారా జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు షేక్‌ నాజర్‌.పుట్టిల్లు, అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే – సినిమాల్లో నాజర్‌ బుర్రకథలు కన్పిస్తాయి పూలరంగడు సినిమాలో అక్కినేనికి నేర్పించారు ఈ సినిమాలో అక్కినేనిలో నాజర్‌ కనిపిస్తారు. (ఇది ఆ ఇద్దరి ప్రతిభకూ రుజువు).

చాలా మందికి ఈ గాంధర్వ విద్య నేర్పాడు. ఆయన గళ గాంభీర్యాన్ని, మాధుర్యాన్ని గమనించి, వివశులైన ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు ఎస్‌. రాజేశ్వరరావు సినీరంగంలో స్థిరపడమని కోరినా, ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం సాగించాడు. ఆసామీ నాటకాన్ని రచించారు. 18వ ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో ఆసామీ నాటకం ప్రధమ బహుమతి పొందింది.

నాజర్‌ ఏడుసార్లు జైలు జీవితాన్ని అనుభవించారు. వేదికపై నాజరు రాగ తాళ నృత్యాభినయ మెరుపు విన్యాసాలు చూడటం ఓ అద్భుతం. రంగస్థల మహానటుడు బళ్లారి రాఘవాచార్యులు నాజరు బుర్రకథ విని అమితానందంతో బళ్లారికి ఆహ్వానించడం, మద్రాసులో ప్రదర్శన చూచిన డా: గోవిందరాజుల సుబ్బారావు నాజరుని అభినందిస్తూ కౌగిలించుకోవడం, ప్రముఖ పాత్రికేయుడు కె.అబ్బాస్‌ నాజరును ఆంధ్ర అమరషేక్‌ అని అభివర్ణించడం కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య నాజరు ప్రజాభాషకు ముగ్ధుడై నా బిడ్డడు ఎంత ఎదిగిపోయాడో అని ఆలింగనం చేసుకోవడం, నాజరు సాధించిన కళాప్రతిభకు తిరుగులేని నిదర్శనాలు. మరణించేవరకు కటిక పేదరికాన్ని అనుభవించాడు.

నాజర్‌ ఆత్మకథ పింజారి చిన్న గ్రంథమే అయినా, తన పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబం, బంధువర్గం, వాతావరణం తాను అక్షరం ముక్క కోసం ఎన్ని కష్టాలు పడిందీ, ఆటపాట నేర్వడానికి ఎన్ని గడపలు తొక్కిందీ, అన్నం ముద్ద కోసం ఎన్ని తిప్పలు పడిందీ, చివరికి కమ్యూనిస్టు పార్టీ తన దిశ ఎలా మార్చిందీ, అవగాహనా క్షేత్రం ఎంతగా విశాలం చేసిందీ వివరంగా చెప్పాడు. ఎవరు తనను మొదట్లో చేరదీసిందీ, అన్నం పెట్టిందీ విద్య నేర్పిందీ మహా పండితుల నుండి తనకంటే విద్యలో చిన్నవారైన వంతల నుండి తానేం నేర్చుకున్నదీ పేరు పేరునా సవినయంగా చెప్పుకున్నాడు. జాతి జీవితం – కళా పరిణామం.

చరిత్ర, మావన పరిణామ క్రమం, సాంస్కృతిక చరిత్రల వెనక దాగి వున్న విషయాలు వివరిస్తాడు. ఇక, తెలుగునాట జానపద వినోదగాన ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళారూపం బుర్ర కథ. కథకుని చేతిలో (సొరకాయ) బుర్ర ఆకారంలో ఉన్న వాయిద్యం వల్ల దీనికి బుర్రకథ అనే పేరు వచ్చినది. యక్షగాన పుత్రికలయిన జంగం కథ, శారద కథలకు రూపాంతరమే బుర్రకథ. అది సంగీతం, నృత్యం, నాటకం. ఈ మూడింటి మేలుకలయిక. బుర్రకథలో నవరసాలూ పలుకుతాయి. ముఖ్యంగా వీర, కరుణరసాలను బాగా ఒప్పించే ప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీర గాథలు, త్యాగమూర్తుల కధలు బుర్ర కథల ఇతివృత్తాలుగా బాగా పేరు కొన్నాయి.

ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తోంది. కుటంబ నియంత్రణ, రాజకీయ ప్రచారము, ప్రజలను విజా&ఙనవంతులను చేయడము వంటి కార్యక్రమాలలో ఇది బాగా వాడబడింది.జంగంకథ ,పంబలకథ ,జముకులకథ ,పిచ్చుకుంట్ల కథ ,తరువాతవచ్చింది.డాలు , కత్తి తో పాడే ప్రధాన కథకుడికి పిచ్చిగుంట్ల కథలో ఇద్దరు వంతలున్నట్లే బుర్రకథలోకూడా ఉంటారు. దీనికి మాన్యత కల్పించి పద్మశ్రీ బిరుదు సంపాదించుకున్నవారు షేక్‌ నాజర్‌. పేరునుబట్టి వీరు ఇస్లాం మతానికి చెందిన వారైనా చెప్పిన కథలలో ఎక్కువ భాగం హిందూ దేవీదేవతలకు చెందినవే. శ్రీకాకుళం పర్యటించినప్పుడు శ్రోతలు బొబ్బిలియుద్ధం కథ కోరారు. దానితో నాజర్‌ తానే కథారచనకూ నడుంబిగించాడు.

అంతేకాదు సామ్యవాద దృక్పధం గల వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది. నాజర్‌ బొబ్బిలియుద్ధం, అల్లూరి సీతారామరాజు ప్రహ్లాద, క్రీస్తు, పల్నాటి యుద్ధం బెంగాల్‌ కరువు వంటి వస్తు వైవిధ్యంగల కథలను చెప్పి రక్తికట్టించారు. తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్‌ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా సాగింది. వినరా భారత వీరకుమారా విజయం మనదేరా అన్న చరణం బుర్రకథల్లో సర్వ సామాన్యం. బుర్రకథ ఎక్కువగా ముగ్గురు ప్రదర్శకులతో నిర్వహించబడుతుంది.

దానికి వంతగా ప్రక్కనున్న ఇద్దరు తందాన తానా అని వంత పాడతారు. అందుకే దీనిని తందాన కథ అని కూడ అంటారు. గుంటూరు జిల్లా తెనాలి, మారీసుపేట వాస్తవ్యులైన ప్రమీల సిస్టర్స్‌ బుర్రకథ చెప్పడంలో అందెవేసిన కళాకారులు. చెన్ను ప్రమీల ప్రధాన కధకులు. వీరు జముకుల కథ కూడా ప్రతిభావంతంగా చెబుతారు. కన్యక, చెల్లి చంద్రమ్మ, అల్లూరి సీతారామరాజు, బొబ్బిలి యుద్దం, పల్నాటి చరిత్ర మొదలగు కథలను రసవత్తరంగా ప్రదర్శిస్తారు. వీరు ఆకాశవాణి, దూరదర్శన్‌లో అనేక ప్రదర్శనలను ఇచ్చారు. చెన్ను ప్రమీల ప్రస్తుతం వరంగల్‌ జిల్లా మామునూరు జవహర్‌ నవోదయ విద్యాలయంలో సంగీతం అథ్యాపకులుగా పనిచేస్తున్నారు.