కడప జిల్లా ప్రాముఖ్యతను చాటిచెలా గండికోట ఉత్సవాలు

114

కడప, ఫిబ్రవరి 5 (న్యూస్‌టైమ్): కడప జిల్లా ప్రాముఖ్యతను చాటిచెప్పేలా గండికోట ఉత్సవాలు ఈ నెల 9, 10వ తేదీల్లో సంస్కృతి, సాహసం కలగలిపి, అడ్వెంచర్ స్పోర్ట్స్‌తో పాటు కళాకారులచే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సీమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండగగా గండికోట ఉత్సవాలకు గుర్తింపు ఉంది. కడప వైభవానికి, గండికోట రాచరికానికి అద్దం పట్టే ఉత్సవంగా కూడా చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి.

చరిత్ర పుటల్లోని జ్ఞాపకాలను నెమరువేసుకునే వైభవం గండికోట ఉత్సవం. ఇదిలావుండగా, నాలుగేళ్ల ఉత్సవాల్లో ఈసారీ కాసుల లెక్కలు కాగితాలకే పరిమితం కాగా క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ నిధులను వినియోగించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఆ నిధులు అందడంలో జాప్యం జరుగుతోంది. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాల్సి వస్తోంది. తెదేపా అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి సామాన్యుడికి చేరువ చేసేలా ప్రాంతాన్ని బట్టి స్థానిక ఉత్సవాలు నిర్వహించేందుకు నడుం కట్టింది.

కడప జిల్లాలోనూ గండికోట ఉత్సవాలను జరుపుతోంది. ప్రపంచంలోనే ప్రత్యేక భూస్వరూపాన్ని కలిగిన, చారిత్రక వైభవం సంతరించుకున్న గండికోటకు ఘనమైన చరిత్ర చాటిచెప్పేందుకు నాలుగుసార్లు ఉత్సవాలు నిర్వహించారు. నిర్వహణలోనే ఏటా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తొలి ఉత్సవాలను పురస్కరించుకుని గండికోటకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అమెరికాలోని గ్రాండ్‌కెన్యాన్‌ తరహాలో ఉన్న గండికోటలో స్కైవాక్‌ పేరుతో అద్దాల వంతెన ఏర్పాటు చేస్తామని, గండికోట రోడ్డును అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఆ హామీలు అలాగే మిగిలాయి. అయితే, ఇటీవల రోడ్డు మాత్రం బాగుచేశారు.

కాగా, ఈ ఏడాది నాలుగో విడత గండికోట ఉత్సవాలను ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఆ దిశగా ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఇటీవలే కలెక్టర్‌ హరికిరణ్‌ పలు కమిటీలను ఏర్పాటు చేశారు. సభావేదిక, లైటింగ్‌ తదితరాలకు 7 టెండరు దరఖాస్తులు అమ్ముడుపోగా 6 దాఖలు చేశారు. అందులో ముగ్గురు అర్హత సాధించగా హెచ్‌ వర్క్స్‌ హైదరాబాద్‌కు చెందిన సంస్థ రూ.65 లక్షలు తక్కువకు కోట్‌ చేశారు. అనంతరం కమిటీ ఆమోదానికి ప్రతిపాదించారు.

ఇక్కడ ఎంప్యానల్‌ జాబితాలో ఉన్న సంస్థలకే అవకాశం కల్పించగా అందులో ఆ సంస్థ తక్కువకు కోట్‌చేసి దక్కించుకోవడం గమనార్హం. ముందుగానే టెండరు మ్యాచ్‌ఫిక్సింగ్‌ జరిగిందన్న విమర్శలు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. గతేడాది గోవాకు చెందిన విన్సస్‌ గ్రాఫిక్స్‌ సంస్థ నిర్వహణ అవకాశం దక్కించుకోగా ఈసారి హైదరాబాద్‌కు చెందిన సంస్థకు అవకాశం లభించడం ప్రస్తావనార్హం. ఇక, గండికోట ఉత్సవాలకు నిధుల మంజూరులో జాప్యం జరుగుతోంది. రెండోసారి రూ.కోటి కేటాయించగా మూడోసారికి రూ.2 కోట్లు, నాలుగోసారి ఉత్సవాలకు రూ.3 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉత్తర్వులకే పరిమితమవుతుండగా అధికారులు ఆపసోపాలు పడుతూ నిర్వహించాల్సి వస్తోంది.

ఎప్పుడో విడుదలయ్యే ఉత్సవాల నిధులను తిరిగి ఆ శాఖాపరమైన ప్రగతికి వెచ్చించాల్సి వస్తోంది. రెండోసారి జరిగిన ఉత్సవాల్లో అయితే ప్రభుత్వం కేటాయించిన సొమ్ములు చాలక ప్రైవేటు పరిశ్రమల వద్ద చందాలు వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈసారి ఉత్సవాల్లోనూ ‘ఈవెంట్‌ కల్చర్‌’ పెచ్చుమీరడం మరో సమస్యగా మారింది. గండికోట ఉత్సవాలంటేనే కడప జిల్లా ప్రజలకు ఎనలేని ఉత్సాహం. జిల్లాలో ఇక్కడ ఎన్నో రకాల సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ క్రీడలు ఉన్న క్రమంలో వాటికి ప్రాధాన్యం ఇస్తే ప్రజలను ఉత్సవాలకు చేరువ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.

అందుకు భిన్నంగా నిర్వహిస్తుండటంతో సమస్య ఏర్పడింది. గతేడాది అనేకమార్లు వాయిదా పడిన ఉత్సవాలు చివరకు నిర్వహణకు నోచుకున్నా అందులోనూ స్థానికతకు చోటులేకుండా పోయింది. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో స్థానిక కళలకు చోటులభించలేదు. చివరకు ఏర్పాట్ల పరంగానూ విఫలమవడంతో ట్రాఫిక్‌ అస్తవ్యస్తమైంది. విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరైన ఆహారం అందించకుండానే రూ.లక్షల్లో బిల్లులు పెట్టారన్న విమర్శలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ సమస్య వేధించగా ప్రత్యామ్నాయంగా మొబైల్‌ టవర్స్‌ ఏర్పాటులోనూ నిర్లిప్తత చూపడం గమనార్హం. ఈ ఏడాది ఉత్సవాల్లోనూ సిగ్నల్స్‌ సమస్య ఏ మేరకు పరిష్కారమవుతుందన్నది అర్థం కాని ప్రశ్న.

స్థానికంగా ఓ సంస్థ టవర్‌ నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తుండగా మూడు నెలలుగా ఆ పనులు సాగుతూనే ఉండటంతో సమస్య ఏర్పడింది. కనీసం ఉత్సవాల నాటికైనా అందుబాటులోకి వస్తుందా అన్నది అర్థం కాని ప్రశ్న. మొత్తంగా కడప వాసులకు దూరంగా జరుగుతున్న గండికోట ఉత్సవాల్లో ఈసారైనా స్థానికతకు పెద్దపీట వేస్తారా? లేదా? అన్నది వేచిచూడాల్సి ఉంది. మొత్తానికి గండికోట ఉత్సవాలు ఈసారీ లెక్కలేనన్ని సమస్యల నడుమే సాగనున్నాయన్నది స్పష్టమైంది.