కురుబలకోటలో కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు

116

చిత్తూరు, ఫిబ్రవరి 5 (న్యూస్‌టైమ్): ఓ వైపు పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో డ్వాక్రా మహిళలు, అవ్వ-తాతలు ఆనందంతో ఉంటే, మరోవైపు, రాయలసీమలోని బీడు భూములు సైతం కృష్ణమ్మ రాకతో తడిసి ముద్దవుతున్నాయి. చిత్తూరు జిల్లా కురబలకోట మండలానికి వచ్చిన కృష్ణమ్మకు ప్రజలు పూజలు చేసి ఘనంగా స్వాగతం పలికారు. సుదీర్ఘ ప్రయాణం అనంతరం కృష్ణమ్మ చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

కాలువ పొడవునా పరిసర గ్రామాల ప్రజలు కృష్ణా జలాలకు పూజలు చేసి ఘన స్వాగతం పలికారు. సాయంత్రం 5 గంటల సమయంలో కురబలకోట మండలం నుంచి మదనపల్లె మండలంలోకి చేరుకోగానే నాయకులు, ప్రజలు కేరింతలు కొట్టారు. కాట్లాటపల్లె సొరంగం వద్ద అధిక సంఖ్యలో ప్రజలు చేరుకోవడంతో తిరునాళ్లను తలపించింది. మదనపల్లె పట్టణం నుంచి కూడా కాలువలో వస్తున్న నీటిని చూడటానికి అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. అడుగడుగునా ప్రజలు కృష్ణమ్మకు ప్రజలు హారతి పట్టారు.

సాయంత్రం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్, నాయకులు గంగారపు రాందాస్‌చౌదరి, బోడిపాటి శ్రీనివాస్, శ్రీరాంచినబాబు, బీసీ నాయకులు జబ్బల కుమార్‌రాజ, మార్పురి శశిధర్‌రావు, డి.ఆర్‌.తులసీప్రసాద్‌ అక్కడికి చేరుకున్నారు. రాందాస్‌చౌదరితో మిగిలిన నాయకులు మండలం ప్రారంభం వద్ద కాలువలోకి దిగారు. అక్కడ కృష్ణ జలాలకు హారతి ఇచ్చారు. అక్కడి నుంచి కిలోమీటరు మేర కాలువలో వస్తున్న నీటితో పాటు నడుచుకుంటూ వచ్చారు. స్థానిక కాట్లాటపల్లె వద్ద ప్రారంభమయ్యే టన్నల్‌(సొరంగం) వద్దకు నీరు రాగానే మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ జల హారతి ఇచ్చారు. నాయకులు కాలువలోకి నీళ్లు వచ్చిన ఆనందంతో నృత్యాలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కొనియాడారు. కరవుతో తాగునీటికి అవస్థలు పడుతున్న ప్రజల దాహార్తిని తీర్చడానికి ఆయన అపర భగీరథుడిగా మారారని అన్నారు. కాట్లాటపల్లెకు చెందిన రైతులు, మహిళలు వారి ఊరి సమీపంలోకి నీరు రాగానే పూజలు చేశారు. ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది.

కాలువలో వస్తున్న నీటిని తలపై జల్లుకుని సంతోషం వ్యక్తం చేశారు. తాగడానికి నీరు లేక అల్లాడుతున్న తమను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదుకున్నారని అన్నారు. కాట్లాటపల్లె వద్ద సొరంగం ప్రారంభం అయింది. ఇక్కడి నుంచి సొరంగం మార్గంలోనే 2.5 కిలోమీటర్ల దూరం ప్రవహించాక రామిరెడ్డిగారిపల్లె వద్ద సొరంగాన్ని దాటి చిప్పిలి వద్ద నిర్మించిన ఎస్‌.ఎస్‌.ట్యాంకుకు కృష్ణా జలాలు చేరుకున్నాయి ఐదు రోజుల పాటు ట్యాంకు నీటిని నింపనున్నారు.