పౌరాణిక పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్!

185

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (న్యూస్‌టైమ్): ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు ధరిస్తే, ఆ గెటప్ తాలూకు కటౌట్లకు థియేటర్ల వద్ద పాలాభిషేకాలు జరిగేవి. సామాన్య ప్రేక్షకులనే కాకుండా ఎన్టీఆర్ ధరించిన కృష్ణుడు, రాముడు, రావణ, సుయోధన పాత్రలు ఉత్తరాది సినీ దర్శకులను కూడా ఆకర్షించాయి. ప్రఖ్యాత భారతీయ సినీ దర్శకుడు వి.శాంతారాం ‘శకుంతల’ అన్నపౌరాణిక బాలీవుడ్ చిత్రాన్ని 1943లో నిర్మించారు. ఆ తర్వాత 1966లో ఎన్టీఆర్ నటించిన ‘శకుంతల’ తెలుగు చిత్రం విడుదలైంది. ఆ చిత్రాన్ని చూసిన శాంతారాం ఎన్టీఆర్‌ను దుశ్యంతునిగా చూసి అలౌకిక భావనకు గురయ్యారంట.

‘నా ఊహల్లో దుశ్యంతుడు ఇలాగే ఉంటాడు… ఇప్పటికైనా మరోసారి అదే శకుంతల చిత్రాన్ని ఎన్టీఆర్‌తో చేస్తా’ అంటూ ఎన్టీఆర్‌ను సంప్రదించారట. అలాగే ప్రఖ్యాత ‘రామాయణ్’ సీరియల్ తీయడానికి ముందు దర్శకుడు రామానంద్ సాగర్ ఎన్టీఆర్‌ను కలిసి ఆయా పాత్రల తీరుతెన్నుల గురించి, ఆహార్యం గురించి అడిగి తెలుసుకున్నారంట. మరో సందర్భంలో తమిళనాట శివాజీ గణేషన్ నటించిన ‘కర్ణ’ చిత్రంలో కృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్‌ను చూసిన తమిళ ప్రేక్షకులు పులకించి పోయారంట.

చిత్ర శతదినోత్సవానికి హాజరైన ఎన్టీఆర్ ను చూసి ‘ఆండవనే (దేవుడు)’ అంటూ కీర్తించారంట. అంతటి ప్రభావవంతమైన రూపం, ప్రతిభ కలిగిన ఎన్టీఆర్ తెలుగువారవడం మనకు గర్వకారణం.