డ్రైవర్ల కుటుంబాలకు చంద్రన్న ఆర్థిక భరోసా

161

అమరావతి, ఫిబ్రవరి 5 (న్యూస్‌టైమ్): కుటుంబ జీవన భారాన్ని మోసేందుకు వాహనాలు నడుపుతూ, ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతూ, అప్పుడప్పుడూ అనారోగ్యం పాలవుతూ ఉండే డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఇప్పటికే చంద్రన్న బీమా పేరిట రూ.5 లక్షల ప్రమాద బీమాను అందిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం డ్రైవర్ల కోసం మరో ముందడుగు వేసింది. రైతు సాధికార సంస్థ, మహిళా సాధికార సంస్థల తరహాలోనే డ్రైవర్ల సామాజిక, ఆర్థిక శ్రేయస్సు కోసం కొత్తగా డ్రైవర్ల సాధికార సంస్థను నెలకొల్పనుంది. ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు బడ్జెట్‌లో రూ.150 కోట్లను కేటాయించింది.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సర్వజన సంక్షేమానికి అద్దం పడుతోందన్న ప్రశంసలు వస్తున్నాయి. మొత్తం రూ.2,26,177.53 కోట్ల బడ్జెట్‌లో రైతుల కోసం ‘అన్నదాత సుఖీభవ’ అనే ఒక వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టి, ఈ బడ్జెట్లో పథకానికి రూ.5,000 కోట్లను కేటాయించారు. దేశంలో మరెక్కడా లేనటువంటి విధంగా రైతులకు రూ.24వేల కోట్ల రుణభారం నుంచి విముక్తి కలిగించిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఐదేళ్ళలో వ్యవసాయానికి పెట్టిన బడ్జెట్ రూ. 81,554 కోట్లు. ఇప్పుడు రైతుల కోసం కొత్తగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రవేశపెట్టి ‘అన్నదాతల ఆత్మబాంధవుడు’ అయ్యారు చంద్రబాబు.