నైపుణ్యానికి నిదర్శనం: జోహాన్స్!

332
Illustration of Johannes Gutenberg Printing the First Sheet of the Bible
  • ప్రింటింగ్ ప్రెస్ సృష్టికర్త పరిచయం

జోహాన్స్ గుటెన్‌బర్గ్… ఈయన గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. వృత్తిపరంగా ఆయన చేసింది శాసనాలు చెక్కడమే కావచ్చు గానీ, అంతకుమించి ఆయనలో ఓ అన్వేషి, ముద్రకుడు దాగి ఉన్నారు. ‘జోహాన్నెస్ గెన్‌ఫ్లీష్ జుర్ లాడెన్ జుమ్ గుటెన్‌బర్గ్’ చరిత్ర ఆధారాల ప్రకారం జర్మనీలో బంగారుపని చేసేవాడట. అక్కడే ముద్రణాకారుడిగా కూడా తన ప్రవృత్తిని కొనసాగించారు. ఈయన ముద్రణా-యంత్రాన్ని (ప్రింటింగ్ ప్రెస్)ను 1439లో కనిపెట్టారు. ఇతను ప్రధానంగా చేసిన పని గుటెన్‌బర్గ్ బైబిల్ (42-లైన్ల బైబిల్ అని పరిచయం) ముద్రణ, ఇతడి నైపుణ్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు.

సాంకేతికపరంగా మనకు ప్రస్తుతం అనేక ఆధునిక ముద్రణా యంత్రాలు వచ్చినప్పటికీ అప్పట్లో ఆయన కనిపెట్టిన యంత్రానిదే మొత్తం హవా అంతా. అలెగ్జాండ్రియాలో పూర్వం ఒక పెద్ద గ్రంథాలయం ఉండేది. జూలియస్ సీజర్ ఈ నగరాన్ని ముట్టడించినపుడు గ్రంథాలయం కొంతవరకు ధ్వంసం అయినది. క్రీ.శ 390లో ధియోఫిలన్ అనే క్రైస్తవ మత గురువు ఇక్కడి నుంచి కొన్ని పుస్తకాలను తరలించాడు.

క్రీ.శ 642లో మహమ్మదీయులు ఈ నగరం పై దండెత్తి వచ్చినపుడు కాలిఫ్ ఉమర్ గ్రంథాలయం కాల్చివేయమని సైనికులను ఆజ్ఞాపించాడు. సుమారు 4 లక్షల పుస్తకాలు మానవుని తెలివి తక్కువ తనానికి, ప్రతీకార వాంఛలకు బలైపోయాయి. ప్రాచీన సాహిత్య గ్రంథాలూ, జానపద గాథలూ, తరగని విజ్ఞాన సంపదా వాటిలో నిక్షిప్తంగా ఉండేవి. అవన్నీ రాయస గాళ్ళ చేత, బానిసల చేత, పండితుల చేత చేతితో రాయబడ్డవే. ఒక పెద్ద గ్రంథాలయం నాశనం కావడంతో కళలకు, సాహిత్యానికి, వేదాంత విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన అపార జ్ఞాన నిధి తరువాతి తరాలకు శాశ్వతంగా దూరమైంది.

కానీ ఇలాంటి దుర్ఘటన ప్రపంచంలో మరెన్నడూ సంభవించదు. లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం, వాషింగ్టన్ లైబ్రరీ కాంగ్రెస్, పారిస్‌లోని బిబ్లియోధెక్ నేషనేల్ సంపూర్ణంగా దగ్ధమైపోయినప్పటికీ, వాటి ప్రతులు ఇతరదేశాల లైబ్రరీల్లో నేడు లభ్యమవుతున్నాయి. నాగరికత మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లి కొనసాగినంత వరకూ పదిల పరచదగ్గ సమాచాన్నంతా ముద్రణ యంత్రం మనకోసం పదిల పరిచే ఉంటుంది. మానవ చరిత్రలో జరిగిన అనేక ఆవిర్భావాల్లో ప్రజల జీవన సరళినే కాకుండా వాళ్ళ మనసుల్ని, హృదయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఒక్క ముద్రణ విధానమే అని చెప్పవచ్చు.

దీని ఆవిర్భావం వెనుక పొంతన లేని అనేక కథలు అల్లుకుపోయాయి. కాగితం తయారు చేయటానికీ, ముద్రణ విధానం ప్రవేశపెట్టడానికీ శ్రీకారం చుట్టింది చైనీయులే, చైనా భాషకు సంబంధించిన సంకేతాలను కొయ్యపై చెక్కి, సక్రమంగా అమర్చి, వాటికి సిరా పూసి కాగితాలపై ఒత్తడంతో వాళ్ళ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చైనా లిపిలో అక్షరాలుండవు. శబ్దానికి సంబంధించిన మాత్రా కాలాలకు సంకేతాలుంటాయి. విడిగా ఉండే అచ్చులతో ముద్రించే విధానం చైనాలో 13వ శతాబ్దంలోనూ, కొరియాలో 14వ శతాబ్దంలోనూ ప్రారంభమైంది. అనేక శతాబ్దాలుగా దూర ప్రాచ్య దేశాల్లో బొమ్మలను ముద్రించే పద్ధతి నుంచి ఈ విధానం రూపొందిందని చెప్పవచ్చు. ఐరోపాలో కూడా ముద్రణ మొదట్లో బొమ్మలతోనే ప్రారంభమైంది. కొయ్య దిమ్మలతో పటాలను చెక్కి చీట్ల పేకలను తయారుచేసేవారు.

నానాటికీ అంటు రోగంలా వ్యాపిస్తున్న పేకాటకి విరుద్ధంగా చర్చి అధికారులు ప్రచారం సాగించటమే కాకుండా మతగురువుల పటాలను పెద్ద ఎత్తున ముద్రించటం ప్రారంభించారు. బొమ్మలతో పాటు కొన్ని పదాలను చేర్చాలనే అభిప్రాయం కలిగింది. కానీ వాటినన్నిటినీ కొయ్య దిమ్మపై చెక్కటం ఇబ్బందికరంగా ఉండేది. ఇదే సమయంలో పశ్చిమ ఐరోపాలో కొందరు కొయ్య లేదా లోహంతో అక్షరాల అచ్చులను తయారుచేసి, ముద్రించటానికి అనుకూలంగా వాటిని పదాలుగానూ, వాక్యాలుగానూ మార్చి ముద్రించాలని ప్రయత్నించారు. దీనికి కావలసిన కాగితం తయారీ అరబ్బుల పుణ్యమా అని చైనా నుంచి ఐరోపా ఖండానికి తీసుకు రాబడి అందరికీ లభ్యంగా ఉండేది.

చదవటం, రాయటం నేర్చుకున్న వాళ్ళందరూ పుస్తకాలు కావాలని తహతహలాడుతుండేవారు. చేతితో రాసిన పుస్తకాలు కొద్దిగానే ఉండడంచేత అవి ఆశ్రమాల లోని సన్యాసులకు, మత గురువులకు, చర్చి అధికారులకు, విశ్వ విద్యాలయాల్లో ఆచార్యులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. విషయాలను తెలుసుకోవాలనీ, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనీ ఆకాంక్షించే సామాన్య ప్రజలకు ఇలాంటి సదుపాయం దుర్లభంగా ఉండేది. అచ్చుల సహాయంతో అక్షరాలను ముద్రించే విధానం ఈ నేపథ్యంలో ప్రారంభమైనదని చెప్పవచ్చు. ఈ విధానాన్ని ఎవరు కనుక్కున్నారనడంలో అనేక భేదాభిప్రాయాలున్నాయి. ఈ విధానాన్ని ఉపయోగించి మొదటి పుస్తకాన్ని లారెన్స్ కాప్టర్ ముద్రించాడని ప్రశంసిస్తూ హాలెండ్‌లోని హార్లెం నగరంలో రెండు స్మారక చిహ్నాలున్నాయి.

తొలి పుస్తకాన్ని ముద్రించినవాదు ఓ డాక్టర్ అని వెబుతూ ఫెల్టర్ అనే ఇటలీ నగరంలో మరో స్మారక చిహ్నం నెలకొల్పబడింది. స్ట్రాస్ బర్గ్, ప్రాగ్ నగరాల్లో కూడా ఈ ఘనత మాదే అంటూ స్మారక చిహ్నాలు వెలిశాయి. 500 సంవత్సరాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. 15వ శతాబ్దం పూర్వార్థంలో లారెన్స్ కాస్టర్ అక్షరాల అచ్చులతో పుస్తకాన్ని ముద్రించినట్లు తెలుస్తున్నప్పటికీ జర్మనీలో మెయింజ్‌కి చెందిన జోహన్ గ్యూటెన్ బర్గ్ అనేక కొత్త పద్ధతుల ద్వారా ముద్రణ విధానానికి మెరుగులు దిద్దాడని అంగీకరించకతప్పదు. గ్యూటెన్ బర్గ్ సంపన్న కుటుంబలో జన్మించాదు. చిన్నతనంలోనే స్త్రాన్ బర్గ్‌కి వెళ్ళి కొయ్య దిమ్మలతో ముద్రించటం చేర్చుకున్నాడు. అద్దాలకు మెరుగుపెట్టడం, రత్నాలకు సానపెట్టడం కూడా కొన్నాళ్ళూ చేశాడు. ఈ హస్త కళల్లో అనేక కొత్త పద్ధతులను కనిపెట్టాడు.

అక్షరాల అచ్చులను విడిగా తయారుచేసి వాటిని పదాలుగా, వాక్యాలుగా కూర్చే ఆలోచన స్ట్రాన్ బర్గ్ లోవున్నప్పుడే అతనికి తట్టినట్టు తెలుస్తోంది. 50 ఏళ్ళ వయసులో అతడు తన జన్మస్థానానికి తితిగి వచ్చి ఆలోచనల్ని ఆచరణలో పెట్టసాగాడు. ఒక్కొక్క అక్షరానికి ఒక అచ్చును తయారుచేసి, వీటి నుంచి ఒకే పరిమాణంలో ఉండే లోహపు అచ్చుల్ని తీర్చిదిద్దాడు. అప్పట్లో చేతితో రాయబడే అక్షరాలు కేవలం అలంకార ప్రాయంగా వున్నాయన్న కారణంతో ముద్రణకు సరిపోయేలా అక్షరాల తీరులో సరిక్రొత్త మార్పులు చేశాడు. అక్షరాలను కచ్చితంగా ఏర్పరిచే అచ్చులను తయారుచేసే సాధనాన్ని కూడా అతడే కనుగొన్నాడు. అచ్చులన్నిటికీ ఒకే పరిమాణంలో సిరా పూయటానికి మరో సాధనాన్ని, కావససినంత ఒత్తిడిని మాత్రమే కలగజేసే ఒత్తుడు యంత్రాన్నీ తయారుచేశాకనే అతడు ముద్రణకు పూనుకున్నాడు.

వీటి నిర్మాణానికి అతడెంతో శ్రమపడ్డాడు. తొలిసారిగా అతడు ఒక పాత జర్మన్ పద్యాన్ని ముద్రించి చూశాడు. ఇది తృప్తికరంగానే వుండటంతో లాటిన్ భాషలో బైబిల్ మొత్తాన్ని ముద్రించటానికి సాహసించాడు. ఒక పేజీకి 42 గీతలు చొప్పున 1282 పేజీలు గల ఆ గ్రంథాన్ని సరైన సదుపాయాలు లేని చిన్న సంష్త ముద్రించటానికి పూనుకోవటం నిజంగా సాహసమే! అనేక సంవత్సరాలు శ్రమించి అతడీ బృహత్కార్యాన్ని 1456లో పూర్తి చేశాడు. పని పూర్తయ్యే సరికి అతనివద్ద చిల్లిగవ్వ కూడా మిగలలేదు.

ఇంతవరకు డబ్బు సమకూరుస్తూ వచ్చిన అతని భాగస్వామి తన వాటా వెంటనే ఇచ్చివేయమని పట్టు బట్టాడు. గత్యంతరం లేక ఇంటినీ, వర్క్ షాప్‌నీ, ముద్రించిన ప్రతులనూ గ్యూటెన్ బర్గ్ వదిలి వెళ్ళాల్సి వచ్చింది. అతని శేష జీవితం ఎలా గడిచిందో తెలియదు కానీ పదేళ్ళ తరువాత ఓ చర్చి అధికారి తన ఇంట్లో ప్రశాంతంగా జీవితం గడపాలని గ్యూటెన్ బర్గ్‌ని ప్రార్థించగా, అతడక్కడే వుండి రెండేళ్ళలో శాశ్వతంగా కన్నుమూశాడు.