ప్రశాంతంగా తుది దశ పంచాయతీ పోలింగ్‌

349

హైదరాబాద్, జనవరి 30 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ బుధవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా ఓటర్లు బూత్‌ల వద్ద బారులుతీరి కనిపించారు. తుది విడత ఎన్నికల్లో భాగంగా 29 జిల్లాల్లోని 3,529 పంచాయతీల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. దీని కోసం మొత్తం 32,055 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

11,667 మంది సర్పంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. 27,583 వార్డుల్లో 67,316 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయడంతో పాటు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన చోట అదనపు బలగాలను మోహరించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్‌ పూర్తయ్యాక భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేశారు.

తొలి రెండు విడతల్లో 7,043 పంచాయతీలకు పోలింగ్‌ జరిగింది. ఇదిలావుండగా, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలో ఎన్నికలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అన్ని పంచాయతీలను అధికారులు ఎస్టీకి రిజర్వు చేశారు. రొటేషన్‌ పద్ధతిలో ఎన్నికలు జరపాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కోర్టు ఆదేశాలతో మండలంలోని 25 పంచాయతీల్లో ఈసీ ఎన్నికలను నిలిపివేసింది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. తొలి రెండు విడతల్లో మాదిరిగానే తుది విడతలో కూడా మద్యం, డబ్బు పంపిణీదే అగ్రతాంబూలం అయింది.

ఎన్నికలు జరుగుతున్న పంచాయతీలలో మంగళవారం రూ.6.79 లక్షల విలువైన మద్యంతో పాటు రూ.50 వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ నెలలో మొత్తం రూ.1.93 కోట్లు సీజ్ చేసినట్లయింది. మూడోవిడతలో మొత్తం 4116 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 577 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరో 10 గ్రామాల్లో అసలు నామినేషన్లే దాఖలు కాలేదు. మొత్తం 36,729 వార్డులుండగా, 8,959 వార్డులు ఏకగ్రీవం కాగా, 188 వార్డులకు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో పోలింగ్ జరగ లేదు. రెండో విడుతలో పోలింగ్ వాయిదాపడిన గ్రామాలకు మూడోవిడుతలో పోలింగ్ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా జల్లపల్లి, ఆదిలాబాద్ జిల్లా తోషంతండా సర్పంచ్, 3వ వార్డుకు, రంగారెడ్డి జిల్లాలో ఒక వార్డుకు కూడా పోలింగ్ నిర్వహించారు.

మూడోదశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పరిశీలకులు, ఎన్నికల నియమావళి అధికారుల బృందం గత రెండు రోజుల నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. వరంగల్ జిల్లాలో ఓ పార్టీ నేత నుంచి రూ.50వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లాలో రూ.78,260, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రూ.6,200, భద్రాద్రి కొత్తగూడెంలో రూ.23 వేలు, సంగారెడ్డిలో రూ.2 లక్షలు, మెదక్‌లో రూ.4,800, వికారాబాద్‌లో రూ.29,520, వనపర్తిలో రూ.22,080, నల్లగొండలో రూ.72,040, కరీంనగర్‌లో రూ.2.19 లక్షల, రామగుండం కమిషనరేట్ పరిధిలో రూ.4,800, రాచకొండ కమిషనరేట్ పరిధిలో రూ.20 వేల విలువైన మద్యాన్ని పట్టుకున్నట్టు చెప్పారు. వీరిలో 43 మందిపై కేసు చేసి, 19 మందిని అరెస్టు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ నెల 1 నుంచి 29 వరకు జరిపిన తనిఖీల్లో మొత్తం రూ.1,93,51,490 నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఖమ్మం జిల్లాలో అత్యధికంగా రూ.1.18 కోట్లను సీజ్ చేశారు. మొత్తంగా రూ.63,91,222 విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. 572 మందిపై కేసులు నమోదు చేయగా, 260 మందిని అరెస్టు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీకి చెందిన 47 మంది పార్టీ అభ్యర్థులపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.