నాలాల శుద్ధికి బల్దియా ప్రత్యేక చర్యలు

145

హైదరాబాద్, జనవరి 30 (న్యూస్‌టైమ్‌): హైదరాబాద్‌ నగరంలో నాలాల శుద్ధికి ప్రత్యేక కార్యక్రమం బల్దియా రూపొందించింది. 365 రోజులు నాలాల పూడిక తీయాలని నిర్ణయించింది. అవినీతికి తావులేకుండా నగరవాసులకు అసౌకర్యం కలగకుండా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమంటుంది జీహెచ్‌ఎంసీ. గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఉన్న నాలాల‌ శుద్ధికి ప్రత్యేక చ‌ర్యలు చేప‌ట్టింది బ‌ల్దియా. నగర ప‌రిధిలోని దాదాపు వెయ్యి కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో మురుగు కాలువ‌లు, వ‌ర్షపునీటి కాలువ‌లున్నాయి.

వీటిలో మేజ‌ర్ నాలాలు 216 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. పైప్‌లైన్ డ్రెయిన్లు, చిన్న సైజు నాలాలు మరో 735 కిలోమీట‌ర్ల మేర విస్తరించి ఉన్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలానికి ముందు ఈ నాలాల పూడికతీత పనులు చేసేవారు. ఈ ప‌నుల కోసం ప్రతి ఏటా 25 నుంచి 30కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేస్తుంది బ‌ల్దియా. అయితే ప‌నుల అనంత‌రం మ‌ట్టిని నాలాల ప‌క్కనే వేయ‌డంతో వ‌ర్షం పడినప్పుడు ఆ మట్టి మళ్లీ నాలాల్లోకి కొట్టుకువచ్చేది. దీంతో ఆ డబ్బంతా వృథా అయ్యేది. మరోవైపు పూడికతీత పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చేది. వీటన్నింటిని ఆధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ఇక నుంచి ప్రతి రోజు నాలాల పూడికతీత పనులు చేపట్టాలని డిసైడ్ అయింది.

దీంతో నాలాలు పొంగిపోర్లే ఇబ్బందులు తప్పుతాయని భావిస్తోంది. దాదాపు 1000కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉన్న మేజ‌ర్ నాలాలు, డ్రెయిన్లు, చిన్న నాలాలు, పైప్ డ్రెయిన్ల పూడికతీత ప‌నుల‌కు 30.18కోట్ల రూపాయ‌ల‌తో టెండ‌ర్లు పిలిచారు బ‌ల్దియా అధికారులు. వీటిలో 216 కిలోమీట‌ర్ల పొడ‌వున ఉన్న మేజ‌ర్ నాలాల్లో 4,49,111 క్యూబిక్ మీట‌ర్ల పూడిక ఉంద‌ని అంచ‌నా వేయగా.. 735 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉన్న మైన‌ర్ డ్రెయిన్లు, పైప్ డ్రెయిన్లలో 3,33,780 క్యూబిక్ మీట‌ర్ల పూడిక ఉంద‌ని అధికారులు లెక్కలేశారు. ఈ ప్రణాళిక‌తో ఎప్పటిక‌ప్పుడు నాలాల పూడిక‌తీత పూర్తవ‌డ‌మే కాకుండా ప‌నుల్లో పార‌ద‌ర్శకత ఉంటుంద‌ని బల్దియా భావిస్తోంది. మరోవైపు, సాగునీటి ప్రాజెక్టుల నిధుల్లో భారీగా కోత పడనుంది.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించామని చెబుతున్న ప్రభుత్వం.. అమల్లో మాత్రం మొండి చెయ్యి చూపుతోంది. తొమ్మిది నెలల గడిచిన తర్వాత కూడా కేటాయించిన బడ్జెట్‌లో నిధులు సగం కూడా ఖర్చు చేయకపోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల పనులు నత్తనడక నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నాం.. మన నీళ్ళు మనం సాధించుకుందాం అంటూ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే మా తక్షణ కర్తవ్యం అంటూ పదేపదే చెప్పుకొస్తోంది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

దేశంలో ఎక్కడా లేని విధంగా 25000 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు జరిపినప్పటికీ నిధుల వినియోగం మాత్రం జరగలేదు. గత వార్షిక బడ్జెట్ లో సాగునీటి రంగానికి 25 వేల కోట్లు కేటాయించింది రాష్ట్రప్రభుత్వం. అయితే డిసెంబర్‌ నెలాఖరుకు ప్రాజెక్టులపై 9వేల 700 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగింది. అంటే ఇప్పటి వరకు కేటాయించిన వాటిలో కేవలం 40 శాతం కూడా ఖర్చు పెట్టలేక పోయింది కేసీఆర్‌ సర్కార్. వచ్చే బడ్జెట్ నాటికి మిగిలిన మూడు నెలల కాలంలో వేగంగా చెల్లింపులు జరిపినా 6 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టడం అసాధ్యమనేది అధికారుల వాదన.

ఫలితంగా గతానుభవంతో వచ్చే బడ్జెట్ సమావేశాల్లో నీటి పారుదల రంగానికి నిధుల కేటాయింపులు తగ్గిస్తారనీ తెలుస్తొంది. వచ్చే బడ్జెట్ లో కేవలం 16వేల కోట్లు సరిపొతాయనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాన ప్రాజెక్టుల లెక్కలు చూసుకుంటే కరువు పీడిత మహబూబ్‌నగర్‌ జిల్లాకు తాగునీరు, సాగునీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నత్తనడక నడుస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌లో అత్యధికంగా 7వేల 810 కోట్లను ఈ ప్రాజెక్టుకు కేటాయించగా డిసెంబర్‌ నెలాఖరుకు కేవలం 440 కోట్లు మాత్రమే ఖర్చయింది. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి సంవత్సరం కావస్తున్నా పనులు వేగం పుంజుకోలేదు. ఇక ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కూడా నత్తనడక నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కింద భూసేకరణకే ఎక్కువగా చెల్లింపులు చేసినట్టు తెలుస్తోంది.

మూడు బ్యారేజీలు. పంప్‌హౌస్‌ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రస్తుత బడ్జెట్‌లో 6వేల 286 కోట్లు కేటాయించగా తొమ్మిది నెలల కాలంలో 3వేల 652 కోట్లు ఖర్చు పెట్టారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టుల కోసం 849 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు 640 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ప్రాజెక్టులను ఈ సంవత్సరం జూన్‌ నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

లక్ష్యం ఎలా ఉన్నా ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి అంతంత మాత్రంగా ఉంది. నోట్ల రద్దు, నిధుల కొరత ఒక ఎత్తైతే. భూసేకరణ, అధికారుల నిర్లక్షం వెరసి తెలంగాణ ప్రాజెక్ట్ ల నిర్మాణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. మరిప్పటికైనా ప్రభుత్వం స్పందించి లొటుపాట్లు సరిచేయాలని నీటిపారుదల రంగ నిపుణులు కోరుతున్నారు.