యువతే నిర్ణేతలు: ‘వై ఏపీ నీడ్స్‌ ఛేంజ్‌’ సదస్సులో మేధావులు

197

విశాఖపట్నం, జనవరి 28 (న్యూస్‌టైమ్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్ధి విభాగం పార్లమెంట్‌ అధ్యక్షుడు బి.కాంతారావు ఆధ్వర్యంలో రుషికొండ గాయత్రీ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం ‘వై ఆంధ్రప్రదేశ్‌ నీడ్స్‌ ఛేంజ్‌’ అనే అంశంపై నిర్వహించిన స్టూడెంట్‌ పార్లమెంట్‌లో ముఖ్యఅతిథిగా హాజరైన ఆటా పూర్వ అధ్యక్షుడు ఆచార్య బి.సాంబిరెడ్డి మాట్లాడుతూ విద్యార్ధుల ఆలోచనలో మార్పు వచ్చినప్పుడే రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకెళుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆ ఓటు రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చేలా వుండాలని సూచించారు.

రాజకీయ మార్పుతోనే నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై విద్యార్ధులు సరియైన అవగాహనను పెంపొందించుకోవాలన్నారు. రాజనీతి శాస్త్ర ఆచార్యులు కె.రవి మాట్లాడుతూ రాజ్యాంగంతోనే వ్యవస్థలన్నీ ముడిపడి వున్నాయని, రాజ్యాంగాన్ని గౌరవించి చట్టాలను సక్రమంగా అమలుచేసి, ఉచిత విద్య, వైద్యం అందించే వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి పరిశ్రమల రాక ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న విషయాన్ని గ్రహించాలన్నారు. హోదా-సంజీవనా ప్యాకేజీ చాలన్న 40ఏళ్ళ అనుభవజ్ఞుడు చంద్రబాబు నాలుగన్నరేళ్ళ తరువాత ప్రత్యేక హోదా అడగడం విడ్డూరంగా వుందన్నారు. ప్రత్యేకహోదా కోసం మొదటి నుండి ఒక జగన్‌మోహన్‌రెడ్డే పోరాడుతున్నారన్నారు.

40 ఏళ్ళ అనుభవం కంటే రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్నారు. వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ ఎమ్‌.జేమ్స్‌ స్టీఫెన్‌ మాట్లాడుతూ అక్షరజ్ఞానం ఉన్న వారు ఓటువేయకపోవడం మొదటి తప్పని, ఆ తప్పుని ఏవిద్యార్ధి చేయకూడదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేక యువత కొట్టిమిట్టాడుతున్నారన్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక కాలెండర్‌ ప్రకటిస్తామన్న నాయకులకు యువత, విద్యార్ధులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

మహానేత వై.యస్‌.ఆర్‌. ప్రవేశపెట్టిన ఫీజ్‌ రీఎంబర్స్‌మెంట్‌ పథకం రాష్ట్రంలో సక్రమంగా అమలు కావడం లేదని, వై.యస్‌.హయాంలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఎంతో మంది డాక్టర్‌, ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత విద్యలను కార్పోరేట్‌ కళాశాలలో అభ్యసించారని, నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదని విద్యార్ధి నీలిమ పేర్కొన్నారు. ఓటు ఎవరికి వేయాలి? ఎందుకు వేయాలి? ఎలాంటి వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవాలి? అనే విషయాలపై మరిన్ని సదస్సులు నిర్వహించాల్సి ఉందని, ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి యువతలకు కలిగే ప్రయోజనాలను వివరించి, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై అవగాహన కల్పించడం చాలా అవసరమనీ స్వాతి అభిప్రాయపడ్డారు.

యువతకు రాజకీయ పరిస్థితులపై పెద్దగా అవగాహన వుండదని, ఎవరికి ఓటెయ్యాలో తెలియదని, సినిమా హీరోలకు కాకుండా, రియల్‌ హీరోలను నాయకులని ఎన్నుకోవాలని, రాజ్యాంగాన్ని గౌరవించే, చట్టాలను అమలుచేసే వ్యక్తిని ఉచిత విద్య, వైద్యం, యువతకు ఉపాధి కల్పించే వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకునేలా అవగాహన కల్పించారు అనిల్. ‘‘రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయి. ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదు, రాజ్యాంగం, చట్టాల్ని తుంగలో తొక్కుతున్నారు. నిరుద్యోగం పెద్ద సమస్యగా మారింది. ప్రత్యేక హోదా కలగా మారింది.

వీటన్నింటికి పరిష్కారం యువత చేతిలో వుంది. యువతంగా కలిసి రాష్ట్రంలో మార్పు తీసుకుని రావాలి. ప్రకటనలకు పరిమితం కాకుండా ప్రజాక్షేత్రంలో ఏళ్ళతరబడి ఉన్నవారిని ఎన్నుకోవాలి’’ ప్రవీణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వై.యస్‌.ఆర్‌.విద్యార్ధి విభాగం అరకు పార్లమెంట్‌ అధ్యక్షుడు టి.సురేష్‌, రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌.కళ్యాణ్‌, విద్యార్ధి నాయకులు లీలాకృష్ణ, అధిక సంఖ్యలో విద్యార్ధినీ, విద్యార్ధులు పాల్గొన్నారు.