తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

288
  • పంట నష్టంపై అంచనాల తయారీకి ఆదేశం

  • గణనీయంగా పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, జనవరి 28 (న్యూస్‌టైమ్): వాతావరణంలో నెలకొన్న అనూహ్య మార్పుల నేపథ్యంలో కురుస్తున్న వర్షాలు తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టాన్ని కలిగించాయి. తెలంగాణ వ్యాప్తంగా రెండురోజులుగా కురుస్తున్న వానలు కొన్ని జిల్లాల్లో ఎండుముఖం పట్టిన పంటలకు మేలు చేయగా మరికొన్నిచోట్ల పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల పరిధిలోని వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, మిరప, పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. అకాల వానలకు కల్లాల్లోని కందులు, ధాన్యం, ఎండబెట్టిన మిరప తడవడంతో రైతులు నష్టపోయారు.

మేడిగడ్డ పనులకు ఆటంకం ఏర్పడింది. ఆదివారం ఉదయం 8 నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ అత్యధికంగా సిద్దిపేట జిల్లా నంగునూరులో 10, దుబ్బాక-9, భూపాల్‌పల్లి, మొగుళ్లపల్లి, నర్మెట్ట-8, హుజురాబాద్‌-7, మంథని-6, తిమ్మాపూర్‌, బెజ్జంకి, జనగామ, పరకాల, వెంకటాపూర్‌, గంగాధర, ముస్తాబాద్‌, హుస్నాబాద్‌లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మొత్తంగా సోమవారం ఉదయం 8 నుంచి రాష్ట్రంలోని 365 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని సిద్దిపేటలో గత పదేళ్ల జనవరి నెల అత్యధిక వర్షపాతం 5 సెంటీమీటర్లు కాగా ఇప్పుడు ఆ జిల్లాలోని పలుచోట్ల అంతకన్నా ఎక్కువ స్థాయిలో వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్‌ నగరంలోని రాజేంద్రనగర్‌లో 6.3, చార్మినార్‌ వద్ద 3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు, రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఈ అనూహ్య ప్రభావం ఫలితంగా పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పడిపోయాయి. చలి వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకూ రెండు రోజుల క్రితం ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడిందని, మంగళవారం కూడా అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌‌లోని వాతావరణ పరిశోధన కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి చెప్పారు.

మరోవైపు, అకాల వర్షాల కారణంగా ఉమ్మడి కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మిరప, మొక్కజొన్న, వరి పంటలు వేలాది ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ఆకాల వర్షానికి మంథని నియోజకవర్గంలో మహదేవపూర్‌, కాటారం, మల్హర్‌, పల్మెల మండలాల్లో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం కారణంగా వందలాది ఎకరాల్లో పత్తి పొలాల్లోనే తడిసి ముద్దయింది. మల్హర్‌ మండలం తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, చిన్నతూండ్ల పరిసరాల్లోని ఆరేవాగు, తీగల వాగుల్లో ఆరబోసిన మిర్చి పంట కొట్టుకుపోయింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల, రాజోలి, అలంపూర్‌, ఉండవెల్లి, మానవపాడు మండలాల్లో ఆరబెట్టిన మిర్చి వర్షాలకు తడిసింది.

జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు, వీనపనగండ్ల, పాన్‌గల్‌, చిన్నంబావి మండలాల్లో ఆరబెట్టిన ధాన్యం తడవడంతో అన్నదాతలు నష్టపోయారు. నాగర్‌కర్నూలు జిల్లాలో కోత దశలో ఉన్న వరి పంటకు అకాల వర్షాలు నష్టాన్ని కలిగించాయి. మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో పలుచోట్ల వేరుసెనగ పంటలు దెబ్బతిన్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఒక్కసారిగా నెమ్మదించాయి. ఆది, సోమవారం కురిసిన వర్షంతో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. ఇరువైపులా చేపడుతున్న కరకట్టల పనులు నిలిచిపోయాయి.

వర్షాలు, చలి వాతావరణంతో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం భారీగా పడిపోయింది. ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రాష్ట్ర విద్యుత్తు డిమాండు 6,008 మెగావాట్లుగా ఉంది. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇది 7,958 మెగావాట్లుగా ఉంది. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. దెబ్బతిన్న వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల కొన్నిచోట్ల పంటలకు నష్టం వాటిల్లినా, రెండు నెలలుగా వర్షాలు కురవక వాడిన పైర్లకు ఈ వానలు మేలు చేశాయని, సెనగ, పెసర, మొక్కజొన్న వంటి పైర్లలో నిలిచిన నీటిని రైతులు వెంటనే బయటకు పంపే ఏర్పాట్లు చేసుకుంటే నష్టాన్ని తగ్గించుకోవచ్చని రాష్ట్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అదనపు సంచాలకుడు విజయకుమార్‌ అభిప్రాయాపడ్డారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందుకున్న అధికారులు తమ పని శరవేగంగా మొదలుపెట్టారు. జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి సంబంధిత నష్టం వివరాలపై సమగ్ర నివేదిక తయారుచేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.