జగన్‌తో ప్రయాణానికి సిద్ధం: దగ్గుబాటి

575

హైదరాబాద్, జనవరి 27 (న్యూస్‌టైమ్): సీనియర్ రాజకీయవేత్త, నందమూరి తారక రామారావు అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి భర్త అయిన వెంకటేశ్వరరావు ఈ మేరకు ఆదివారం వైఎస్ జగన్‌ను కలిసి తన సన్నద్ధతను వ్యక్తంచేశారు. ‘‘మా కుటుంబం జగన్‌తో ప్రయాణించేందుకు నిర్ణయం తీసుకుంది’’ అన్న దగ్గుబాటి తనతో పాటు భార్య పురందేశ్వరి బీజేపీని వీడి వైకాపాలోకి వస్తారోలేదో మాత్రం చెప్పలేదు. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యామంటున్న ఆయన ఆ దిశగా చర్చించేందుకే జగన్‌ను కలిసేందుకు వచ్చామన్నారు.

పార్టీ కార్యాలయం వద్ద కలిసిన మీడియాతో ఆయన చర్చించారు. టికెట్ల విషయంలో పార్టీ నిర్ణయం ప్రకారమే తాము నడుచుకుంటామని, పురందేశ్వరి బీజేపీలో ఉన్నమాట వాస్తవమేనని, ఇలాంటి పరిణామాలు వచ్చినప్పుడు పురందేశ్వరి పార్టీ మారటం జరగదని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు ఆమె సిద్ధమని తెలిపారు. ‘‘జగన్ ప్రవర్తన అలా ఉంటుంది. ఇలా ఉంటుందనే అభిప్రాయం ఈ రెండేళ్లలో నాకు ఎక్కడా కనిపించలేదు. జగన్ శ్రమకు తగ్గ ఫలితం దక్కితే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది’’ అని అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ పాలన గాడి తప్పిందని, ప్రభుత్వ డబ్బుతో దీక్షలు చేయడం 40 ఏళ్ల రాజకీయంలో తను ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. జిల్లాల్లో సమావేశాలు పెడితే జనాల్ని బస్సుల్లో తరలిస్తున్నారని, ప్రతి మీటింగ్‌కు వారం రోజులపాటు కలెక్టర్లు, అధికారులతో పనిచేయిస్తున్నారని విమర్శించారు. ఇంతవరకు నాలుగో విడత, ఐదో విడత రుణాలు రైతులకు ఇవ్వలేదని, మళ్లీ పొస్టు డేటెడ్ చెక్కులు ఇస్తామని హామీలు ఇస్తున్నారని, ఎన్నికల ముందు ఇన్ని వేల కోట్లతో కార్యక్రమాలు చేయడం సరైనది కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.