మందుబాబుల ‘గణతంత్రం’

396
  • ఆంక్షల నీడన తాగుబోతుల చిందులు!

  • ఏటీఎం కేంద్రాలుగా మారిన బెల్త్ దుకాణాలు

  • ముందురోజు రాత్రే అజ్ఞాతానికి తరలిన నిల్వలు

  • తెల్లవారుజాము నుంచే దొడ్డిదారి విక్రయాలు షురూ

  • ఎంఆర్పీపై రూ. 30 నుంచి రూ. 50 అదనంగా వసూలు

  • చూసీచూడనట్లు వ్యవహరించిందన్న అపవాదులో ‘అబ్కారీ’

హైదరాబాద్, జనవరి 27 (న్యూస్‌టైమ్): చరిత్రలో 1950 జనవరి 26వ తేదీని భారతీయులందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. దాదాపు 200 సంవత్సరాలపాటు బ్రిటీష్‌వారి పరిపాలనలో మగ్గిన భారతావనికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, అప్పటివరకూ మనదేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం మాత్రమే జరిగేది. ఆంగ్లేయులను భారత్ నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది.

అలా, 1950 జనవరి 26న రాజ్యాంగానికి రూపకల్పన జరిగింది. డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ తొలి రాష్ట్రపతిగా, భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. ఆంగ్లేయుల నుంచి భారతావణికి పూర్తిస్థాయిలో విముక్తి కలిగిన రోజును ‘గణతంత్ర దినం’ (రిపబ్లిక్ డే)గా చెప్పుకొంటూ ఆంగ్లేయులు మనకు వీడి వెళ్లిన మద్య విలాసాన్ని మాత్రం మన పాలకులు వదలలేకపోయారు. పైగా ఆ మహమ్మారిని పేద, సామాన్య, ధనిక, ఆడ, మగా అనే తారతమ్యం లేకుండా అన్నివర్గాలకూ కానుకగా కూడా పంచిపెట్టి చివరికి అక్రమ మార్గాల్లో కూడా అమ్మకాలకు పరోక్షంగా తెరలేపి ధనార్జనకు పాల్పడుతున్నారు. రాజ్యాంగ ప్రవేశికను మనం ఎలా అభివర్ణించినా వచ్చిన నష్టంలేకపోయినా కనీసం ఆ ప్రతినకు అర్ధంకూడా మరచిపోరాదన్నది స్వాతంత్ర్య సమరయోధుల ఉవాచ.

భారత రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశికలో గొప్ప భావజాలాన్నే ప్రయోగించినప్పటికీ వారి అడుగుజాడల్లో నడిచే నాయకమ్మన్యులు నానాటికీ అంతరిస్తూ వస్తున్నారు. ‘‘కనీసం భానువారమైననూ మధు, మాంస, మద్యాలకు దూరంగా ఉంటే, సాక్షాత్తు సూర్యభగవానుని ముక్తి లభిస్తుంది’’ అని ‘ఆదిత్య హృదయం’లో చెబితే మనం మాత్రం కేవలం ఆరోజే అధిక మొత్తంలో ఆ ముటింట ఒక దానికి కాకపోయినా మిగిలిన రెండింటికీ ఖర్చుచేయడం కాదనలేని వాస్తవం. బహుశా, ఈ నేపథ్యంలోనే అనుకుందాం! గణతంత్ర దినోత్సవం నాడూ దొడ్డిదారిన విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరగడం ఒకఎత్తయితే, సాధారణంగా అమ్మకాలు జరిగిన రోజు కంటే కూడా డ్రైడే రోజే అధిక మొత్తంలో అమ్మకాలు జరిగిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. అమ్మకాల నిషేధానికి ముందు రోజు దాదాపు అన్ని లైసెన్స్‌డ్ షాపులలో అమ్మకాలు గణనీయంగా పెరిగిన తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొనవచ్చు.

కేస్‌లకు కేస్‌లు సేల్ రికార్డుల్లో నమోదైన వైనానికి ఎక్సైజ్ సర్వర్లు కూడా నోరెళ్లబెట్టే పరిస్థితి. ఇక విషయానికి వస్తే, దొడ్డిదారిన అమ్మకాలు విచ్చలవిడిగా జరిగినా అబ్కారీ దాడుల్లో వెలుగుచూసింది మాత్రం నామమాత్రమే. ఆంక్షల నీడన తాగుబోతులు చిందులు వేయడం అటు పోలీసులకు గాని, ఇటు అబ్కారీ అధికారులకు గానీ కానరాకపోవడం గమనార్హం. సాధారణ రోజుల్లో బెల్ట్ దుకాణాలపై నిఘా పెట్టే సిబ్బంది, అధికారులు అమ్మకాలు అసలు నిషేధించిన రోజు ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రశ్నార్ధకం. ఎనీటైం, ఎక్కడైనా, ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది… పగలు, రాత్రి, జాతీయ సెలవులు లాంటివేవీ ఈ అమ్మకాలకు వర్తించవవు అన్నది మరోమారు గణతంత్ర దినోత్సవాన రుజువైంది.

అయితే, కొంచెం ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వచ్చిందంతే. అదేందంటే మందుబాబుల ఒల్లు, ఇల్లు, జేబు గుల్ల చేస్తోన్న మద్యం అక్రమ అమ్మకాల ఫలితం. జిల్లాల్లో మద్యం విక్రయాల్లో నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఎమ్మార్పీ, లూజు విక్రయాలు, బెల్ట్‌ దుకాణాల నిర్వహణ తదితరాలతో మద్యం దుకాణదారులు కాసులు పిండుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నా చూసీచూడనట్లు ఉండేందుకు అధికారులు కాసులు దండుకుంటున్నారు. క్వార్టర్‌ మద్యం కొనుగోలు చేస్తే ఎంఆర్‌పీ కంటే అదనంగా పగలేమో రూ.10, రాత్రిళ్ళు, ఉదయం దుకాణం తెరిచే వరకూ రూ.30 ఇవ్వాల్సిందే. గతంలో కంటే కాస్త తగ్గినా అధికారిక మద్యం షాపులకు పోటీగా, కొన్ని చోట్ల అంతకు మించి బెల్ట్‌ షాపులున్నాయి. కొన్ని మద్యం దుకాణాల పరిధిలో అయితే 20 నుంచి 30 వరకు బెల్ట్‌ షాపులు ఉండడం గమనార్హం. లూజు మద్యం విక్రయాల్లో కల్తీ జరుగుతుందనే ఆరోపణలున్నాయి.

ఈ కారణంగా మద్యంలో నాణ్యత కూడా లోపిస్తుంది. దీంతో మందుబాబులకు అనారోగ్యం, మద్యం విక్రయదారులకు కాసులు వస్తోన్నాయి. ఎక్కడైనా మంచినీళ్లు దొరకడంలేదమో కాని మద్యం మాత్రం అన్ని వేళలా అందుబాటులో ఉంటోంది. మద్యం దుకాణాల నిర్వహణ, అమ్మకాలపై నియంత్రణ కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎక్సైజ్ అధికారి నిజాయితీపరునిగా గుర్తింపు పొందినప్పటికీ ఆయనకు కూడా తెలియని జిమ్మిక్కులు, రహస్య అమ్మకాలతో ‘బెల్ట్’ నిర్వాహకులు ధనార్జనకు పాల్పడుతున్నారు. మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ఇష్టారాజ్యంగా మద్యం వ్యాపారులు దుకాణాలను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకున్న వారు లేకపోవడం గమనార్హం. మద్యం వ్యాపారులపై నియంత్రణ చేయాల్సిన శాఖల అధికారులు యథేచ్ఛగా మామూళ్లు పుచ్చుకుంటూ నిబంధనలను గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు.

ఒకరిద్దరు అధికారులు ఉత్తములైనంత మాత్రాన మిగిలిన వాళ్లు అక్రమార్కులైతే మాట అందరూ కాయాల్సి వస్తుంది. మద్యం షాపునకు ఉన్న డిమాండ్‌, ప్రాంతాన్ని బట్టి కనీసం రూ.10 వేల నుంచి రూ.22వేల వరకు ఒక శాఖకు, మరో శాఖకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు మామూళ్లను చెల్లిస్తున్నారు. పర్మిట్‌ ఉన్న రూమ్‌లకు ఒక విధంగా, పర్మిట్‌ లేని రూమ్‌లకు మరో విధంగా లంచాలను పుచ్చుకుంటున్నారు. అందుకు ప్రతిఫలంగా నిబంధనలకు తూట్లు పొడుస్తూ మద్యం వ్యాపారులు మద్యం విక్రయాలు చేపడుతున్నారు. ప్రభుత్వం ఒక పక్కన బెల్ట్‌ షాపులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా, ఈ ఉత్తర్వులు ఎక్కడా అమలు కావడం లేదు. 24 గంటలు బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు నిరంతరంగా జరుగుతుండడంతో మందుబాబులు తప్పతాగి చిందులు వేస్తున్నారు.

వైన్‌ షాపుల కౌంటర్ల కంటే బెల్టు షాపుల నిర్వాహకులు మద్యం సేల్స్‌ అధికంగా చేస్తున్నారు. గుంటూరు డివిజన్‌లో అత్యధికంగా బెల్ట్‌ షాపులు ఉన్న మద్యం షాపులుగా ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. గతంలో స్వయాన జిల్లా మంత్రే బెల్ట్‌ షాపులను నిషేధించాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులను ఆదేశించినప్పటికీ వాటిని పట్టించుకునేవారేలేరు. మరీ విడ్డూరం ఏమిటంటే, పలు వైన్‌ షాపుల్లో మద్యం లూజు విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వైన్‌ షాపుల్లో 18 సంవత్సరాలు వయస్సు నిండని యువకులు మద్యం విక్రయించరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ ఇందుకు భిన్నంగా జరుగుతున్నాయి.

లూజు మద్యం విక్రయాల్లో నాణ్యత కూడా లోపిస్తుందని మందుబాబుల ఆరోపిస్తున్నారు. వైన్‌షాపుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఇష్టానుసారంగా అమ్మకాలు చేస్తున్నారు. ఈ విషయంలో అటు ఎక్సైజ్‌ అధికారులు, ఇటు పోలీసులూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారనడంలో సందేహంలేదు. అధికారులు, మద్యం షాపుల నిర్వహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం ప్రభుత్వానికి అపవాదు తెచ్చినట్లవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ఏ ఒక్క నిబంధన అమలుకు నోచుకోవటం లేదన్న ప్రచారం విపక్ష రాజకీయ పార్టీలు, మహిళా, ప్రజా సంఘాల నుంచి వినవస్తోంది. పారిశ్రామిక ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల్లో తెల్లవారుజామున టీ షాపుల కంటే ముందే మద్యం బెల్ట్ దుకాణాలు తెరుచుకుంటున్నాయి.

బడ్డీ బంకులు, ఇళ్లల్లో రహస్యంగా మద్యాన్ని దాచి మందుబాబులకు విక్రయిస్తున్నారు. అడపాదడపా దాడులు జరుపుతూ నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు సంబంధిత మద్యం ఎక్కడి నుంచి తెచ్చారు? ఆ లైసెన్స్‌దారుడు ఎవరు? అన్నదానిపై దృష్టిసారించకపోవడం దారుణం. బెల్ట్ షాపులను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు కచ్చితమైన నిబంధనలతో కూడిన ఆదేశాలను వెలువరించింది. అక్రమంగా మద్యం అమ్మిన వారే కాకుండా, వారికి మద్యాన్ని సరఫరా చేసినా వారూ శిక్ష అనుభవించాలన్న రీతిన ఉత్తర్వులు వెలువడినా అలా ఇప్పటి వరకూ ఎన్ని దుకాణాలపై చర్యలు తీసుకున్నారో ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నామనే అబ్కారీ అధికారులే తెలియాలి. పలు కాలనీల్లో కొందరు వ్యక్తులు ఇళ్లల్లోనే మద్యం దాచి విక్రయిస్తున్నారు.

లైసెన్సు పొందిన మద్యం షాపు నిర్వాహకులే అన్ని ప్రాంతాల్లో బెల్టుషాపుల నిర్వాహకులకు స్టిక్కర్లు తొలగించిన బాటిళ్లను సరఫరా చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, విశాఖ జిల్లాలో అశాంతికి మూలం మద్యం. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో ప్రజలు బానిసలుగా మారుతున్నారు. సగటున ఓ మద్యం దుకాణానికి పది బెల్టు షాపులు ఉన్నట్టు తెలుస్తోంది. ఓ మద్యం దుకాణంలో రోజుకు 70 వేల నుంచి లక్షా ఇరవై, ముప్పై వేల వరకు అమ్మకాలు జరిగితే బెల్ట్‌ షాపులోనూ దాదాపు అంతకు పావు నుంచి సగం వాటా జరుగుతోంది. ఈ దశలో మద్యంలో కల్తీ, తక్కవ రకం కలిపి అమ్మడం లాంటి వ్యహారాలే కాక అందులో ఎమ్మార్పీకి మించి మరీ విక్రయించడం మరో ప్రత్యేకత. ఇలాంటి దశలో ప్రశ్నించే వర్గాలపై దాడుల కోసం ఓ మాఫియా అన్ని ప్రాంతాల్లో పనిచేస్తోందట. ఒక వైపు ఎక్సైజ్, సాధారణ పోలీసులను మామూలు మత్తులో ఉంచడమే కాక ప్రశ్నించే వ్యక్తులపై దాడుల కోసం రౌడీ మూకలను పోషిస్తునట్టు బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి దుకాణంలో కంప్యూటర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

అమ్మకాలను కంప్యూటరీకరణ చేయాలి. మద్యం బాటిళ్లపై ఉండే హోలోగ్రామ్స్‌ స్కాన్ చేసి బ్యాచ్ నెంబర్‌ సహా బిల్లు ఇవ్వాలి. అయితే, ఇది ఎక్కడా అమలు కావడం లేదు. మద్యం అమ్మకాలపై నాన్‌ డ్యూటీ, పెయిడ్‌ మద్యం అమ్మకాలపై ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం దాడులు చేస్తుంది. నిరంతరం పరిశీలన నిఘా పెంచాలి. మద్యం వ్యాపారులు సిండికేట్‌ అయి అదనంగా వసూలు చేస్తే చర్యలు తీసుకునే అధికారం ఎక్సైజ్ అధికారులకు ఉంది. ఏదో గణతంత్ర దినోత్సవం రోజున మద్యం అమ్మకాలు జరిగాయన్నది కాకుండా నిత్యం జరిగే ఈ దందాపై ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ‘ఏ విధంగా అమ్మితే మాకేంటీ? సేల్ పెరిగితే చాలు’ అనుకునే రీతిలో కాకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తే బెల్ట్ దుకాణాల నియంత్రణ, అక్రమ అమ్మకాలకు అడ్డుకట్ట చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నది సత్యం.