అసలు గణతంత్ర దినోత్సవం అంటే?

267

భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950వ సంవత్సరం భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాలపాటు బ్రిటీష్‌వారి పరిపాలనలో మగ్గిన మన దేశానికి మన దేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం వచ్చింది. అప్పటివరకూ మనదేశ పరిపాలనా విధానం పూర్తిగా బ్రిటీష్‌ రాజ్యాంగం ప్రకారం జరిగేది. వారిని మనదేశం నుంచి వెళ్లగొట్టిన తరువాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చింది.

అలా 1950, జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి, డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ మొట్టమొదటి రాష్ట్రపతిగా, భారతదేశం పూర్తి గణతంత్ర దేశం అయ్యింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. కాగా, స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు ఎంతోమంది మేధావులు, ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. ఎన్నో రకాల అంశాలతో చాలాకాలంపాటు రాజ్యాంగ ఏర్పాటుకు కృషిచేసి రూపొందించారు. రాజ్యాంగాన్ని తయారు చేసేందుకు డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు.

1947 ఆగస్టు 29న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటయ్యింది. అనేక సవరణల అనంతరం 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలంలో పూర్తి చేసిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాహసబాలల అవార్డుల గురించే. సాహస బాలలు స్ఫుర్తి ప్రధాతలు. సాహసం, తెగువ, సమయస్ఫూర్తి, అన్నింటినీ మించి ఆపదలో ఉన్నవారిని కాపాడాలనే మానవతా ఇన్ని సుగుణాలు కలిగిన 21 మంది సాహసబాలలు 2009 సంవత్సరానికి.

ఇలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలుజరిపారు. ఆనాటి నుంచి భారతదేశము ”సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర” రాజ్యంగా అవతరించబడింది. అప్పటినుంచి ఈరోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మనదేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ముందుగా రాష్ట్రపతి దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకుల గురించి ప్రసంగిస్తారు. ఆ తరువాత వివిధ రంగాలలో నిష్ణాతులైన విద్యార్థులకు పతకాలను అందజేస్తారు. అదే విధంగా ఈ రోజును పురస్కరించుకుని దేశ రాజధానిలోనూ, రాష్ట్ర రాజధానుల్లోనూ గొప్ప గొప్ప పెరేడ్‌లను నిర్వహిస్తారు.

అనేక పాఠశాలల నుంచి వేలాదిమంది విద్యార్థులు ఈ పెరేడ్‌లలో పాల్గొంటారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోనే కాకుండా.. ఆయా రాష్ట్ర రాజధానుల్లోనూ, ప్రతి ఒక్క ఊరిలోనూ, ప్రతి ఒక్క పాఠశాలలోనూ జనవరి 26ను పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తారు. ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్య్రానికి కృషి చేసిన అమరవీరుల త్యాగఫలాలను కొనియాడుతూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తారు. ఈ రిపబ్లిక్‌ దినోత్సవం చాలా ఆనందంగా దేశమంతటా జరుపుకుంటారు. ముఖ్యంగా మన రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి.

ముందుగా రాష్ట్రపతి దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుల గురించి ప్రసంగిస్తారు. తరువాత వివిధ రంగాలలో నిష్ణాతులైన విద్యార్ధులకు పతకాలు అందజేస్తారు. ఈ రోజును పురస్కరించుకొని రాజధానిలో గొప్ప గొప్ప పెరడ్‌లు జరుగుతుంటాయి. ఎన్నో పాఠశాలల నుండి ఎన్‌.సి.సి. విద్యార్థులు కూడా ఈ పెరెడ్‌లో పాల్గొంటూ ఉంటారు. దేశరాజధానిలోనే కాదు, రాష్ట్ర రాజధానిలో, ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఈ రోజును పురస్కరించుకొని ఝండా ఎగురవేసి ప్రజలు తమ దేశం మీద ఉన్న గౌరవాన్ని చాటుతారు. ఈ సంధర్భంగా మన దేశానికి తమ జీవితాన్ని అర్పణ చేసిన ఎందరో వీరుల త్యాగ ఫలాన్ని స్మరించుకుందాం. మొత్తానికి రిపబ్లిక్‌ డే వచ్చేసింది.

గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక నార్మల్‌ హాలిడే. సరదాగా ఇంటిపట్టున గడుపుతూనో లేక ఏ సినిమాతోనో, షాపింగ్‌ మాల్‌ లోనో కాలం వెల్లిబుచ్చేస్తారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన త్యాగధనులని ఈ రోజు ఎంత మంది ఎంతసేపు స్మరిస్తున్నారు, జాతీయ సెలవు దినాలలోనైనా ఎంత మంది వారి ఆదర్శాలను వల్లించుకుంటున్నారు, దేశ స్వాతంత్య్రం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది, అన్న విషయాల మీద ఎవరైనా సర్వే నిర్వహిస్తే ఎంత బావుణ్ణు.

దేశం సిగ్గుపడే విషయాలు బయటికి వస్తాయి. అసలు రిపబ్లిక్‌డేని ఈ రోజే ఎందుకు జరుపుకోవాలి? చాలా మందికి ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలియదు. 1950 జనవరి 26వ తేదినుంచి మనదేశ రాజ్యాంగం అమల్లోకికి వచ్చింది కాబట్టి ప్రతి ఏటా అదే తేదిన మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అనుకుంటారు కొంతమంది. ఇందులో కాస్త నిజం లేకపోలేదు. అయితే అసలు కారణం వేరే ఉంది. భారత రాజ్యాంగానికి నవంబరు 26 1949లోనే ఆమోదం లభించింది.

అమలు పరచే తారీఖుకి ఒక ప్రాముఖ్యత ఉండాలని రెండు నెలలు ఆగారు. ఏమిటా తారీఖు? ఏమిటా ప్రాధాన్యత? 1930 జనవరి 26వ తేదీన లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ జాతీయ సమావేశంలో మొదటిసారిగా దేశానికి పూర్ణ స్వరాజ్యం కావాలని ప్రకటించారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్య్రం లభిస్తే చాలు, సర్వోత్కృష్టమైన సంపూర్ణ అధికారం భ్రిటిషు వారి చెప్పు చేతుల్లోనే వుంచి సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకొనే వాళ్ళు మన రాజకీయ నాయకులు (!!) . జలియన్‌వాలాబాగ్‌ ఉదంతం జాతిని ఉలిక్కిపడేలా చేసింది.

సుభాష్‌ చంద్రబోస్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి నేతలు కాంగ్రెస్‌ పార్టీలో కాకపుట్టించి పూర్ణ స్వరాజ్యమే లక్ష్యంగా ప్రకటన ఇప్పించగలిగారు. ఆ రోజునే స్వాతంత్య్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి జనవరి 26 1950 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. అటువంటి రిపబ్లిక్‌డే ప్రైవేటు పాఠశాలలకు నేడొక ఆటవిడుపులా మారింది. గవర్నమెంటు హాలిడే కాబట్టి పిల్లలు స్కూళ్ళకు రానవసరం లేదని ముందు జాగ్రత్తగా హోం డైరీల్లో హెచ్చరించే పాఠశాలలు కొన్నైతే, ఏ శనివారమో ఆదివారమో రిపబ్లిక్‌డే వస్తే ఎక్కడ ఆ రోజు మళ్ళీ పనిచేయాల్సి వస్తుందోనని ముందు రోజే తూతూ మంత్రంగా జెండావందనం జరిపించేసి మమ అనుకునే స్కూలు యాజమాన్యాలు ఇంకొన్ని.

ప్రేమికులరోజుకి రకరకాల భాష్యాలు చెప్పి పిల్లల చేత ఠంచనుగా సెలబ్రేట్‌ చేయించి స్వాతంత్య్ర దినోత్సవాన్ని మాత్రం ఆగస్టు పన్నెండవ తేదీనే జరుపుకున్న మిషనరీ స్కూలు, గురూజీ పూజ, సత్సంగం లాంటి కార్యక్రమాలను సెలవు రోజుల్లో అట్టహాసంగా నిర్వహించి రిపబ్లిక్‌డేని విస్మరించే పాఠశాలలు అనేకం మనకు సమీపంలోనే ఉన్నాయి. భావిభారత పౌరుల్ని తయారుచెయ్యాల్సిన పాఠశాలలు ఇంత బాధ్యతారాహిత్యంతో ప్రవర్తించబట్టే బాలబాలికల్లో దేశభక్తి నానాటికి తీసికట్టు నాగంబొట్లు చందంగా తయారవుతోంది. సెలవు దినాల్లో పిల్లలు బడికి వెళ్ళకపోతేనేం అనుకునే తల్లిదండ్రులూ ఉన్నారు.

గాంధీ నెహ్రూలు తప్ప మరో స్వాతంత్య్ర సమరయోధుడు తెలియని పిల్లలున్నారంటే అది వీళ్ళ చలవే. సమస్యకు మరో పార్శ్వం వీళ్ళు. మన చిన్నతనంలో స్కూళ్ళో జరుపుకున్న జాతీయపండుగలు మనకింకా గుర్తున్నాయి. పాఠశాలంతా అలంకరించిన మూడు రంగుల పేపర్‌ తోరణాలు, విశాలమైన ఆవరణలో ఆవిష్కరింపబడి వినువీధులలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం, తెల్లటి చొక్కాకి ఎడమవైపు పిన్నీసుతో గుచ్చబడి, పడిపోయిందో లేదోనని నేను అప్పుడప్పుడూ తడుముకొని గర్వంగా చూసుకున్న చిట్టి జెండా, భారతదేశము నా మాతృభూమి అని అందరితో కలిసి చేసిన ప్రతిజ్ఞ, ఒళ్ళు ఉప్పోంగేలా పాడిన వందేమాతరం, మైకు చేతబట్టుకొని వచ్చీ రానీ భాషా జ్ఞానంతో ‘తేనెల తేటల మాటలతో మనదేశ మాతనే కొలిచెదమా’, ‘శ్రీలు పొంగిన జీవ గడ్డై, పాలు వారిన భాగ్యసీమై’ లాంటి పాటలు శ్రావ్యంగా పాడిన మిత్రబృందం, వాడిపోయిన మొహాలు చూసి కూడా ఉపన్యాసాలు విరమించని ముఖ్యఅతిథులు, చివర్లో చాక్‌లెట్ల కోసం సంబరంగా ఎగబడ్డ సన్నివేశాలు.. అన్నీ గుర్తున్నాయి.

ఇప్పుడేవీ ఆ ప్రతిజ్ఞలు? ఏదీ ఆ జాతీయగీతాలాపన? ఏదీ ఆ ఆనందం? దేశంలో చాలా సమస్యలకు దేశభక్తి లేకపోవటం కూడా ఒక కారణం. భారతదేశ ప్రతిజ్ఞ ఎవరు రాశారో తెలియకపోయినా, బూతులతో నిండిన తెలుగు సినిమా డైలాగులు, వాటి కలెక్షన్లు కంఠతా పట్టేసి, నటీనటులను గుడ్డిగా అరాధించే యువతరం తయారైతే అంతకంటే దరిద్రం ఈ దేశానికి మరొకటి లేదు.

తల్లిదండ్రులు కనీసం జాతీయ పర్వదినాలోనైనా ప్రముఖుల ఆదర్శజీవితాల్లోంచి ముఖ్యమైన ఘట్టాలని, వారి పోరాట స్ఫూర్తిని, నిజాయితీని కళ్ళకు కట్టేలా పిల్లలకు విడమరిచి చెప్పి దేశభక్తిని పెంపొందింపజెయ్యాలి .ప్రైవేటు స్కూళ్ళు ఇప్పటికైనా తమ బాధ్యత గుర్తించి గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం లాంటి పండుగలను విధిగా నిర్వహించాలి. ప్రభుత్వం కళ్ళుతెరిచి జాతీయ పర్వదినాలను సెలబ్రేట్‌ చేసుకోని పాఠశాలల గుర్తింపు రద్దు చెయ్యాలి.