ప్రగతి పథంలో తెలంగాణ: గవర్నర్ నరసింహన్

177

హైదరాబాద్, జనవరి 26 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలోనే ప్రగతి పట్టాలు ఎక్కిందని, బంగారు తెలంగాణ స్వప్న సాకాలం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించిన 70వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిధిగా ప్రసంగించారు. తొలుత రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన గవర్నర్ తర్వాత తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

దేశం మొత్తం 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకొంటోదని, రాజ్యాంగ నిర్మాతలను, మహానీయులను స్మరించుకోవడం భారతీయులుగా మన విధన్నారు. మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని, దాని ఫలితమే గణతంత్ర వేడుకలనీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందని కొనియాడారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని, 40 వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఆసరా పెన్షన్లను ప్రభుత్వం పెంచబోతోందని, నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసే ఆశయంతో ముందుకు సాగుతోందనీ వివరించారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులను కేంద్రం ద్వారా మంజూరు చేయించుకుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుందని, పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలన్నీంటిని పరిష్కరించి సాగునీటి ప్రాజెక్టు పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. మరోవైపు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందుతుందని, ఈ ఏడాది మార్చి నాటికి అన్ని ఆవాసాలకు మంచినీటి సరఫరా జరగనుందన్నారు.

24 గంటల నిరంతర కరెంట్ సరఫరా వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని, వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గవర్నర్ తెలిపారు. రైతుబంధు పథకాన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, రైతుబంధు, రైతుబీమా పథకాల వల్ల రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు.

ధరణి వెబ్‌సైట్ త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. భూరికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం చేసిన కృషితో దాదాపు 94 శాతం భూములకు పాస్‌బుక్కులు అందించారని, కులవృత్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, చేనేత, పవర్‌లూం కార్మికుల స్థితిగతులు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. పవర్ పాంట్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని నరసింహన్ చెప్పారు.

కరెంట్ కోతల నుంచి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ దిశగా తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుందన్నారు. కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. కేజీ టు పీజీలో భాగంగా 524 గురుకులాలు ఏర్పాటు చేశారని, పరిపాలనా సౌలభ్యం కోసం 31 జిల్లాలకు తోడుగా మరో రెండు కొత్త జిల్లాలు నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారనవ, టీఎస్ ఐపాస్ సింగిల్ విండో విధానం ద్వారా రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తరలివచ్చి పెట్టుబడులు పెట్టాయన్నారు.

లక్షా ముప్పై రెండు వేల కోట్ల రూపాయాల పెట్టుబడులు రాష్ట్రానికి తరలివచ్చాయన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ బలీయమైన శక్తిగా ఎదిగిందని, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని వివరించారు. ప్రజలకిచ్చిన హామీలన్నింటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. అంతకముందు గవర్నర్ నరసింహన్ 70వ గణతంత్ర దినోత్సవాన్సి పురస్కరించుకుని సికింద్రాబాద్ ప‌రేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ పతాకావిష్కరణ చేశారు.

ఈ వేడుకలలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.