తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు

186

హైదరాబాద్, జనవరి 26 (న్యూస్‌టైమ్): భారత 70వ గణతంత్ర దినోత్సవాన్ని శనివారం తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర అసెంబ్లీ వద్ద వేడుకలు వైభవంగా జరిగాయి. ముందుగా మండలి వద్ద శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మండలి భవనంపై సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు స్వామిగౌడ్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు.

మరోవైపు, అన్ని ప్రధాన రాజకీయ పార్టీ కార్యాలయాల్లోనూ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అధికార పార్టీ తెరాస ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో కేటీఆర్‌ తొలిసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో కూడా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.

గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్‌ సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ తదితరులు హాజరయ్యారు. అంతకుముందు సైనిక స్మారక స్థూపం వద్ద అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంజలి ఘటించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో భారత 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ సీహెచ్ రామోజీరావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జెండా వందనం చేశారు. ఈ వేడుకల్లో ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

కాగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ఏర్పాటు చేసిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి పితాని సత్యనారాయణ, రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి. సుబ్బరామిరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కె. రోశయ్య, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహా పలు రాజకీయ పార్టీ నేతలు తదితరులు హాజరయ్యారు.