విజయవాడలో ఆకట్టుకున్న గణతంత్ర వేడుకలు

228
  • నాలుగున్నరేళ్లలో ఏపీలో గణనీయమైన అభివృద్ధి

  • పోలవరం పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరు: గవర్నర్

  • సులభతర వాణిజ్యంలో రాష్ట్రానిది అగ్రస్థానమని వెల్లడి

హైదరాబాద్, జనవరి 26 (న్యూస్‌టైమ్): భారత 70వ గణతంత్ర దినోత్సవం శనివారం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. విజయవాడలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్యఅతిధిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సైనిక దళాలు, పోలీసులు, విద్యార్ధుల నుంచి గౌవర వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన నాలుగున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో గణనీయమైన ప్రగతి సాధించిందని, సులభతర వాణిజ్యంలో రాష్ట్రానిది అగ్రస్థానమనీ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తిచేసి గ్రావిటీ ద్వారా వ్యవసాయ రంగానికి సాగునీరు అందిస్తామని ప్రకటించారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని గవర్నర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన కష్టాలను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని వివరించారు. సాంకేతికతను జోడించి ఉత్పాదకతను పెంచుతోందని పేర్కొన్నారు. సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందన్నారు. ఏపీలో పెట్టుబడులపై అనేక కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని, రాష్ట్రంలో మహానగరాలను సుందరనగరాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

ప్రతి గ్రామానికి సీసీ రహదారులు నిర్మించుకున్నామని, విద్యుత్తు కొరత ఉన్న రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా చేశామని, వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు‌ అందిస్తున్నామని చెప్పారు. ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా ప్రతి ఇంటికి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సదుపాయం అందిస్తున్నామని, ఎన్టీఆర్‌ వైద్య సేవ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎల్‌ఈడీ విధి దీపాలు ఏర్పాటు చేశామని, గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి కోసం వాటర్‌ గ్రిడ్‌ పథకం తీసుకొచ్చామన్నారు.

అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రియల్‌టైం గవర్నెన్స్‌ ద్వారా పాలనను సరళతరం చేశామని, నాలుగున్నరేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. రాయలసీమను ఉద్యానహబ్‌గా మారుస్తున్నామని, పోలవరం నిర్మాణాన్ని ప్రభుత్వం నిత్యం సమీక్షిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి యువనేస్తం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామన్నారు.

నిరుద్యోగులకు భృతి ఇస్తున్నామని, క్రీడలను ప్రోత్సహించేలా ఎన్టీఆర్‌ క్రీడా వికాసంను ఏర్పాటు చేశామన్నారు. ఫించన్లను రెండింతలు చేశామని, కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నామని గవర్నర్ తెలిపారు. అవినీతి రహిత సమాజ స్థాపనకు కృషి చేస్తున్నట్లు గవర్నర్‌ వెల్లడించారు. ఇదిలావుండగా గణతంత్ర వేడుకల సందర్భంగా విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రదర్శన, విద్యార్ధుల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో గవర్నర్‌ నరసింహన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.