ఆకట్టుకున్న గణతంత్ర దినోత్సవ ప్రదర్శన

343

న్యూఢిల్లీ, జనవరి 26 (న్యూస్‌టైమ్): భారత 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని హస్తినలో శనివారం నిర్వహించిన వేడుకల్లో భద్రతా దళాల విన్యాసాల దగ్గర నుంచి అభివృద్ధి, ప్రగతి, సంక్షేమం తదితర అంశాలపై ఏర్పాటుచేసిన ప్రదర్శేన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మహిళా దళం కవాతు చరిత్ర సృష్టించింది. పూర్తిగా మహిళలతో కూడిన అస్సాం రైఫిల్స్ దళం రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని కవాతు చేసింది. ఈ మహిళా దళానికి మేజర్ కుష్భూ కన్వార్ (30) నేతృత్వం వహించారు. అసోం నుంచి పూర్తిగా మహిళలతో కూడిన రైఫిల్స్ దళం గణతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొనడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ దళంలోని ఎక్కువ మంది మహిళా జవాన్లు సైన్యంలో ఉండి మరణించిన సైనిక కుటుంబాలకు చెందినవారు కావడం విశేషం.

ఈ సందర్భంగా మేజర్ కుష్భూ కన్వార్ మాట్లాడుతూ మహిళా దళం కవాతుకు నేతృత్వం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, తనకెంతో గర్వంగా ఉందన్నారు. తాను రాజస్థాన్‌కు చెందిన బస్ కండక్టర్ కూతురు అని ఆమె తెలిపారు. సాధన చేస్తే ఏ అమ్మాయి అయినా తన కలను నెరవేర్చుకోవచ్చు అని కుష్భూ పేర్కొన్నారు. మరోవైపు, రాజ్‌పథ్‌ వేదికగా జరిగిన 70వ గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. దేశ చరిత్ర, సాంస్కృతిక వైవిధ్యం, ఆయుధ సంపత్తిని చాటిచెప్పేలా త్రివిధ దళాల కవాతు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా జాతిపిత మహాత్మాగాంధీ జీవిత విశేషాలతో ప్రదర్శించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ ఏడాది గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని గణతంత్ర వేడుకల్లో ఆయన జీవిత విశేషాలతో శకటాలను ప్రదర్శించారు. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలకు చెందిన ఆరు శకటాలతో మహాత్ముడి జీవిత విశేషాలు, ఆదర్శాలను ప్రదర్శించారు. 1929లో మహాత్మాగాంధీ ఉన్న కౌసాని అనాసక్తి ఆశ్రమంతో ఉత్తరాఖండ్‌ శకటాన్ని ప్రదర్శించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ శకటంపై గాంధీజీ కాశీ విద్యాపీఠ్‌లో ఉన్నప్పటి విశేషాలను ప్రతిబింబించారు.

జమ్ముకశ్మీర్‌ శకటంపై గాంధీజీ చరఖా తిప్పుతున్నట్లుగా ఏర్పాటు చేశారు. ఢిల్లీ శకటంపై మహాత్మాగాంధీ బిర్లా హౌస్‌లో ఉన్నప్పటి ఆకృతులను ప్రదర్శించారు. రైల్వేశాఖ ప్రదర్శించిన శకటంపై మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ మహాత్మాగాంధీలా మారిన తీరును ఆవిష్కరించారు. గాంధీజీ అండమాన్‌ జైల్లో ఉన్ననాటి సందర్భాన్ని ప్రతిబింబించేలా అండమాన్ నికోబార్‌ శకటాన్ని ప్రదర్శించారు. గుజరాత్‌, పంజాబ్‌, కర్ణాటక శకటాలపై కూడా గాంధీ జీవిత విశేషాలను ప్రదర్శించారు.