ప్రసిద్ధ కవిగా గుర్తింపుపొందిన హేతువాది కొండవీటి వెంకటకవి

53

కొండవీటి వెంకటకవి… ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత. వీరి అసలు పేరు కొండవీటి వెంకటయ్య. వీరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా విప్పర్ల గ్రామంలో జన్మించారు. వీరు నారాయణ, శేషమ్మ దంపతులకు జనవరి 25, 1918 సంవత్సరంలో జన్మించారు. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసము తండ్రివద్ద జరిగింది. ఆ తరువాత నరికొండ నమ్మాళరాజు వద్ద సంస్కృత కావ్య పఠనము, దువ్వూరి వేంకటరమణశాస్త్రి వద్ద ఉన్నత విద్య గడించాడు.

1936లో కిసాన్‌ కాంగ్రేసుకు సహాయకార్యదర్శిగా పనిచేశాడు. 1946 నుండి 1952 వరకు వెంకటకవి జిల్లా బోర్డు ఉన్నతపాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేశాడు. బాబా లను విమర్శిస్తూ ఉపన్యాసాలిచ్చారు. 1932లో కర్షకులమీద, 1946లో చెన్నకేశవ శతకం రచించారు. తరువాత కాలంలో త్రిశతి పేరుతో బుద్ధుడు, వేమన, గాంధీలను గురించి మూడు శతకాలు రచించారు. 1942లో హితబోధ, 1944లో ఉదయలక్ష్మీ నృసింహ తారావళి రచించారు. 1984 ప్రాంతంలో బ్రహ్మంగారి మఠానికి ఆస్థాన కవిగా ఉన్నారు. మఠాధ్యక్షుల ఆదేశానుసారం శ్రీవీరబ్రహ్మేంద్ర సుప్రభాతం సంస్కృతంలో రచించారు.

నందమూరి తారకరామారావు వీరిని 1977లో పిలిపించి దానవీరశూరకర్ణ చిత్రానికి సంభాషణలు రాయించారు. తరువాత శ్రీమద్విరాటపర్వం, శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రాలకు కూడా సంభాషణలు సమకూర్చారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వీరిని ‘కళా ప్రపూర్ణ’ పురస్కారంతో గౌరవించింది. 1953 జనవరిలో కవిరాజు అనే బిరుదును కూడా పొందాడు. ప్రసిద్ధ కార్టూనిస్టు శ్రీధర్‌ ఈయన గురించి సోక్రటీసులాగా తన ప్రపంచంతప్ప మరోటి తెలియని వారు, అతి సామాన్యుడిగా కనిపించే అసాధారణ తాత్వికుడు, వేదాంతి అన్నారు.

కవులైనవారు మానవులందర్నీ ఏకం చేసేలా, వారిని సంఘటితపరచి వారిలో సౌభ్రాతృత్వం పెరిగేలా చేయాలి. ప్రజల్ని విడదీసేలా రచనలు చేయకూడదు… అంటూ ఆయన విభజనతత్వాన్ని ఆనాడే ఖండించారు. 1944-45లో శరభయ్యగుప్త హైస్కూల్లో తెలుగు పండితునిగా ఉద్యోగం ప్రారంభించారు. 1946 నుంచి 1952 వరకు మాచర్లలో జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా ఉన్నారు.

1952 జులై నుంచి పొన్నూరు శ్రీ భావనారాయణస్వామి సంస్కృత కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. వీరు ఏప్రిల్‌ 7, 1991 సంవత్సరం పరమపదించారు. పెళ్ళికాక పూర్వం అచల మతంలో దిగంబరిగా వూళ్ళు తిరిగాడు. 1945 ప్రాంతాల్లో కమ్యూనిస్టులు ఒక్కొక్క బాబాగురించి వివరాలు తెప్పించి, వాస్తవాలే సన్మాన పత్రంగా సమర్పించారట. ఏ బాబా ఎలాంటి వాడు, ఆయన పూర్వాపరాలు ఏమిటి లాంటివి. వసుచరిత్ర అవలీలగా పాడి వినిపించేవాడు. భట్టుమూర్తి అంటే ఆయనకు విపరీత ప్రేమాభిమానం. వెంకటకవికి ఇంగ్లీషు రాదు. అష్టావధానాలు చేశాడు.

భువన విజయాలలో పాల్గొన్నాడు. లౌకిక వివాహాలు చేయించాడు; అంటే మంత్రాలు లేకుండా, త్రిపురనేని రామస్వామి రాసిన పెళ్ళి సూత్రాలు చదివించి, వివాహాలు జరిపించడం. ఇలా ఆవుల మంజులత గారి పెళ్ళి, హైదరాబాదు ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిపించారు. ఆయన పురోహితుడు. ఇన్నయ్య తోటి పురోహితుడు. కొండవీటి వెంకటకవి హాస్యప్రియుడు. తన షష్ఠి పూర్తి రాబోతున్నదనీ, తానేమంతగా ఆశించడం లేదనీ, ఎందుకైనా మంచిదని ముందుగా చెబుతున్నాననేవాడు. తనకు పెద్దగా కోరికలు లేవనీ, ఏనుగుపై వూరేగించి, కాలుకు గండ పెండేరం (రత్నాలు బంగారం అయితే సరేసరి, లేకుంటే చత్తతోడా (గడ్డితో చేసిన కడియం) అయినా సరే అనేవాడు.