అనంతలో పరిటాల రవికి ఘన నివాళి

74

అనంతపురం, జనవరి 24 (న్యూస్‌టైమ్‌): తెలుగుదేశం పార్టీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్బంగా కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు మంగళవారం ఆయనకు ఘన నివాళులర్పించారు. పరిటాల కుటుంబ సభ్యులు ఆయన ఘాట్‌ వద్ద పుష్పమాలలు ఉంచి నివాళురల్పించారు. రాష్ట్ర మంత్రి పరిటాల సునీత ఆమె కుటుంబ సభ్యులు శ్రీరామ్‌, సిద్ధార్థ, స్నేహలత తదితరులు గురువారం ఉదయం పరిటాల రవి ఘాట్‌కు చేరుకుని పూల మాలలు వేసి అంజలి ఘటించారు. ఆయన సేవల గురించి మంత్రి పరిటాల సునీత స్మరించుకున్నారు.

ప్రజలే తమ కుటుంబానికి కొండంత బలమని, రవి తమకు లక్షలాది అభిమానుల్ని సొంతం చేసి వెళ్లిపోయారని, పేదల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు అందరి మనసులో చిరస్థాయిగా నిలిచాయని సునీత అన్నారు. ఆ స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజలు, అభిమానులకు అండగా ఉంటామని వెల్లడించారు. ఈతరుణంలో మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు.

మంత్రి కాలవ శ్రీనివాసులు, శాసనసభ్యులు పార్థసారథి, ఈరన్న, యామినీబాల, ఉన్నం హనుమంతరాయచౌదరి, జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ చమన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ గౌస్‌మొయిద్దీన్‌, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్‌, ఎల్‌.నారాయణచౌదరి, ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్‌ తదితరులు విచ్చేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి సునీత మాట్లాడుతూ ఎన్ని జన్మలు ఎత్తినా పరిటాల రవి భార్యగానే పుట్టాలని ఉందన్నారు.

మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రవి ఆశయాలను కొనసాగిస్తున్న సునీతకు, వారి కుటుంబానికి తన సహకారం ఎప్పుడు ఉంటుందన్నారు. రవి పేదల కోసం శ్రమించి ఎనలేని ఆదరాభిమానాలు చూరగొన్నారని అన్నారు. చీఫ్‌ విప్‌ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పార్థసారథి, యామినీబాల ప్రసంగిస్తూ పేదల సంక్షేమానికి రవి నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు.

ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్దఎత్తున అభిమానులు తరలిరాగా భారీగా అన్నదానం చేశారు. భోజన ఏర్పాట్లను మంత్రులు సునీత, కామినేని, మృణాళిని పర్యవేక్షించారు. ఈసందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.