రైతులను ముంచేస్తున్న మంచు

63

శ్రీకాకుళం, జనవరి 24 (న్యూస్‌టైమ్‌): అనావృష్టి, అతివృష్టితో ఇబ్బందులు పడుతున్న రైతుకు మరో సమస్య వచ్చి పడింది. సాధారణంగా తుపాన్లు అంటే భయపడే రైతు ఇప్పుడు మంచు అంటేనే భయపడిపోతున్నాడు. మంచు తెరలు కనిపిస్తే చాలు శ్రీకాకుళం రైతులు తేలు కట్టినంతగా వణికిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా మామిడి తోటలున్నాయి.

కవిటి, సోంపేట, కంచిలి, మందస, గార, లావేరు, పొందూరు, పాతపట్నం, మెళియాపుట్టి, ఆమదాలవలస మండలాల్లో ఎక్కువ శాతం రైతులు మామిడి తోటల మీదే ఆధారపడ్డారు. ఈ ఏడాది విపరీతంగా కురుస్తున్న మంచు మామిడి రైతుల పాలిట శాపంగా మారింది. మామిడి పూతపై తేనేమంచు, పురుగులు, బూడిద తెగుళ్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ నష్ట తీవ్రత ఎక్కువ చేస్తున్నాయి.

వాస్తవంగా నవంబర్‌ నెల నుండి జనవరి నెలాఖరు వరకూ మామిడి పూత ఉంటుంది. ఈ దశలో తేనేమంచు ప్రభావం అధికంగా ఉండటంతో పూత నల్లగా మాడి రాలిపోతోంది. మామిడి పిందె దశకు వచ్చేవరకూ నీరుగాని, మంచుగాని చెట్లకు లభించకూడదు. కాని విపరీతంగా కురుస్తున్న మంచుకు తోడు రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం మామిడి పూతపై ప్రభావాన్ని చూపాయి. గత ఏడాది పైలిన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఈ ఏడాది మంచు నిండా ముంచేలా కనిపిస్తోంది.