సెటిలర్స్‌కు ఏం సమాధానం చెబుతారు?

113

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ జట్టు కట్టే ప్రయత్నం ద్వారా సెటిలర్స్ అంశం మరోమారు తెరపైకి వచ్చినట్లయింది. సెటిలర్స్ అందరూ తెలంగాణా వాళ్ళే అన్నారు గతంలో. సెటిలర్స్ కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్నారు. అలాంటి కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 బీసీ కులాలు తెలంగాణలో లేవంటూ వెనుకబడిన తరగతుల (బీసీ) కులాల జాబితా నుంచి తొలగించారు.

ఈ కులాలు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉన్నాయని, తెలంగాణకు చెందిన కులాలు కాదని, అందుకే ఈ కులాలను తెలంగాణలో బీసీలుగా కాకుండా ఓసీలుగా పరిగణిస్తామంటూ మార్చి 11, 2015 తేదీన జీవో జారీచేశారు. దీంతో 2- 3 తరాల నుంచి తెలంగాణలో ఉంటున్న కుటుంబాలకు చెంది, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన లక్షలాది మంది ప్రజలు బీసీ రిజర్వేషన్‌ సదుపాయాన్ని కోల్పోయారు.

ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో బీసీ జాబితాలో మొత్తం 138 కులాల నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 112 కులాలు మాత్రమే ఉన్నాయి. ఒక వైపు ఇక్కడ ఎవ్వరూ సెటిలర్స్‌లేరు, అందరూ తెలంగాణా వాళ్లే అంటారు. మరోవైపు, పొట్టచేత పట్టుకుని వచ్చిన బీసీల బతుకును నాశనం చేసే జీవోను దొడ్డి దారిన తెస్తారు. ఏదైనా కులాన్ని బీసీ జాబితాలో కలపాలన్నా, తొలగించాలన్నా బీసీ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం చేయాలి. కానీ ఇందుకు విరుద్ధంగా ఎటువంటి సిఫార్సు లేకుండా, కేవలం ఆంధ్రా కులాలు అన్న కారణంతో 26 కులాలను కక్షపూరితంగా తొలగించిన కేసీఆర్‌ను జగన్ ఆంధ్రాకి రానిస్తున్నాడా? కేసీఆర్ చర్యవల్ల ఒకే ఇంట్లో 2014 కంటే ముందు చదువు, ఉద్యోగ రిజర్వేషన్‌ పొందిన వారు బీసీలు ఐతే, తదనంతరం అదే కుటుంబ సభ్యులు ఓసీ కేటగిరీలోకి మారిపోయారు.

ఏపీలోను, తెలంగాణలోనూ ఉన్న ఈ 26 బీసీ కులాల వారికి జగన్ ఏ సమాధానం చెప్తారు? ఇలాంటి ద్వంద్వ వైఖరి కలిగిన రాజకీయాలను ప్రోత్సహిస్తున్న తెరాసలాంటి పార్టీలతో కలిసి పనిచేయాలనుకుంటున్న ఏపీకి చెందిన రాజకీయ పార్టీలు తమ రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వనున్నారు? రాజకీయాలలో కలిసి పనిచేయడం తప్పుకాదు. కానీ, కేవలం రాజకీయం కోసమే కలిసి పనిచేయాలనుకోవడం తప్పు. దీని వల్ల ప్రజలకు నష్టం జరగకమానదు.