పవన్ కళ్యాణ్‌తో టీఆర్ఎస్ పొత్తు?

147
File photo
  • పావులు కదుపుతున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్, జనవరి 23 (న్యూస్‌టైమ్): తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన బలం పరిమితం అయినా కూడా వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచి ప్రచారం చేస్తే ఎంతో కొంత ప్రభావం చూపించటం మాత్రం ఖాయం అవునంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఈ విషయం తెలుసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా పవన్‌తో సఖ్యతకే మొగ్గుచూపుతోంది. దీనికి తోడు పవన్‌తో జట్టుకడితే ఓ సినీ గ్లామర్ కూడా ఉన్నట్లు అవుతుందని యోచిస్తున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కెసీఆర్, ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కూడా పవన్ విషయంలో ‘సాఫ్ట్’ ధోరణితోనే ముందుకు సాగుతున్నారు.

గతంలో పవన్‌పై కేసీఆర్, ఆయన కుమార్తె కవిత తీవ్ర వ్యాఖ్యలే చేశారు. వచ్చే ఎన్నికల్లో సీమాంధ్ర ఓట్లు కీలకం అయినందున పవన్‌తో పొత్తు వల్ల ఎంతో కొంత ప్రయోజనం పొందవచ్చని, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా పవన్ వల్ల ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్‌ ఓ పది సీట్ల వరకూ కోరవచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎలాగూ పవన్ ఏపీలోనూ మొత్తం సీట్లలో పోటీచేసే పరిస్థితి కన్పించటం లేదు. పవన్ కోరుతున్న సీట్లలో హైదరాబాద్‌లోని సనత్ నగర్ సీటు ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పోలండ్ రాయభారి ఆడమ్ బురాకోవస్కీతో పాటు ఆ దేశ బృందం భేటీ అయిన సంగతి తెలిసిందే. అసలు ఇఫ్పటివరకూ పెద్దగా ఎలాంటి నిర్ధిష్ట కార్యకలాపాలు ప్రారంభించని జనసేన అధినేతతో పోలండ్ రాయబారి, ఆ దేశ బృందం భేటీ అవ్వటం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయీంశంగా మారింది. ఈ భేటీని ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించిన వారిలో వరంగల్‌కు చెందిన రాజు రవితేజ ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

జనసేన పార్టీలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే జనసేన కోరుతున్నట్లు టీఆర్ఎస్ పది సీట్లు కేటాయిస్తుందా? లేక ఏమైనా కోత పెడుతుందా? అన్న విషయం తేలాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే. టీఆర్ఎస్‌తో జనసేన దగ్గరవుతున్న విషయాన్ని గుర్తించే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఇప్పటికే ఎటాక్ ప్రారంభించాయి.