జమ్మూ, కాశ్మీరుపై మంచు దుప్పటి!

77

జమ్మూ, జనవరి 23 (న్యూస్‌టైమ్‌): జమ్మూ కశ్మీర్‌లో కురుస్తున్న మంచుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజులుగా చలికి వణుకుతూ, తినడానికి తిండిలేక అలమటించి పోతున్నారు. అనేక ప్రాంతాలు మంచుతో నిండిపోయాయి. దీనితో రవాణ వ్యవస్థ స్తంభించిపోయింది. శ్రీనగర్‌ జాతీయ రహదారిపై కిలోవిూటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రెండు రోజులుగా మంచు కురుస్తుండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రాంబన్‌, బనీహాల్‌, పాట్నీ తదితర ప్రాంతాలలో రహదారులపై దాదాపు 300 కిలోవిూటర్ల మేర మంచుకురుస్తున్నందున పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. బారాముల్లా, బనీహాల్‌ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

ఉత్తర భారతదేశాన్ని మంచు గజగజలాడిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ పొగమంచు ముసుగులో దాక్కుంది. హిమాచల్‌ప్రదేశ్‌, శ్రీనగర్‌లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. దీంతో నార్త్‌ ఇండియన్స్‌ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర భారతదేశంపై చలి పంజా విసురుతోంది. ఢిల్లీని దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఫ్లైట్స్‌ ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలికి గజగజలాడుతున్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో రోడ్లు,ఇళ్లపై మంచు పేరుకు పోతోంది. దీంతో షిమ్లాలో పర్యాటకులు స్నో ఫాల్‌లో ఆటలాడుకుంటూ ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌ మంచు దుప్పటి కప్పుకుంది. జాతీయ రహదారిపై దట్టంగా మంచు కురుస్తోంది. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై మంచు తొలగింపుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా ట్రాఫిక్‌ సమస్య మళ్లీ మొదటికే వస్తోంది. ఎటు చూసినా ఉత్తర భారతదేశం మొత్తం మంచు ముసుగులో గజగజలాడుతోంది. ఇంటి నుంచి బైటకు రావాలంటే స్థానికులు వణికి పోతున్నారు. టూరిస్టులు మాత్రం మంచు లోకం అందాలు ఆస్వాదిస్తూ సందడి చేస్తున్నారు.

భారీగా పొగ మంచు కురుస్తుండడంతో జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రమంతా వరుసగా రెండో రోజు జన జీవనం స్తంభించి పోయింది. ఫలితంగా దేశంలోని ఇతర ప్రాంతాలతో కాశ్మీర్‌ లోయకు సంబంధాలు తెగిపోయాయి. దీనివల్ల శ్రీనగర్‌, ముజఫరాబాద్‌ మధ్య కార్వాన్‌ ఇ అమ్మన్‌ బస్సు సర్వీసు కూడా నిలిచి పోయింది. బానిహల్‌, పాట్నీటాప్‌ సెక్టార్ల పరిధిలో దేశంలోని ఇతర ప్రాంతాలను అనుసంధానం చేసే జాతీయ రహదారిపై 300 కివిూ మేరకు భారీగా పొగ మంచు పేరుకు పోవడంతో రవాణా సంబంధాలు తెగిపోయాయి.

ఇక శ్రీనగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అననుకూల వాతావరణం కారణంగా ఆదివారం నుండి విమాన ప్రయాణాలు కూడా నిలిపి వేశారు. మంగళవారం ఉదయం నుంచే జిల్లా కేంద్రాల్లో అధికార యంత్రాంగం పొగమంచు తొలగింపు పనులు చేపట్టినా భారీగా పొగ మంచు కురుస్తుండడం వల్ల రోడ్లపై ట్రాఫిక్‌ స్వల్పంగా ఉంది. కశ్మీర్‌ విశ్వవిద్యాలయ పరిధిలో జరగాల్సిన పలు అధికారిక కార్యక్రమాలు కూడా వాయిదా వేశారు. ఇదిలా ఉంటే ఖిలాన్‌మార్గ్‌, మచిల్‌, కెరాన్‌, గురేజ, తంగధర్‌, చౌకీబాల్‌, యూరీ సెక్టార్ల పరిధిలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికార యంత్రాంగం ముందే హెచ్చరికలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు ఇంటికప్పుపై పడుతున్న పొగమంచును తప్పనిసరిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకృతి వైపరీత్యాల నియంత్రణ యాజమాన్య సంస్థ అధికారి తెలిపారు.

గురు, శుక్రవారాల్లో స్థానిక పోలీసు యంత్రాంగం కూడా పొగమంచును తొలగించడంలో నిమగ్నమై ఉంది. అత్యవసర పరిస్థితుల్లో సవిూప పోలీస్‌ స్టేషన్లను సంప్రదించాలని అధికారులు ఆదేశించారు. ఇదిలా ఉంటే ప్రజలకు అవసరమైన వంటగ్యాస్‌ అందుబాటులో లేక వినియోగదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అవసరమైన వారికి ఐదు కిలోల గ్యాస్‌ సిలిండర్లు శ్రీనగర్‌ – జమ్ము రహదారి పున: ప్రారంభమయ్యే వరకూ పంపిణీ చేస్తామని అధికార యంత్రాంగం తెలిపింది. మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్‌ శాఖ అధికారులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాను మంచు దుప్పటి కప్పేస్తోంది.

అటు గోదావరి… ఇటు రాములోరి గోపురం మంచు ముత్యాల్లా కనువిందు చేస్తున్నాయి. సన్నని సూర్యకిరణాలు తాకి భద్రుని కొండ ముద్దబంతిలా మురిపిస్తోంది. మంచు మబ్బులమాటున రామాలయం భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఆలయ గోపురాన్ని మంచు తన తెల్లటి దుప్పటితో కప్పేసి మరింత కనువిందు చేస్తోంది. ఈ సుందర దృశ్యాన్ని చూసి భక్తులు పారవశ్యానికి గురవుతున్నారు. సూర్యోదయం, సూర్యాస్తమయం వేళ గోదావరి అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు.

అలాంటి అందాలకు మంచు తోడైతే ఇక ఆ అద్భుత దృశ్యాలను కళ్లప్పగించి చూడటం తప్ప నోటమాటరాదు. అంతలా మనల్ని కట్టడిచేస్తున్నాయి భద్రాద్రి అందాలు. కొత్త సొగసులతో కొత్తపెళ్లికూతురిలా మురిపిస్తున్న భద్రాద్రిని చూసేందుకు పర్యాటకులు పరుగుపరుగునా గోదావరి తీరానికి చేరుకుంటున్నారు. ప్రకృతి రమణీయతలో తన్మయులవుతున్నారు.

బాపురమణ బొమ్మలతో నిండిన కరకట్ట అందాలు కొడైకెనాల్‌… ఊటీలను తలపిస్తున్నాయి. భద్రాచలంలో ఉదయం 10 గంటలైనా మంచు తెరలు తొలగడం లేదు. దట్టమైన పొగమంచు ధాటికి సూర్యకిరణాలు నేలను తాకడం లేదు. పిల్లలు, పెద్దలు చలి మంటల చుట్టూ చేరి చలి కాచుకుంటున్నారు. సహజ సుందర దృశ్యాలు మరో ఊటీని తలపిస్తున్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.