రజనీకాంత్‌లా ఉన్నాడనే అతన్ని పెళ్ళాడిందట!

157

కొద్దోగొప్పో పోలికలతో.. మనిషిని పోలిన మనుషులు కనబడుతూనే ఉంటారు. ఓ సెలెబ్రిటీ పోలికలు ఓ సాధారణ వ్యక్తికి ఉంటే.. ఆశ్చర్యమనిపించడమే కాదు, ఆ వ్యక్తిని తేరిపారా చూడాలనే ఆసక్తి నెలకొంటుంది. అలా రాజకీయనాయకులు, సినీ తారలు, ఇతర ప్రముఖుల పోలికలున్న వ్యక్తులు తారసపడుతూనే ఉంటారు. ముఖ్యంగా, సినీ తారల పోలికలతో ఉన్న వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే, మరింత ఆశ్చర్యం కలగకమానదు.

తమిళసూపర్ స్టార్ రజనీకాంత్‌ను పోలిన సోమసుందర్ అనే వ్యక్తి గురించి ముఖ్యంగా ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే, దిండిగల్‌కు చెందిన ఆయనను స్థానికులు కూడా రజనీ సోము అనే పిలుస్తుంటారు. రజనీ అంటే ఆయనకు చెప్పలేనంత పిచ్చి. సోము జీవితంలో జరిగిన ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. సోము తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆస్తిని అమ్మేసి రజనీకాంత్ సినిమాని ప్రమోట్ చేశాడట!

ఈ విషయం తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు సోముకు బడితే పూజ చేశారు. సోము తన అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, జన్మనిచ్చింది తల్లిదండ్రులే అయినా తన జీవితం మాత్రం రజనీ చుట్టూనే తిరుగుతుందని, ఆయన తన జీవితమని చెప్పాడు. తాను రజనీకాంత్‌లా కనిపించేందుకు, ప్రత్యేకంగా ఓ టైలర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నానని, తనకు బట్టతల లేకపోయినా రజనీ హెయిర్‌స్టైల్ కోసం రెండు వైపులా సగం మేర జుట్టు మొలవకుండా తొలగించేశానని చెప్పాడు.

రజనీ కాంత్‌లా కనిపించేందుకు తాను చేయని ప్రయత్నం లేదని చెప్పాడు. రజనీ కాంత్ సినిమాలు విడుదలైనప్పుడు అభిమానులు హడావుడి చేస్తుంటారు. కానీ, సోము రజనీ వీరాభిమాని కనుక, ఆయన స్టైలే వేరు. రజనీ తన సినిమాలో గిరగిరా తిప్పుకుంటూ సిగిరెట్ తాగితే సోము కూడా అదేమాదిరిగా స్మోకింగ్ చేశాడు. రజనీ కాంత్ డ్రింక్ తాగితే ఆయన కూడా తాగేస్తాడు.

‘అమ్మను గౌరవించు’ అని మన్నన్ సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ కు పరవశించి పోయిన సోము తన పద్ధతి మార్చుకున్నానని పేర్కొన్నాడు. ఓ సినిమాలో రజనీకాంత్ ఆటోడ్రైవర్ వేషం వేస్తున్నాడని తెలిసి తాను ఆటో డ్రైవింగ్‌ నేర్చుకుని, రజనీ స్టైల్‌లో కొంతకాలం ఆటోనడిపానని ఇరవై ఐదేళ్ల నుంచి రజనీని అనుసరిస్తున్న సోము చెప్పాడు. మరో ఆసక్తి కరమైన విషయమేమిటంటే? ‘ఆయన అచ్చం రజనీకాంత్‌లా ఉన్నారనే నేను పెళ్లి చేసుకున్నాను. ప్రతి ఇంట్లోనూ దేవుడు ఉంటాడు.ః

అయితే, మా దేవుడు రజనీయే’ అని సోము భార్య చెప్పడం విశేషం. సోముకు ఓ సారి ఎదురైన చేదు అనుభవం గురించి ప్రస్తావిస్తూ, ‘ఓ సారి తమిళనాడు ఎన్నికలు వచ్చాయి. ‘జయలలితకు ఓటేస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడు’ అని రజనీ పిలుపు నిచ్చారు. దీంతో ఆమె ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అదే సమయంలో చెన్నై వెళ్లిన నన్ను నిజంగానే రజినీకాంత్ అనుకుని ఓ తాగుబోతు బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. నా మూలంగానే జయలలిత ఓడిపోయిందంటూ పిచ్చకొట్టుడు కొట్టాడు’ అని చెప్పుకొచ్చాడు. రజనీకాంత్ కోసం ఆయన అభిమానులు దేనికైనా సిద్ధంగా ఉన్నారని చెబుతున్న సోము, యాంకరింగ్, స్టేజీ షోలు చేయడమే కాదు, టీవీ సీరియళ్లలోనూ చిన్న పాత్రలు పోషించాడు.

కాగా, రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రజనీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే కనుక ఆయన వెన్నంటి ఉండే సోమసుందరం లాంటి అభిమానులకు ఏమాత్రం కొదవలేదనే చెప్పవచ్చు.