‘కింగ్ మేకర్’ ఉత్తరాంధ్ర!

381
  • వచ్చే ఎన్నికలపై ఊహాగానాలు

  • హంగ్ వస్తే కీలకం కానున్న సిక్కోలు

ఎన్నికలనగానే నాయకులకు జనం గుర్తుకు వస్తారు. అలాగే జనానికి తమ సమస్యలూ ఒకటొకటిగా కనిపిస్తుంటాయి. వచ్చిన నాయకులను నిలదీద్దామన్న కసీ వారిలో కనిపిస్తుంటుంది గానీ, వచ్చిన వారు మనవారే అన్న మెతక వైఖరిని ప్రదర్శిస్తుంటారు. అందుకే అందరికీ ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం, ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యే ప్రచార అంశంగా కావాలి. బహుశా అందుకేనేమో ఈ రెండు సమస్యలూ దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా మిగిలిపోయాయి.

అటు దేశాన్ని, ఇటు రాష్ట్రాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ దగ్గర నుంచి నిన్నమొన్నటి జనసేన వరకూ అన్ని పార్టీల చూపూ ఈ రెండు సమస్యలపైనే పడింది. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంతో ఉద్దానం కిడ్నీ సమస్య పెనవేసుకుపోవడం యాదృశ్చికమే కావచ్చు గానీ, ఈ రెండు అంశాల గురించి సాధారణ ప్రజల్లోనూ కొంత మార్పు కనిపిస్తోంది. అయితే, ఆ మార్పు గత ఎన్నికలలో మాదిరిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందా? లేక కొత్తవాళ్లను ఆహ్వానిస్తుందా? అన్నది మాత్రం కాకలుతీరిన రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుచిక్కడం లేదు.

ఇక, ఒక్కముక్కలో చెప్పాలంటే, వెనుకబాటుతనం, అమాయకత్వం కలగలిసిన ప్రాంతం ఉత్తరాంధ్ర. వనరులు ఉన్నా నాయకుల చిత్తశుద్ధి లేని కారణంగా ఉత్తరాంధ్ర ఎప్పటికే వెనకబడే ఉంటోంది. కొత్త పార్టీలు ఆశగా చూసే ఈ ప్రాంతం ఇప్పుడు రాజకీయ పార్టీలకు తురుపుముక్కగా మారబోతోందా? నాయకుల పోటా పోటీ రాజకీయంతో ఉత్తరాంధ్ర రాజకీయం ఎటు తిరుగుతోంది? ఉత్తరాంధ్ర వనరులు అన్నీ ఉన్నా అభివృద్ధికి నోచుకోని ప్రాంతం ఇది. వెనుకబడిన ఈ ప్రాంతం రాజకీయ పార్టీలకు మాత్రం అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. మంచితనం, కొంత అమాయకత్వం కలగలసి ఉన్న ఈ ప్రాంత ప్రజలు రాజకీయ నాయకులు దగా చేసినా గట్టిగా ప్రతిఘటించిన దాఖలాలు లేవు.

విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ మూడు ఉత్తరాంధ్రా జిల్లాలు. వెనుకబడిన ప్రాంతాలే కాదు మహిళా ఓటర్లు ఎక్కువు వున్న ప్రాంతాలు. బీసీలు, దళితులు ఇలా ఇతర సామాజిక వర్గాలను ప్రభావితం చేసే ప్రాంతాలు. మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఏపీలో మరెక్కడా లేని విచిత్రమైన వాతావరణం, నైసర్గిక స్వరూపం ఈ ప్రాంతానికి ఉంది. బాగా దూరానికి వెలితే ఏజెన్సీ ప్రాంతాలు కాస్త ముందుకు వస్తే గ్రామాలు, మరికాస్త ముందుకు వస్తే పట్టణాలు ఇలా ఉత్తరాంధ్ర వాతావరణం కనిపిస్తుంది. కాస్త కష్ట పడితే. దృష్టి పెడితే ఇక్కడ గెలుపు సులభమని రాజకీయ నేతల అభిప్రాయం అందుకే కొత్త పార్టీల దృష్టి ఈ ప్రాంతంపై పడుతుంటుంది.

కొత్తగా పార్టీలు పెట్టిన వారిదీ ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అందుకే మొదట్నుంచి ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గట్టిగా కష్టపడితే ఇక్కడ కొన్నయినా సీట్లు రాబట్టుకోవచ్చన్న ఉద్దేశం కావచ్చు ఉత్తరాంధ్ర సామాజిక సమస్యలపై కూడా పవన్ స్పందించారు. దాదాపు పది రోజులకు పైగానే పవన్ ఉత్తరాంధ్రలో పర్యటించారు పవన్ పర్యటనకు అడుగడుగునా స్పందన కనిపించింది. మరో వారం రోజుల్లో వైకాపా అధినేత జగన్ ఎంట్రీ ఇవ్వనున్నారు.

ఇప్పటికే బీజేపి కన్నా పర్యటన చేసేసారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఉమెన్ చాందీ మూడు రోజుల పర్యటన కూడా ఖారారు అయింది. వామపక్షాల నేతలు అడపాదడపా వస్తూనే వున్నారు. ఇక ఎన్నికల రాజకీయాలకొస్తే ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట అయినా ప్రతిపక్షం, పవన్ పార్టీల తీరుతో టీడీపీ కూడా ఉద్యమాల పేరుతో జోరు పెంచింది. రైల్వేజోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ, యూనివర్శీటీలు, ఇతర వాగ్దానాలు అమలు కాని నేపధ్యంలో వాటినే రాజకీయ అస్త్రాలుగా మార్చుకునే పనిలో విపక్షాలు ఉత్తరాంధ్రపై గురిపెట్టాయి. కొత్త పార్టీలకు ఉత్తరాంధ్ర ఒక ప్రయోగ శాల ఓటర్లను ఆకట్టుకోడానికి వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడానికి ఇక్కడ చాలానే సమస్యలున్నాయి.

అందుకేనేమో పవన్ సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు బలపడతాయని హెచ్చరించారు. ఇక్కడ ఓటర్ల ఆలోచనా సరళిని చూస్తే ఒక్క 2004 ఎన్నికల్లో తప్ప ప్రతిసారి ఉత్తరాంధ్రలో టీడీపీ అధిపత్యం చాటుతూనే వుంది. కానీ చిరంజీవి ప్రజారాజ్యం రాకతో పరిస్థితి కొంత మారింది. ప్రజలు కూడా కొత్తదనం కోరుకున్నారు. దాంతో ప్రజారాజ్యం ఇక్కడ అయిదు సీట్లు గెలుచుకుంది. బహుశా అందుకే కావచ్చు పవన్ కూడా ఈ ఏరియాపైనే దృష్టి పెట్టారు.

ఇక ఉత్తరాంధ్ర ఓట్ల కోసం వైసీపీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. గతంలోనే జగన్ టీడీపీకి గట్టి పోటీ ఇచ్చారు. అరకు పార్లమెంట్ స్థానంతో పాటు ఏజేన్సీలోనే మూడు అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్నారు. ఇలా పార్టీలన్నింటికీ ఉత్తరాంధ్ర ఒక ఆశాజ్యోతిలా కనిపిస్తోంది. హోదా దక్కలేదన్న నిస్పృహతో ఉన్న జనాల ఆవేశాన్ని ఒడిసిపట్టడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి హోదా కోసం విశాఖ కేంద్రంగానే జగన్ గతంలో ఉద్యమాలు, ధర్నాలు, దీక్షలు చేశారు. జగన్‌కు పోటీగా టీడీపీ కూడా విశాఖ కేంద్రంగా ధర్మ పోరాట దీక్షలు, ధర్నాలతో హోరెత్తించింది. జనసేన కూడా మొన్ననే ఓ భారీ ర్యాలీ నిర్వహించింది.

ఇలా ప్రజా ఉద్యమాలతో జనం గుర్తింపు పొంది ఉత్తరాంధ్రలో కొన్నయినా సీట్లు సాధించాలన్న పట్టుదల ప్రతీ పార్టీలోనూ కనిపిస్తోంది. ఇక విభజనతో ఏపీలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ కూడా ఇక్కడ పట్టుకోసం ప్రయత్నించడం కొసమెరుపు. కాబట్టి ఎలా చూసినా రాబోయే ఎన్నికల్లో ప్రతీ రాజకీయ పార్టీకి ఉత్తరాంధ్ర చాలా కీలకం ఎన్నికల్లో హంగ్ వస్తే కింగ్ మేకర్ పాత్ర పోషించడానికి ఈ ప్రాంత సీట్లే కీలకం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఏ పార్టీ అయినా రాష్ట్రం మొత్తం ఎలా ప్రచారం చేసినా ఉత్తరాంధ్ర విషయంలో మాత్రం ప్రత్యేక దృష్టితోనే ప్రచారం చేస్తుంది. మొత్తానికి హంగ్ వస్తుందో రాదో గానీ, ఒకవేళ వస్తే మాత్రం ఉత్తరాంధ్ర కింగ్ మేకర్ కానుందన్న విశ్లేషణ మాత్రం నూటికి నూరుపాళ్లు వాస్తవం.