వైకాపా అడ్డగోలు రాజకీయం!

131
  • షర్మిల వివాదంపై సీఎం సందేహం

  • తెదేపా సమన్వయ కమిటీతో బాబు భేటీ

  • బీసీల్లో అపోహలకు వైకాపాతో కలిసి తెరాస కుట్ర

  • పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు

  • ఏపీలో బీసీలను ఏకం చేస్తామన్న తెలంగాణ మంత్రి తలసాని

అమరావతి, జనవరి 21 (న్యూస్‌టైమ్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సోదరి షర్మిల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎట్టకేలకు స్పందించారు. పింఛన్ల రెట్టింపుపై తాము తీసుకున్న సంచలన నిర్ణయం నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే షర్మిల వివాదాన్ని వైకాపా తెరపైకి తెచ్చిందని చంద్రబాబు దుయ్యబట్టారు.

‘ఫెడరల్ ఫ్రంట్’ అంటూ దేశం మొత్తం తిరిగినట్లు హడావుడి చేసిన కేసీఆర్‌ మమతా బెనర్జీ ర్యాలీకి ఎందుకు హాజరుకాలేదని నిలదీశారు. పార్టీ కార్యక్రమాల్లో కొందరు సీనియర్లు చురుగ్గా వ్యవహరించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చుక్కల భూముల సమస్య పరిష్కారంలో జాయింట్ కలెక్టర్లు విఫలమయ్యారంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు.

ఈ మేరకు అమరావతి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెదేపా సమన్వయ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు, వివిధ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు. తెదేపాతో ఏ మాత్రం సంబంధంలేని విషయం తమపై రుద్దే ప్రయత్నం వైకాపా చేస్తోందని సీఎం మండిపడ్డారు. ఆడవాళ్లను గౌరవించడం తెలుగుదేశం సంస్కృతి అని, వారిని కించపరిచే విధంగా పార్టీ ఏనాడూ వ్యవహరించదని ఆయన స్పష్టంచేశారు.

నాలుగేళ్లలో రూ.6 లక్షల కోట్ల అవినీతి అని ఒకరు, రూ.11 లక్షల కోట్లు అంటూ మరొకరు చేసే అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మరని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇలా పొంతనలేని విమర్శలు చేసే వారే ప్రజల్లో చులకనవుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ‘మళ్లీ నువ్వే రావాలి’ అని ప్రజల్లో పుట్టిన నినాదంతో వైకాపాలో దడ పుట్టిందని, అందుకే నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని విమర్శించారు. అందుకే ఆరేళ్ల క్రితం నాటి వివాదంపై షర్మిలతో ఇప్పుడు ఫిర్యాదు చేయించారని దుయ్యబట్టారకు.

కేసీఆర్‌ ఆడేవన్నీ నాటకాలేనని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌తో కలిసి మరో కొత్తనాటకానికి తెరతీశారని దుయ్యబట్టారు. రైతులకు తెలంగాణలో తక్కువ ప్రయోజనం చేసి, ప్రచారం ఎక్కువ చేసుకున్నారని విమర్శించారు. 95 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా వారికి రూ.10 వేలు ఇవ్వాలని చూస్తున్నట్లు సీఎం నేతలతో అన్నారు.

కౌలు రైతులు సహా అందరికీ పెట్టుబడి సాయం చేసేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు. మంత్రివర్గంలో దీనిపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో చాలా మంది నేతలతో ముఖాముఖి మాట్లాడుతున్నా మార్పు రావడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. లెక్కలేనితనం ఉంటేనే ఇలా ప్రవర్తిస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేసే చోట తెదేపా బాగుందని, నేతలు నిర్లక్ష్యంగా ఉన్న చోటే పరిస్థితి బాగోలేదని వివరించారు.

గుంటూరు జిల్లా నేతలు ఎందుకో అతి విశ్వాసంతో ఉన్నారని, మంత్రులు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతో కాకుండా పార్టీ నిర్ణయాలతో పని చేయాలని హితవుపలికారు. సీనియర్లం అనే ఇగో వచ్చిందా? పదవులు ఉన్నాయనే అహానికి పోతున్నారా? అంటూ పలువురు నేతలపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, ఏం మేలు చేశారని కేంద్ర మంత్రులు వారానికొకరు రాష్ట్రానికి వస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

రాష్ట్రపతి పాలన పెడతామని బెదిరింపులు చేస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడేవారెవరూ లేరన్నారు. తెదేపా నేతలతో సోమవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. కోల్‌కతాలో నిర్వహించిన విపక్షాల సభకు 10 లక్షల మందికి పైగా తరలివచ్చారని, అమరావతిలో నిర్వహించే ధర్మపోరాట సభను దీనికి దీటుగా నిర్వహించాలని నేతలకు సూచించారు.

ప్రధాని నరేంద్రమోదీ పాలనలో సంక్షేమం పడకేసిందని, భాజపా పాలిత రాష్ట్రాల కన్నా చాలా తక్కువ నిధులు ఏపీకి కేటాయించారని చంద్రబాబు ఆరోపించారు. గతంలో వైఎస్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిందించారని, ‘రాజా ఆఫ్‌ కరప్షన్‌’ పుస్తకంపై కేసీఆర్‌దే రెండో సంతకమని దుయ్యబట్టారు. ఇప్పుడు అదే కేసీఆర్‌ వైఎస్‌ను పొగుడుతున్నారని విమర్శించారు. బీసీల్లో అపోహలు తేవాలని వైకాపా, తెరాస కుట్రలు చేస్తున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. మోదీ డైరెక్షన్‌లోనే ఇవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు.

బీసీలను తెదేపాకు దూరం చేయాలనే కుతంత్రాలు చేస్తున్నారని, ఆ మూడు పార్టీల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. బీసీలే సంఘటితంగా కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. చిత్తూరుకు కృష్ణా జలాలు రావడం ఒక చరిత్ర అని, కృష్ణా జలాలకు రాయలసీమ ప్రజలు హారతులు పడుతున్నారని చెప్పారు. నాలుగు సీమ జిల్లాలకు నీళ్లు ఇవ్వగలిగామని, అసాధ్యాలను సుసాధ్యం చేశామన్నారు. ప్రతిపక్షం పూర్తిగా డీలాపడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా, ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి బీసీలకు నాయకత్వం వహిస్తానని తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఆ ప్రాంతం నుంచి తనను చాలా మంది ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ఏపీలో బీసీలను ఏకం చేసేందుకు తన వద్ద మంచి ఆయుధాలు ఉన్నాయన్నారు. అసెంబ్లీ లాబీలో సోమవారం మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఏపీలో ఒక్కశాతం ఓట్లనైనా ప్రభావితం చేస్తానని తలసాని స్పష్టం చేశారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ నియోజకవర్గంలో 25 వేల యాదవుల ఓట్లు ఉన్నాయని, ఆయన్ను ఓడించడానికి ఆ ఓట్లు చాలని పేర్కొన్నారు.

నందమూరి బాలకృష్ణ, ఆలపాటి వచ్చి తన నియోజకవర్గంలో ఏమీ చేయలేకపోయారని దుయ్యబట్టారు. తాను ఒక్కడిని ఏపీకి వెళితేనే తెదేపా నేతలు వణికిపోతున్నారని, కేసీఆర్‌ వెళితే ఇంకెంత భయపడతారోనని అన్నారు. తెలంగాణలో బీసీలకు రాజ్యసభ సీట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు బీసీలకు న్యాయం జరిగిందని, చంద్రబాబు బీసీలకు చేసిందేమీ లేదన్నారు. జగన్‌, కేసీఆర్‌ కలవటం వల్ల వైకాపాకు నష్టం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో వచ్చినట్టు భారీ మెజార్టీలు ఏపీలో రావని, వందల ఓట్ల తేడాతో నేతల జాతకాలు మారిపోతాయన్నారు.