టీవీ వినియోగదారుడే రారాజు!

116
  • నెలకు రూ.130తో బుల్లితెర వినోదం

  • వంద ఉచిత ఛానళ్లతో ఆనందమయం

  • ఎంచుకునే వాటికే ఆపరేటర్లకు చెల్లింపులు

హైదరాబాద్, జనవరి 21 (న్యూస్‌టైమ్): బుల్లితెర వినోదం ఇక మరింత సరసమైన ధరకు లభించనుంది. ఇంత వరకూ అవసరం ఉన్నా లేకున్నా వందలకు వందలు ఖర్చుచేసిన వినియోగదారుడిని రారాజును చేస్తూ టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) తీసుకున్న నిర్ణయంలో భాగంగా వచ్చే నెల ఒకటి నుంచి ఎంచుకున్న ఛానళ్లకు మాత్రమే చెల్లింపులు జరిపే వెసులుబాటు కలిగింది.

కొత్త కేబుల్‌ ఛానళ్ల విధానంలో భాగంగా మారిన ఈ పద్ధతి ఇప్పటికే అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. గతనెల 29 నుంచి మారిన నూతన విధానాన్ని కేబుల్ ఆపరేటర్లు, టీవీ ఛానల్ యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు అధికారులు పొడిగించారు. ఈ నేపథ్యంలో ఇకమీదట ఇష్టమైన ఛానళ్లకే డబ్బు చెల్లించి వాటిని మాత్రమే వీక్షించే అవకాశం వినియోగదారులకు దక్కనుంది. కొత్త కేబుల్ టీవీ విధానంలో వంద దాకా ఉచిత ఛానళ్లకుతోడు, మనం డబ్బులు చెల్లించిన ఛానళ్లే ప్రసారం కానున్నాయి.

ఇందులో కుటుంబ సభ్యుల అభిరుచి, ఇష్టాయిష్టాలను బట్టి ఎంచుకొని చూసే అవకాశం ఉంది. ఇకపై టెలివిజన్‌ ప్రేక్షకులు తాము ఏయే ఛానళ్లు చూడాలనుకుంటున్నారో వాటికి మాత్రమే డబ్బులు చెల్లించే సరికొత్త విధానాన్ని భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) అమల్లోకి తీసుకువచ్చింది. వినియోగదారుడు నెలకు కనిష్ఠంగా రూ.130 (పన్నులు అదనం) చెల్లిస్తే సరిపోతుంది.

ఇందులో 100 ఉచిత ఛానళ్లు అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా చెల్లింపు ఛానళ్ల కోసం వినియోగదారులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సినిమాలు, క్రీడలు, వార్తలు, ఇతర వినోద ఛానళ్లను చెల్లింపు విభాగంలోకి వస్తాయి. వాటికి చందాదారులుగా మారితేనే వీక్షించే అవకాశం ఉంటుంది. చెల్లింపు ఛానళ్లకు ఒక్కోదానికి ఒక్కోధర ఉంది. ఏ ఛానల్‌ కావాలని కోరుకుంటే, వాటికి మాత్రమే డబ్బులు చెల్లించి చూడొచ్చు. చెల్లింపు టీవీ ఛానళ్లకు గరిష్ఠ చిల్లర ధర ఎంతనేది తెలుసుకునేందుకు ట్రాయ్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చు. లేదా ఇప్పటికే పలు ఛానళ్లలో ధరల వివరాల్ని ప్రసారం చేస్తుండటాన్ని గమనించవచ్చు. ఫిబ్రవరి 1 తర్వాత ఉచిత ఛానళ్లు మాత్రమే ప్రసారమవుతాయి.

దేశవ్యాప్తంగా డీటీహెచ్‌, కేబుల్‌ కనెక్షన్లు అన్నింటికీ ఇదే తుది గడువుగా ట్రాయ్ నిర్ణయించింది. గడువు దాటాక ఛానళ్ల ప్రసారం ఆగిపోవద్దనుకుంటే వీక్షించాలనుకుంటున్న చెల్లింపు ఛానళ్లకు సంబంధించిన జాబితాను స్థానిక కేబుల్‌ ఆపరేటర్‌కు ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పద్ధతి వల్ల సగటు వినియోగదారుడు ప్రస్తుతం తాను చెల్లిస్తున్నదానికన్నా రెట్టింపు వ్యయం చేయాల్సి వస్తుందనేది కేబుల్‌ ఆపరేటర్ల వాదన. అయితే, ప్రస్తుత కేబుల్‌ వ్యవస్థ ద్వారా ప్రసారమయ్యే వందకుపైగా ఛానళ్లలో వీక్షకులు అనునిత్యం చూసేవి కొన్నే ఉంటాయని, మిగతావన్నీ వృథాయేనని, ఇకపై అవసరమైన వాటిని మాత్రమే ఎంచుకుని చూసే అవకాశం దక్కుతుందని పలువురు వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం మంది ప్రేక్షకులు తెలుగు ఛానళ్లు మాత్రమే వీక్షిస్తారని, కేబుల్‌ టీవీలో వచ్చే ఇతర ఛానళ్లన్నీ ఇతర భాషలకు, అంశాలకు సంబంధించినవేనని, వాటిని చూసే అవసరం ఎప్పుడో తప్ప రాదని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో పిల్లలు, వృద్ధులు, యుక్తవయస్కులకు అభిరుచుల వారీగా అవసరమైన ఛానళ్లనే ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్త విధానంలో వందదాకా ఉచిత ఛానళ్లు ప్రసారమవుతూనే, అదనపు చెల్లింపుతో అవసరమైన చెల్లింపు ఛానళ్లు మాత్రమే రావడం వల్ల అనవసరపు ఖర్చుల భారం ఉండదనే అభిప్రాయాలూ ఉన్నాయి.