ఎవరి దయాదాక్ష్యిణ్యాలపైనో ఆధారపడను!

188
  • అలాంటి మనస్తత్వం తనది కాదన్న వంగవీటి రాధా

  • తండ్రి ఆశయాన్ని కొనసాగించేందుకే ప్రజా ప్రయాణం

  • వైసీపీలో ఆంక్షలు ఎక్కువగా ఉన్నాయని విమర్శ

విజయవాడ, జనవరి 20 (న్యూస్‌టైమ్): వంగవీటి మోహనరంగా తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్‌లో కీలక నేత రాధాకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆదివారం ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాధా మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామాకు గల కారణాలను వివరించారు.

వైసీపీలో తన ఆకాంక్షలు నెరవేరడం లేదని, తన తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా ప్రజా ప్రయాణాన్ని ప్రారంభించిన తన ఆకాంక్షలు నెరవేరాలంటే ఎలాంటి ఆంక్షలు లేని ప్రజాసేవకు వేదికైన రాజకీయ రంగాన్ని ఎంచుకున్నానని, అటువంటిది ప్రస్తుతం తాను ఉన్న పార్టీలో ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం తనకు అవసరమని రాధా పునరుద్ఘాటించారు.

తన తండ్రి వంగవీటి రంగా ఆశయాన్ని కొనసాగించేందుకు ప్రజా ప్రయాణం కొనసాగించాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. ఆంక్షలు ఎక్కువగా ఉండటం వల్లే వైసీపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే మనస్తత్వం తనది కాదని ఆయన చెప్పారు. తన రాజనామాను వెంటనే ఆమోదించాలని వైసీపీ అధినేత జగన్‌ను కోరుతున్నానని తెలిపారు.

‘‘ముఖ్యమంత్రి కావాలన్న తమరి ఆకాంక్ష నెరవేరాలంటే పార్టీలోని అందరిపై ఆంక్షలు విధించడం తప్పనిసరి. నా ఆకాంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రయాణం తప్పనిసరి’’ అంటూ రాజీనామా లేఖలో వంగవీటి రాధా వ్యాఖ్యానించడం గమనార్హం.