జగన్‌తో జతకట్టాలని టీఆర్ఎస్ నిర్ణయం

284

హైదరాబాద్, జనవరి 16 (న్యూస్‌టైమ్): చెప్పుకోవడానికి పేరు ఏదైనా ఆ రెండు పార్టీల లక్ష్యం ఒక్కటైంది. పక్కలో బల్లెంలా మారిన తెలుగుదేశం పార్టీని ఏకాకిని చేసే ధ్యేయంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌తో జతకట్టాలని తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి కూటమి కట్టిన టీడీపీని ఏపీలో బలహీనపర్చే క్రమంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌తో కలిసి పనిచేయాలన్న ఆలోచనకు కేసీఆర్ రావడం రాజకీయంగా ఊహించినదే అయినప్పటికీ జగన్‌కు మాత్రం ఈ నిర్ణయం ప్రతికూలంగా మారినా మారవచ్చు.

జగన్‌తో కలిసి పనిచేయడంలో భాగంగా టీఆర్ఎస్ బృందం వైఎస్సార్ కాంగ్రెస్ బృందంతో బుధవారం భేటీ అయింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఆయన తనయుడు, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జగన్‌తో సమావేశమై చర్చించారు. దేశరాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని సమాఖ్య స్ఫూర్తితో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భావించారని భేటీ అనంతరం కేటీఆర్ తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగానే వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలను కలిసి మద్దతు కోరినట్లు చెప్పారు.

అనంతరం ఇరువురు నాయకులు మీడియా ముందు మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడడం జరిగిందని, తమ ప్రయత్నాల పట్ల ఆయన సానుకూలంగా స్పందించడంతో వచ్చి వారి బృందాన్ని కలిసి అన్ని విషయాలను పంచుకున్నామన్నారు. తప్పకుండా ఒకే ఆలోచనాధోరణి ఉన్న నేతలందరూ ఒకే వేదికపై వస్తారని ఆశిస్తున్నామని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే విధంగా జాతీయ రాజకీయాలు, రాజకీయ వ్యవస్థ ఉండాలన్న ఆలోచన ఉన్నవాళ్లు కలిసి వస్తారని తమకు విశ్వాసం ఉందన్నారు.

ఇటీవల కేసీఆర్‌ ఏవిధంగానైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో చర్చించారో అదే విధంగా త్వరలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికీ వెళ్లి జగన్‌తో భేటీ అయి మిగిలిన విషయాలను మాట్లాడతారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేసీఆర్‌, కేశవరావు, కవిత సహా తమ పార్టీ నేతలందరం స్పష్టంగా చెప్పామని కేటీఆర్ పేర్కొన్నారు.

అనంతరం జగన్మోహన్‌రెడ్డి‌ మాట్లాడుతూ ‘‘కేసీఆర్‌గారు ఫోన్‌లో మాట్లాడిన తర్వాత తారక్‌ (కేటీఆర్‌) వచ్చి ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి నాతో చర్చించారు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాల గురించి, అన్యాయం జరగకుండా రాష్ట్రాలు నిలబడాలంటే, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలవాల్సి ఉంది. ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీకే దిక్కు లేకుండా పోయింది. ఇలాంటి వాటిని అధిగమించాలంటే ఒక్కో రాష్ట్రం పరిధిలో వాళ్లకున్న ఎంపీల సంఖ్యపరంగా చూస్తే, అధిగమించే పరిస్థితి ఉండదు. 25 మంది ఎంపీలతో ప్రత్యేకహోదా కోసం మేము డిమాండ్‌ చేసినా, పట్టించుకునే పరిస్థితి లేదు. వారికి తోడు తెలంగాణ నుంచి మరో 17 మంది ఎంపీలు కూడా జతకూడితే, మొత్తం 42 మంది ఎంపీలు ఒకే తాటిపైకి వచ్చి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి పోరాడితే మేలు జరిగే పరిస్థితి ఉంది. ఇది స్వాగతించదగ్గ విషయం. రాష్ట్రాల హక్కులు కాపాడాలంటే సంఖ్యాపరంగా ఈ నెంబరు పెరగాలి. అప్పుడే రాష్ట్రాలకు అన్యాయం చేసే విషయంపై కేంద్ర ప్రభుత్వాలు వెనకడుగువేస్తాయి. ఇందుకోసం కేసీఆర్‌ ఏర్పాటు చేస్తున్న వేదిక మంచిది. ఈ విషయంపైనే కేసీఆర్‌ నాతో ఫోన్‌లో మాట్లాడారు. ఇప్పుడు కేటీఆర్‌ నాతో చర్చించారు. మళ్లీ నేరుగా ఏపీ వచ్చి కేసీఆర్‌ నాతో మాట్లాడతానన్నారు. ప్రస్తుతం కేటీఆర్‌తో చర్చించిన విషయాలు పార్టీలో మరింత సుదీర్ఘంగా చర్చిస్తాం’’ అని తెలిపారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి హర్షనీయమని జగన్ కొనియాడారు. ఫెడరల్ ఫ్రంట్‌పై కేటీఆర్‌తో చర్చించామని, జాతీయస్థాయిలో రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాల్ని అడ్డుకోవడానికి కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌తో చర్చలు స్వాగతించదగ్గ విషయమన్నారు.

రాష్ట్ర హక్కులు కాపాడుకోవాలంటే సంఖ్యా బలం పెరగాలన్నారు. రాష్టాలు ఒకే తాటిపైకి వస్తే అన్యాయం చేసేందుకు కేంద్రం వెనకడుగు వేస్తుందన్నారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌పై రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తద్వారా రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడే వీలుంటుందన్నారు. భావసారూప్య పార్టీలను ఒకే వేదికపైకి తేవాలన్న కేసీఆర్ నిర్ణయం హర్షనీయమన్నారు. ఫెడరల్ ఫ్రంట్ దిశగా ప్రస్తుతం జరిగిన సమాలోచనలు ప్రాథమిక చర్చలు మాత్రమేనని, ఇంకా కొనసాగుతాయని జగన్ పేర్కొన్నారు.

మొత్తానికి ఫెడరల్‌ ఫ్రంట్‌పై కేసీఆర్ వడివడిగానే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసి వచ్చే విషయంపై వైకాపాతో చర్చలు జరపాలని తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెరాస నేతలు కేటీఆర్‌, వినోద్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాసానికి చేరుకుని చర్చలు ప్రారంభించారు.

కాంగ్రెస్‌, భాజపాలకు వ్యతిరేకంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్‌ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఫ్రంట్‌ ఏర్పాటుపై ఇప్పటికే పశ్చిమ్‌ బంగా సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కేసీఆర్‌ ఇప్పటికే చర్చలు జరిపారు. యూపీఏ, ఎన్డీఏ కూటమిలో లేని జగన్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో కలిసివెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే యూపీఏ కూటమితో తెదేపా అధినేత చంద్రబాబు జట్టుకట్టడం, ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు ఎదురుగాలి వీస్తుండటంతో జగన్‌ ముందున్న మూడో ప్రత్యామ్నాయం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఒక్కటే కనిపిస్తోంది. మరోవైపు, తెలంగాణలో మహాకూటమి తరఫున ప్రచారం చేసిన ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌తో తెరాస నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో వైకాపా, తెరాస నేతల భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.