సకల శుభాల సంక్రాంతి!

182
సకల శుభాల సంక్రాంతి!

పంటలు బాగా పండి, రైతు కుటుంబాలు ఎంత సంతోషంగా ఉంటే ఆ ఏడు సంక్రాంతి అంత ఘనంగా జరుగుతుంది. సంక్రాంతి ఎంత ఘనంగా జరిగితే సమాజానికి అంత శుభం. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్, ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయ రంగానికి ఎన్నో రకాలుగా ఊతమిచ్చారు.

రైతు సమస్యల పరిష్కారానికి మండల, రాష్ట్ర స్థాయిల్లో కర్షకపరిషత్తులను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలో నీటి పంపిణీ విధానాన్ని సంస్కరించారు. ప్రణాళికా రచనలో రైతు సంఘాలకు ప్రాధాన్యం కల్పించారు. ఏడాదికి 12 వేల రూపాయల కన్నా తక్కువ ఆర్జించే పేద రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారు. సంవత్సరం పొడుగునా వాడుకున్న విద్యుత్తుకు ఒక పంపు సెట్టుకు యాభై రూపాయలు కడితే సరిపోయేది. ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన సబ్సిడీ వల్లే, ఆ తర్వాతి కాలంలో ఉచిత విద్యుత్ డిమాండుకు దారి తీసింది. అంతేకాదు 60 ఏళ్ళు పైబడిన భూమిలేని రైతులకు, రైతు కూలీలకు ‘తెలుగు వ్యవసాయ కార్మిక సాదర సంక్షేమం’ పథకం పేరిట నెలకు రూ.30 పింఛనును ఇచ్చేవారు. అదికూడా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మనియార్డర్ ద్వారా నేరుగా ఇంటికే పంపించేవారు.

రైతు ప్రభుత్వం అన్నమాటకు అర్థం చెప్పి తానొక రైతుబిడ్డనని చాటుకున్నారు. పాఠకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు, తెలుగువారందరికీ ‘కనుమ’ పండుగ శుభాకాంక్షలు!