అలరిస్తున్న ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’!

189

హైదరాబాద్, జనవరి 16 (న్యూస్‌టైమ్): సంక్రాంతి సెంటిమెంట్ విక్టరీ వెంకటేష్‌కు బాగా కలిసొచ్చినట్లుంది. ఆయన సంక్రాంతికి ఏ సినిమాతో వచ్చినా అలరించడం ఖాయం. మల్టీస్టారర్ చిత్రాలతోనూ వెంకీ మంచి హిట్టులే కొట్టారు. గతంలో ఆయన ప్రిన్స్ మహేష్‌బాబుతోను, రామ్‌తోనూ చేసిన ప్రయోగాలు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌తో కలిసి భార్యా బాధితులుగా చేసిన ప్రయోగం కూడా ఆశించిన ఫలితాన్నే ఇచ్చింది.

‘ఎఫ్‌2: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ పేరిట వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ థియేటర్లలో కేరింతలు కొట్టిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల వారినే కాదు, ప్రవాసులనూ తెగ నవ్వించేస్తున్నారు వీరిద్దరూ. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వరుణ్‌తో కలిసి వెంకీ చేసిన ఈ సరికొత్త కామెడీ ప్రయోగం సంక్రాంతి చిత్రాలకే హైలెట్‌గా నిలిచింది. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జీవితాధారంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ రూపొందించిన ‘ఎన్టీఆర్: కథానాయకుడు, దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘పేట’, రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రాల ధాటికి తట్టుకుని ‘ఎఫ్‌2: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ కలెక్షన్లు రాబట్టుతుండడం విశేషం.

తమన్నా, మెహరీన్‌ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా అలరిస్తోంది. సంక్రాంతికి థియేటర్‌కు వచ్చిన ఈ అల్లుళ్లు వెండితెరపై తెగ సందడి చేస్తున్నారు. భార్యల వల్ల వాళ్లు ఫ్రస్ట్రేషన్‌కు గురవుతూ ప్రేక్షకులకు ఫన్‌ పంచుతున్నారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎఫ్‌2’ ఓవర్సీస్‌లో మంచి టాక్‌ను తెచ్చుకుంది. మూడు రోజుల్లోనే మిలియన్‌ డాలర్లను వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. కుటుంబ కథా చిత్రాలు అందునా, కామెడీ, ఫీల్‌గుడ్‌ చిత్రాలకు ఓవర్సీస్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది.

ఆ కోవలోనే తెరకెక్కిన ‘ఎఫ్‌2’ను కూడా అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వెంకటేష్‌, వరుణ్‌, తమన్నా, మెహరీన్‌ నటన, అనిల్‌ రావిపూడి సినిమాను తెరకెక్కించిన విధానంపై అందర్నీ అలరిస్తోంది. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత పాత వెంకటేష్‌ను చూశామని, ఆయన కామెడీ చేస్తే ఎలా ఉంటుందో మరోసారి ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు రుచి చూపించారని అభిమానులు అంటున్నారు.

‘ఎఫ్‌2’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ‘దిల్‌’ రాజు నిర్మించారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, అన్నపూర్ణ, వై.విజయ, నాజర్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.