తమిళనాడులో ‘యాపిల్‌’ యూనిట్!

613

చెన్నై, జనవరి 13 (న్యూస్‌టైమ్): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘యాపిల్‌’ ఐ ఫోన్ల తయారీ సంస్థ తమిళనాడుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఇప్పటికే ఉన్న ఐ ఫోన్ల తయారీ యూనిట్‌కు అదనంగా దక్షిణ భారత దేశంలోనే మరో యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది యాజమాన్యం. ఈమేరకు ఖరీదైన అంటే హై ఎండ్‌ ఫోన్ల తయారీ కాంట్రాక్ట్‌ను తైవాన్‌ కంపెనీ ‘ఫాక్స్‌కాన్‌’కు ఇచ్చింది యాపిల్‌ కంపెనీ. ఎస్‌ 6, ఎస్‌ఈ మోడల్స్‌ ఫోన్ల తయారీ కాంట్రాక్ట్‌ను తైవాన్‌కే చెందిన ‘వెస్ట్రిన్‌’కు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ కంపెనీ ప్రస్తుతం కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో ఈ ఫోన్లను తయారు చేస్తోంది. హై ఎండ్‌ ఫోన్ల తయారీ కాంట్రాక్ట్‌ను మాత్రం ‘ఫాక్స్‌కాన్‌’కు అప్పగించింది. ‘ఫాక్స్‌కాన్‌’కు తమిళనాడులోని శ్రీ పెరంబదూర్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో శ్రీసిటీ వద్ద ప్లాంట్లు ఉన్నాయి. యాపిల్‌ ఫోన్లను శ్రీ పెరంబదూర్‌ ప్లాంట్‌లో తయారు చేస్తారు. ఈ ప్లాంట్‌ విస్తరణ కోసం ‘ఫాక్స్‌కాన్‌’ రూ. 1500 కోట్లు వెచ్చించనుంది. వచ్చే ఏడాది ఫోన్ల ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ ప్లాంటు వల్ల సుమారు పాతిక వేల మందికి ప్రత్యక్షంగా, మరో యాభై వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది.
దీనికి సంబంధించి అధికారిక సమాచారం జనవరి 24న చెన్నైలో జరిగే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌లో వెలువడే అవకాశముంది. దీంతో ప్రీమియం ఫోన్ల కంపెనీ యాపిల్‌ భారత్‌లో తన ఉత్పత్తుల అసెంబ్లింగ్‌కు కసరత్తు పూర్తిచేసినట్లవుతుంది. వచ్చే ఏడాది చివరి నాటికి భారతదేశంలో టాప్‌ ఎండ్‌ ఐఫోన్లను తయారీని ప్రారంభించనుంది. ముఖ్యంగా ఐ ఫోన్‌ ఎక్స్‌, ఎక్స్‌ ఎస్‌, మాక్స్‌, ఎక్స్‌ఆర్‌ లాంటి అతి ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను రూపొందించనుంది ‘ఫాక్స్‌కాన్’. ‘ఫాక్స్‌కాన్‌’ ఇప్పటికే షామీ ఫోన్ల తయారీలో కీలకంగా వ్యవహరిస్తోంది.
ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు 356 మిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టి ప్లాంట్‌ను మరింత విస్తరిస్తోందని తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి ఎంసి సంపత్‌ తెలిపారు. దీనిపై స్పందించేందుకు అటు ‘యాపిల్‌’ వర్గాలు, ఇటు ‘ఫాక్స్‌కాన్‌’ వర్గాలు నిరాకరించాయి. ఈ ఫోన్ల తయారీ కోసం ‘యాపిల్‌’ సంస్థ సుమారు రూ.2500 కోట్ల పెట్టుబడులను పెట్టనుందని తెలుస్తోంది. ఇప్పటికే చైనాకు చెందిన షియోమీ సంస్థ మరో మూడు ఉత్పత్తి యూనిట్లను భారత్‌లో ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
అదే బాటలో ‘యాపిల్’ సంస్థ కూడా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో ‘యాపిల్’ సంస్థ కూడా తన భారత్‌లో తన ఉత్పత్తులను తయారుచేస్తే ఐఫోన్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. భారత్‌లో ఐఫోన్‌ 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌ ఫోన్లకు భారత్‌లో మంచి డిమాండ్ ఉండటంతో వాటిని భారత్‌లోనే తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులో టెస్ట్ ప్రొడక్షన్‌ను ప్రారంభించినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో కమర్షియల్‌ ప్రొడక్షన్ ప్రారంభించే అవకాశం ఉంది.