యువతకు స్ఫూర్తిప్రధాత.. వివేకానందుడు!

116

హైదరాబాద్, జనవరి 12 (న్యూస్‌టైమ్): స్వామీ వివేకానంద (జనవరి 12, 1863 – జూలై 4, 1902) ప్రసిద్ధిచెందిన భారతీయ గురువు, రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రాలలో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తి, రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.

భారతదేశాన్ని జాగృతం చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి, భారతీయ ఆధ్యాత్మిక ప్రశస్తి గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పోందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది.
ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వాన్ని షికాగోలో జరిగిన పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్‌లో 1893లో ప్రవేశపెట్టాడు వివేకనందుడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసులోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని ‘జాతీయ యువజన దినోత్సవం’గా 1984లో ప్రకటించింది.
ఇదిలావుండగా, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు కట్టి తనను తాను రాజయోగిగా అభివర్ణించుకున్నారు. సన్యాసాశ్రమం అంటూ నేలపై కూర్చున్నారు, నేలపై నిద్రించారు. అంతలోనే వివేకానందునిగా తలపాగా చుట్టారు. ఎవరికైనా ఏదయినా చెప్పేముందు మనం కూడా దాన్ని నమ్ముతున్నాం లేదా ఆచరిస్తున్నాం అన్న విషయం అవతలి వ్యక్తికి తెలియడం ముఖ్యం అంటారు ఎన్టీఆర్. ‘‘అవినీతి గురించి మాట్లాడాలంటే ముందు నేను స్వార్థానికి అతీతుడిని అన్న విషయం ప్రజలకు తెలియాలి.
అందుకే నేను కాషాయం ధరించి సర్వసంగ పరిత్యాగిగా జనం ముందు నిలిచాను’’ అని అన్నారు ఎన్టీఆర్. వేద విజ్ఞానాన్ని, తార్కిక తత్వాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేర్చింది వివేకానందుడే. అందుకే యువతకు ఆయన ప్రేరణ అయ్యారు. అలాగే బడుగు, బలహీన వర్గాలలో రాజకీయ చైతన్యం కలిగించి, వారికి రాజకీయ అవకాశాలను ఇచ్చారు ఎన్టీఆర్. శనివారం స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా ఆ స్ఫూర్తి ప్రదాత స్మృతికి నివాళి.