‘ఎన్‌టీఆర్‌: కథానాయకుడు’ బృందానికి సీఎం ప్రశంస

139

విజయవాడ, జనవరి 11 (న్యూస్‌టైమ్): ‘ఎన్‌టీఆర్‌: కథానాయకుడు’ చిత్ర బృందాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రశంసించారు. గురువారం రాత్రి విజయవాడ బెంజిసర్కిల్‌లో ఉన్న ట్రెండ్‌ సెట్‌ మాల్‌లో చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడితో కలిసి చంద్రబాబు సినిమా చూసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో చంద్రబాబు శుక్రవారం బాలయ్య, క్రిష్‌ను సత్కరించారు. బాలయ్య ఎన్టీఆర్‌ పాత్రను అద్భుతంగా పోషించారని చంద్రబాబు అన్నారు. ‘ఎన్‌టీఆర్‌: కథానాయకుడు’ సినిమాను తెరకెక్కించి మహానటుడి జీవితాన్ని, త్యాగాన్ని, అకుంటిత కార్యదక్షతను ప్రజలకు అర్థమయ్యేలా చిత్ర రూపమిచ్చిన క్రిష్‌ను అభినందించారు.

ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండో భాగం ‘ఎన్టీఆర్: మహానాయకుడు’ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ బయోపిక్‌లో బసవతారకంగా విద్యా బాలన్‌, నారా చంద్రబాబునాయుడుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, నందమూరి హరికృష్ణగా నందమూరి కల్యాణ్‌రామ్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రేలంగిగా డాక్టర్ బ్రహ్మానందం, నాగిరెడ్డిగా ప్రకాశ్‌రాజ్‌, షావుకారు జానకిగా షాలినీ పాండే, సావిత్రిగా నిత్యా మేనన్, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌రాజ్‌పుత్‌ నటించారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి బాణీలు అందించారు.

బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాను ‘వారాహి చలన చిత్రం’ సంస్థ సమర్పించింది. బుధవారం విడుదలైన ఈ సినిమా సినీ విశ్లేషకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.