పాఠంగా మిగిలే ‘ఎన్టీఆర్-కథానాయకుడు’

371

హైదరాబాద్, జనవరి 9 (న్యూస్‌టైమ్): వెండితెర ఇలవేల్పుగా వెలుగొందిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయనే చివరికి ఓ సినిమాగా అవతరిస్తారని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.

అటు సినీ రంగంలోను, ఇటు రాజకీయ రంగంలోనూ తన ఉనికి చాటుకున్న అన్న ఎన్టీఆర్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ రూపొందించి హీరోగా నటించిన చిత్రం ‘ఎన్టీఆర్‌-కథానాయకుడు’. రెండు భాగాలుగా నిర్మితమైన ఈ బయోపిక్‌లో తొలి భాగం బుధవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది. ‘ఎన్టీఆర్‌-మహానాయకుడు’ పేరిట రూపొందుతున్న రెండో భాగం ఈనెల నాలుగో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలకృష్ణ, విద్యాబాలన్‌, దగ్గుబాటి రానా, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా, వెన్నెల కిషోర్‌, పూనమ్‌ బాజ్వా, మంజిమా మోహన్‌, నరేష్‌, మురళీశర్మ, క్రిష్‌, రవికిషన్‌, శుభలేఖ సుధాకర్‌, రవిప్రకాష్‌, చంద్ర సిద్ధార్థ, భానుచందర్‌, ప్రకాష్‌రాజ్‌, కె.ప్రకాష్‌, ఎన్‌.శంకర్‌, దేవి ప్రసాద్‌ తదితరులు నటించిన ఈ చిత్రం అంచలకు మించి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నట్లు తొలి ఆట నుంచే ప్రచారం ఊపందుకుంది.

చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి, పాఠంగా మిగిలిపోనుందన్న పోజిటివ్ టాక్ రావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తంచేస్తోంది. ఎన్టీఆర్ కేవ‌లం తెలుగు వారి అభిమాన న‌టుడు మాత్ర‌మే కాదు.
తెలుగు ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసి స‌గ‌ర్వంగా త‌లెత్తుకునేలా చేసిన మ‌హోన్న‌త నాయ‌కుడు.

వెండితెర‌పై జాన‌ప‌ద‌, పౌరాణిక‌, సాంఘిక ఇలా జోన‌ర్ ఏదైనా త‌న‌దైన న‌ట‌న‌తో చెర‌గ‌ని ముద్ర‌వేసిన గొప్ప న‌టుడు. ఆయ‌న పోషించిన‌న్ని పౌరాణిక పాత్ర‌లు మ‌రో న‌టుడు చేయ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఆయ‌న పేజీలు సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ‌న‌వి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

సినీ ప్ర‌స్థానంలో ఎలాంటి ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకున్నారో ఆ త‌ర్వాత తెలుగుదేశం పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తీరును ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. మరి అలాంటి ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను వెండితెరపై ఆవిష్క‌రించిన ప్ర‌య‌త్న‌మే ఇది.

ఆయ‌న త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో న‌టించిన ఎన్‌.టి.ఆర్ బ‌యోపిక్ మొద‌టి భాగం ‘క‌థానాయ‌కుడు’ బుధవారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్త‌కం అనడంలో సందేహం లేదు. దాని గురించి అభిమానుల‌కు, తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు తెలియ‌నిది ఏమీ లేదు. ఎన్టీఆర్ సినీ నేప‌థ్యం గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే, ఆయ‌న కుటుంబానికి ఎంత విలువ ఇస్తారు.

ముఖ్యంగా బ‌స‌వ‌తార‌క‌మ్మ‌కు ఆయ‌న ఎంత ప్రాధాన్యం ఇస్తార‌న్న‌ది ఎవ‌రికీ తెలియ‌దు. ఆ విశేషాల‌న్నీ ‘ఎన్‌.టి.ఆర్‌: క‌థానాయ‌కుడు’లో చూస్తాం. ఒక ర‌కంగా ఇది ఎన్టీఆర్ క‌థ అన‌డం క‌న్నా బ‌స‌వ‌తార‌కం క‌థ అన‌డం అతిశయోక్తికాదు. ఆమె కోణంలో నుంచి ఈ క‌థ మొద‌లైంది. ఆమె కోణం నుంచే ఈ క‌థ సాగుతుంది. బ‌స‌వ‌తార‌కం (విద్యాబాల‌న్‌) క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ ఉంటుంది.

ఆమె ఆరోగ్య ప‌రిస్థితి గురించి హ‌రికృష్ణ‌(క‌ల్యాణ్‌రామ్‌) తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతూ క‌నిపించ‌డంతో సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. అప్పుడు చికిత్స తీసుకుంటున్న బ‌స‌వ‌తార‌కం ఎన్టీఆర్ ఆల్బ‌మ్‌ను తిర‌గేస్తూ ఉండ‌టంతో ఎన్‌.టి.ఆర్‌. అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ఎన్టీఆర్ (బాల‌కృష్ణ‌) బాల్యం ఏంటి? ఆయ‌న ఎలా ఎదిగారు? సినిమాల‌పై ఎందుకు వ్యామోహం పెరిగింది? సినిమాల్లో ఎలా రాణించాడు? ఒక సాధార‌ణ రైతు బిడ్డ గొప్ప స్టార్‌గా ఒక్కో అడుగు వేసుకుంటూ ఎలా వెళ్లాడన్న‌ది క‌థ‌. ఎన్టీఆర్ ప్ర‌స్థానంతో మొద‌లైన చిత్రం ఎన్టీఆర్ తెలుగుదేశం ప్ర‌క‌ట‌న‌తో ముగుస్తుంది. మ‌రి తండ్రి పాత్ర‌లో బాల‌కృష్ణ ఎలా మెప్పించారు.

బ‌స‌వ‌తార‌కంగా విద్యాబాల‌న్ ఎలాంటి న‌ట‌న క‌న‌బ‌రిచింది. తెలుగువారి అభిమాన న‌టుడు ఎన్టీఆర్ సినీ జీవితం ఎలా సాగిందో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే! ఎన్టీఆర్ చ‌రిత్ర‌ను సినిమా తీయాల‌న్న‌ది ఒక గొప్ప ఆలోచ‌న‌. దానికి త‌గిన న‌టీన‌టులు సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు దొరికారు. ఎన్టీఆర్ జీవితంలో ఏం చూడాల‌నుకుంటున్నారో? ఏం తెలుసుకోవాల‌నుకుంటారో? అవ‌న్నీ తెర‌పై చూపించాడు ద‌ర్శ‌కుడు క్రిష్ జాగర్లమూడి. ఎన్టీఆర్ సినిమా రంగ ప్ర‌వేశం చేసిన త‌ర్వాత ఆయ‌న పోషించిన పాత్ర‌ల‌న్నీ ప్ర‌తి ఐదు నిమిషాల‌కొక‌సారి మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి. అదంతా పండ‌గ‌లా ఉంటుంది. ఆయా పాత్ర‌ల్లో బాల‌కృష్ణ అభిమానుల‌ను అల‌రిస్తారు.

ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌పై ఎక్కువ దృష్టిపెట్టాడు. ఎన్టీఆర్‌-బ‌స‌వ‌తారకంల మ‌ధ్య ఉన్న అనుబంధం చూసి ఆశ్చ‌ర్య‌పోతారు. ఒక భ‌ర్త‌, భార్య ఇంత‌లా ప్రాధాన్యం ఇస్తారా? అనిపిస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న ప్ర‌తి మ‌లుపు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు ద‌ర్శ‌కుడు. కొన్ని స‌న్నివేశాలు రోమాలు నిక్క‌బొడిచేలా ఉంటాయి. కుటుంబం? సినిమా? ఏది ముఖ్యం అంటే నాకు సినిమానే ముఖ్య‌మ‌ని ప్రారంభ స‌న్నివేశాల్లో ఎందుకు ఎన్టీఆర్ చెప్పార‌నే దానికి స‌మాధానం విరామానికి ముందు తెలుస్తుంది.

త‌న‌యుడు చావుబ‌తుకుల్లో ఉన్నా స‌రే నిర్మాత న‌ష్ట‌పోకూడ‌ద‌న్న ఉద్దేశంతో షూటింగ్‌కు వ‌చ్చిన ఒక మ‌హాన‌టుడిని తెర‌పై చూస్తాం. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో ఎందుకు రావాల‌ని అనుకుంటున్నాడు? అందుకు ప్రేరేపించిన అంశాలు ఏంటి? క‌థానాయ‌కుడి జీవితం నుంచి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎలా ఎద‌గాల‌నుకున్నాడ‌ది ప్రీక్లైమాక్స్‌లో క‌నిపిస్తుంది. ‘దివిసీమ’ ఉప్పెన నేప‌థ్యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు, గుండెల‌ను మెలితిప్పేలా చూపించాడు ద‌ర్శ‌కుడు. అభిమానుల‌కు తెలిసిన విషయాలు, తెలియ‌ని విష‌యాలు అత్యంత నాట‌కీయంగా, స‌హ‌జంగా ద‌ర్శ‌కుడు తెర‌పైకి తీసుకొచ్చాడు. ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను తెర‌పై చూపించ‌డం అనుకున్నంత సుల‌భం కాదు.

ఎందుకంటే ప్ర‌తి పాత్ర‌కు ఒక ఔచిత్యం ఉంది. దానికి త‌గిన న‌టీన‌టుల‌ను ఎంచుకోవాలి. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు క్రిష్‌, అత‌ని బృందం నూటికి నూరుపాళ్లు విజ‌యం సాధించింది. ప్ర‌తి పాత్ర పోత పోసిన‌ట్లే అనిపిస్తుంది. చాలా పాత్ర‌లు కేవ‌లం ఒక్క స‌న్నివేశానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైన‌వే. అయినా, అలాంటి స‌న్నివేశాలు కూడా ర‌క్తిక‌ట్టాయి. ఎన్టీఆర్‌గా బాల‌కృష్ణ‌ ఎన్నో విభిన్న గెట‌ప్‌ల్లో క‌నిపించారు. ప్ర‌తి రూపానికి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ముఖ్యంగా కృష్ణుడు, వెంక‌టేశ్వ‌ర‌స్వామి పాత్ర‌ల్లో బాల‌కృష్ణ చూడ‌టం అభిమానుల‌కు నిజంగా పండ‌గ‌లా ఉంటుంది. ఎన్టీఆర్ యువ‌కుడిగా ఉన్న స‌మ‌యంలో బాల‌కృష్ణ క‌నిపించిన స‌న్నివేశాలు అంత‌గా అత‌కలేదేమోన‌నిపిస్తుంది.

బాల‌య్య వ‌య‌సు దృష్ట్యా ఆ ఇబ్బంది ఉండేదే! ఒక వేళ ఆ పాత్ర‌లు మ‌రొక‌రు చేసి ఉంటే, అభిమానులు ఎలా తీసుకుంటారోన‌న్న భ‌యంతో చిత్ర బృందం రిస్క్ చేయ‌లేదేమో! బ‌స‌వ‌తార‌కంగా విద్యాబాల‌న్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఆమెను ఎంచుకోవ‌డ‌మే ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం. ఎందుకంటే? ఇది బ‌స‌వ‌తార‌కం క‌థ కాబ‌ట్టి. ఈ పాత్ర త‌ర్వాత అభిమానుల‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకునేది అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ చాలా చ‌క్క‌గా క‌నిపించారు. కొన్ని స‌న్నివేశాల్లో నిజంగా ఏయ‌న్నారేమోన‌నిపించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎన్టీఆర్‌-ఏయ‌న్నార్‌ అనుబంధాన్ని కూడా తెరపై అందంగా ఆవిష్క‌రించారు.

ఒక ఏయ‌న్నార్ బ‌యోపిక్‌లా కూడా అనిపిస్తుంది. చంద్ర‌బాబుగా దగ్గుబాటి రానా పాత్ర చివ‌రిలో త‌ళుక్కున మెరుస్తుంది. ద్వితీయార్థానికి ఆ పాత్ర ఆయువుప‌ట్టు అని ఇప్పుడే తెలిసిపోతుంది. పేరున్న న‌టీన‌టులంద‌రూ చిన్న చిన్న పాత్ర‌ల్లో మెరిసి, ఆ పాత్ర‌ల విశిష్ట‌త‌ను పెంచారు. ఈ సినిమా అత్యున్న‌తంగా ఉంటుంది. ద‌ర్శ‌కుడు క్రిష్ ప్ర‌తిభ‌ను మెచ్చుకోక త‌ప్ప‌దు. అభిమానుల‌కు ఏం కావాలో అవ‌న్నీ చూపించ‌గ‌లిగారు. ఎన్టీఆర్ చ‌రిత్ర ఒక పాఠంలా మిగిలిపోయేలా ఈ సినిమా ఉంటుంది. ఎం.ఎం. కీర‌వాణి అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన బ‌లం. జ్ఞాన శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.

ప్ర‌తి ఫ్రేమూ చాలా అందంగా చూపించారు. అన్నింటిక‌న్నా బుర్రా సాయిమాధ‌వ్ రాసిన సంభాష‌ణ‌లు ఆయువుప‌ట్టు. ప్ర‌తి స‌న్నివేశంలో ఒక మెరుపులాంటి సంభాష‌ణ ఉంటుంది. ఎన్టీఆర్ ఉద్యోగం కోసం వెళ్లిన‌ప్పుడు లంచం అడిగితే ఎవ‌డి ఇంటికి వాడు య‌జ‌మాని. లంచం తీసుకునేవాడి ఇంటికి ఎంత‌మంది య‌జ‌మానులు అన్న డైలాగ్ చ‌ప్ప‌ట్లు కొట్టిస్తుంది. మొత్తం చూస్తే, అటు న‌టీన‌టులు, ఇటు సాంకేతిక నిపుణులు చేసిన అద్భుత ప్ర‌య‌త్నం ఎన్‌.టి.ఆర్. ఎన్టీఆర్ ఎదిగిన తీరు, గెట‌ప్‌లు, భావోద్వేగ స‌న్నివేశాలు, ఎన్టీఆర్‌-బ‌స‌వ‌తార‌కం మధ్య వచ్చే సన్నివేశాలు, ఎన్టీఆర్‌-ఏయ‌న్నార్‌ మధ్య పెనవేసుకున్న మైత్రి, సంభాష‌ణలు ఈ చిత్రానికి బలాలైతే, నిడివి ఎక్కువ‌గా ఉండ‌టం బలహీనతగా చెప్పవచ్చు. అంతకుమించి ఈ చిత్రంలో ఎంచడానికి ఇంకేమీ లేవనడం నిజం.

చివరి 20 నిమిషాలలో వచ్చే సన్నివేశాలు సినిమాని నిలబెట్టాయని చెప్పాలి. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ కోసం అభిమానుల్ని వెయిటింగ్ చేయించేలా చిత్రం ముగింపు ఉండడం విశేషం. ఎన్టీఆర్ ‘తోటరాముడు’గా నటించే సీన్స్, సావిత్రితో నటించే సన్నివేవాలు చాలా బావున్నాయి. దర్శకుడు క్రిష్ తన ప్రతిభ చూపించారు. ఫస్ట్ హాఫ్ కంటే సెంకండ్ హాఫ్ చాలా బావుందన్న టాక్ వినిపించింది. అభిమానులు మెచ్చే అంశాలు సెకండ్ హాఫ్‌లో ఎక్కువగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయం.